ఇంధనానికి కరువొచ్చింది.. ప్రపంచం అల్లాడిపోతోంది..
ప్రపంచ వ్యాప్తంగా సహజ ఇంధన వనరులకు కరువొచ్చింది. బొగ్గు, సహజవాయువు, పెట్రోలియం ఉత్పత్తుల నిల్వలు అడుగంటిపోతున్నాయి. ఈ క్రమంలో ఉత్పత్తి తగ్గిపోతోంది, మరోవైపు రేట్లు భారీగా పెరిగిపోతున్నాయి. ప్రపంచ దేశాలన్నీ ఇంధన కరువు వల్ల వచ్చే నష్టాలతో అల్లాడిపోతున్నాయి. ఐరోపా దేశాలను గ్యాస్ కొరత వేధిస్తోంది, చైనాలో బొగ్గు నిల్వలు లేక పరిశ్రమలు మూతపడుతున్నాయి. బ్రిటన్ లో పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డ్ లు దర్శనమిస్తున్నాయి. స్థానికంగా ఇంధనం కోసం కొట్లాటలు జరక్కుండా అక్కడి ప్రభుత్వం […]
ప్రపంచ వ్యాప్తంగా సహజ ఇంధన వనరులకు కరువొచ్చింది. బొగ్గు, సహజవాయువు, పెట్రోలియం ఉత్పత్తుల నిల్వలు అడుగంటిపోతున్నాయి. ఈ క్రమంలో ఉత్పత్తి తగ్గిపోతోంది, మరోవైపు రేట్లు భారీగా పెరిగిపోతున్నాయి. ప్రపంచ దేశాలన్నీ ఇంధన కరువు వల్ల వచ్చే నష్టాలతో అల్లాడిపోతున్నాయి.
ఐరోపా దేశాలను గ్యాస్ కొరత వేధిస్తోంది, చైనాలో బొగ్గు నిల్వలు లేక పరిశ్రమలు మూతపడుతున్నాయి. బ్రిటన్ లో పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డ్ లు దర్శనమిస్తున్నాయి. స్థానికంగా ఇంధనం కోసం కొట్లాటలు జరక్కుండా అక్కడి ప్రభుత్వం మిలట్రీని కూడా రంగంలోకి దింపింది. ఇక భారత్ లో కూడా బొగ్గు ఆధారిత పవర్ ప్లాంట్ లు పూర్తి సామర్థ్యంతో పనిచేసి చాలా కాలమైంది. థర్మల్ పవర్ స్టేషన్లలో విద్యుత్ ఉత్పత్తి చాలా వరకు తగ్గిపోయింది.
భారీగా పెరుగుతున్న ధరలు..
యూరప్ లో సహజవాయువు ధరలు ఇటీవల కాలంలో 400 శాతం పెరిగాయి. విద్యుత్ రేట్లు 250శాతం పెరిగాయి. కరోనా కష్టకాలం తర్వాత చైనాలో ఫ్యాక్టరీలు మరోసారి మూతబడ్డాయి. బొగ్గు నిల్వలు తక్కువగా ఉండటంతో విద్యుత్ ఉత్పత్తి పూర్తిగా పడిపోయి అక్కడ పరిశ్రమలు మూతబడ్డాయి. దీంతో చైనాలో విద్యుత్ సరఫరాపై పూర్తి స్థాయిలో ప్రభుత్వం నియంత్రణ విధించింది. బారత్ లో కూడా ఇంధన ధరలు ఇటీవల కాలంలో భగ్గుమంటున్నాయి. 60శాతానికి పైగా గ్యాస్ ధరలు పెరిగాయి. చేష్టలుడిగి చూడటం మినహా ధరల నియంత్రణకు ప్రభుత్వం ఏమీ చేయలేకపోతోంది.
ప్రత్యామ్నాయాలపై దృష్టి..
ఇంధన కొరతతో ధరలు విపరీతంగా పెరగడంతో ప్రజల జీవనం ప్రభావితం అవుతోంది. నిత్యావసరాల ధరలన్నీ భారీగా పెరుగుతున్నాయి. విద్యుత్ ఛార్జీలను భరించలేక చిన్నా చితకా ఫ్యాక్టరీలు మూతబడుతున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వాలు పునరుత్పాదక శక్తి ఇంధన వనరులపై ఆధారపడాల్సిన అవసరం ముంచుకొచ్చింది. ఇప్పటికే చైనాలో ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. బ్రిటన్ కూడా పవన్ విద్యుత్ ఉత్పత్తిని పెంచేందుకు సిద్ధపడుతోంది. భారత్ లాంటి ఉష్ణమండల దేశాల్లో సోలార్ పవర్ చాలా కీలకం. అయితే సూర్య శక్తిని విద్యుత్ శక్తిగా మార్చే పరికరాల కొనుగోలుకు భారీగా ఖర్చు చేయాల్సి రావడంతో మన దగ్గర పునరుత్పాదక ఇంధన వినియోగం పెరగలేదు. కానీ సహజ వనరులు పూర్తిగా లభ్యంకాని దశకు చేరుకుంటే మాత్రం ప్రత్యామ్నాయాలే పూర్తి స్థాయిలో అవసరం అవుతాయి.