జనసేన గందరగోళ నిర్ణయం
బద్వేలులో బీజేపీకి మద్దతు ఇస్తామంటూ ప్రకటన జనసేన బలపడకపోవడానికి కారణం.. ఆ పార్టీ తీసుకొనే గందరగోళ నిర్ణయాలు అని చెప్పక తప్పదేమో. తొలుత బీజేపీ, టీడీపీ దోస్తి కట్టిన జనసేనాని.. ఆ తర్వాత కమ్యూనిస్టులు, బీఎస్పీ వంటి ప్రగతి శీల పార్టీలతో జత కట్టారు. చివరకు మళ్లీ బీజేపీ పంచన చేరారు. పవన్ కల్యాణ్ నిర్ణయాలు అప్పుడప్పుడూ ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. బద్వేలు ఉప ఎన్నిక కోసం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. బద్వేలు […]
- బద్వేలులో బీజేపీకి మద్దతు ఇస్తామంటూ ప్రకటన
జనసేన బలపడకపోవడానికి కారణం.. ఆ పార్టీ తీసుకొనే గందరగోళ నిర్ణయాలు అని చెప్పక తప్పదేమో. తొలుత బీజేపీ, టీడీపీ దోస్తి కట్టిన జనసేనాని.. ఆ తర్వాత కమ్యూనిస్టులు, బీఎస్పీ వంటి ప్రగతి శీల పార్టీలతో జత కట్టారు. చివరకు మళ్లీ బీజేపీ పంచన చేరారు. పవన్ కల్యాణ్ నిర్ణయాలు అప్పుడప్పుడూ ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. బద్వేలు ఉప ఎన్నిక కోసం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. బద్వేలు ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది.
వెంకట సుబ్బయ్య భార్య సుధకు వైసీపీ టికెట్ ఇచ్చింది. దీంతో మరణించిన అభ్యర్థి కుటుంబసభ్యులకు టికెట్ ఇచ్చారు కాబట్టి.. గత సంప్రదాయాలను పాటించి తాము పోటీకి దూరంగా ఉంటున్నామని పవన్ కల్యాణ్ ప్రకటించారు. టీడీపీ కూడా దాదాపు ఇదే రకమైన అభిప్రాయంతో పోటీ నుంచి తప్పుకున్నది. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ లో అసలు ఉనికిలో ఉన్నాయో లేవో కూడా తెలియని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు మాత్రం.. ఇక్కడ తాము పోటీచేయబోతున్నట్టు ప్రకటించాయి.
బీజేపీకి జనసేన మిత్రపక్షం..మరి జనసేన బరిలో లేదు కాబట్టి సైలెంట్ గా ఉంటుందా? లేక బీజేపీకి మద్దతు ఇస్తుందా? అన్న విషయంపై ఉత్కంఠ నెలకొన్నది. చివరకు జనసేన పార్టీ ముఖ్యనేత నాదెండ్ల మనోహర్ ఓ ప్రకటన చేశారు. తాము బీజేపీకి మద్దతు ఇవ్వబోతున్నట్టు ఆయన ప్రకటించారు.
ఇదిలా ఉంటే జనసేన తీరుపై విమర్శలు వస్తున్నాయి. సంప్రదాయాన్ని గౌరవించి పోటీ నుంచి తప్పకుంటామన్న మీరు.. ఇప్పుడు బీజేపీ అభ్యర్థికి ఎలా మద్దతు ఇస్తారంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. జనసేన మద్దతుతో ఈ ఎన్నికల్లో బీజేపీ ఏ మేరకు ప్రభావం చూపుతుందో వేచి చూడాలి. టీడీపీ, జనసేన పోటీలో లేవు కాబట్టి.. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు తమకే పడతాయని బీజేపీ నేతలు భావిస్తున్నారు. వాళ్ల అంచనాలు నిజమవుతాయా? లేక తలకిందులవుతాయా? అన్నది వేచి చూడాలి.