Telugu Global
National

వాన పడితే ఢిల్లీలో బతకడం కష్టం..

అరగంట వాన చాలు ఢిల్లీని అతలాకుతలం చేయడానికి, గంటసేపు వర్షం పడిందంటే.. భారత రాజధానిలో పడవల్లో ప్రయాణించాల్సిందే. అసలు ఢిల్లీ ఎందుకు మునుగుతోంది. దేశ రాజధానికి ఏంటీ దౌర్భాగ్యం. ప్రతి ఏడాదీ వానలు, మునకలు ఢిల్లీ వాసులకి అలవాటైపోయినా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడంలేదు..? ఢిల్లీ భౌగోళిక స్వరూపంలోనే తేడా.. ఢిల్లీ నగరంలో డ్రైనేజీ నీరంతా యమునా నదిలోకి పోయే ఏర్పాటు ఉంది. 1976లో అప్పటి ఢిల్లీ జనాభా, అవసరాల మేరకు ఈ డ్రైనేజీ సిస్టమ్ ని డిజైన్ […]

వాన పడితే ఢిల్లీలో బతకడం కష్టం..
X

అరగంట వాన చాలు ఢిల్లీని అతలాకుతలం చేయడానికి, గంటసేపు వర్షం పడిందంటే.. భారత రాజధానిలో పడవల్లో ప్రయాణించాల్సిందే. అసలు ఢిల్లీ ఎందుకు మునుగుతోంది. దేశ రాజధానికి ఏంటీ దౌర్భాగ్యం. ప్రతి ఏడాదీ వానలు, మునకలు ఢిల్లీ వాసులకి అలవాటైపోయినా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడంలేదు..?

ఢిల్లీ భౌగోళిక స్వరూపంలోనే తేడా..
ఢిల్లీ నగరంలో డ్రైనేజీ నీరంతా యమునా నదిలోకి పోయే ఏర్పాటు ఉంది. 1976లో అప్పటి ఢిల్లీ జనాభా, అవసరాల మేరకు ఈ డ్రైనేజీ సిస్టమ్ ని డిజైన్ చేశారు. పశ్చిమ ఢిల్లీలో వర్షపు నీరు ఎటువంటి అడ్డంకి లేకుండా కిందకు వచ్చేస్తుంది. అదే సమయంలో తూర్పు ఢిల్లీలో మాత్రం గల్లీ గల్లీ నీట మునగాల్సిందే.

కాంక్రీట్ జంగిల్ అసలు కారణం..
గతంలో ఢిల్లీలో వర్షం పడితే 50శాతం నీరు భూమిలో ఇంకిపోయేది, మిగతా 50శాతం నీరు రన్ ఆఫ్ వాటర్.. అంటే భూమిపైనుంచి ప్రవహించి బయటకు వెళ్లే నీరుగా ఉండేది. అయితే రాను రాను జనావాసాలు పెరగడం, నగరం కాంక్రీట్ జంగిల్ గా మారడంతో.. రన్ ఆఫ్ వాటర్ అనేది 90శాతానికి పెరిగింది. నగరంలో వర్షం పడితే కేవలం 10శాతం నీరు మాత్రమే భూమిలోకి ఇంకిపోతుంది, మిగతాదంతా డ్రైనేజీల ద్వారా బయటకు వెళ్లిపోవాలి. అయితే డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటం, మధ్య మధ్యలో అడ్డంకులు ఉండటంతో వర్షం పడినప్పుడల్లా నగరం మునక వేస్తోంది.

మాస్టర్ ప్లాన్ అమలు ఎప్పుడు..?
ఢిల్లీలో మాస్టర్ ప్లాన్ అమలు చేస్తేనే ఈ మునక కష్టాలు తీరే అవకాశం ఉంది. 2012లోనే ఈ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఐఐటీ ఢిల్లీ అధ్యాపకులు 80లక్షల రూపాయలతో కొత్త వ్యవస్థ తీసుకొస్తామని ప్రతిపాదన పంపారు. కానీ ప్రభుత్వం బయటి వ్యక్తులకు టెండర్లు ఇవ్వాలనుకుంటోంది. 11కోట్లకు ప్రైవేటు కంపెనీలు ముందుకొచ్చినా పని ముందుకు సాగలేదు. ఐఐటీ నిపుణులు ఇచ్చిన నివేదికపై అధికారులు అధ్యయనం చేయడం ఆలస్యం కావడం వల్లే ఈ దుస్థితి. డ్రైనేజీ వ్యవస్థలో లోపాలున్నాయని ఐఐటీ ఇచ్చిన నివేదికతో స్థానిక అధికారులు విభేదిస్తున్నారు. దీంతో వారి అధ్యయనం పూర్తి కాలేదు, మాస్టర్ ప్లాన్ అమలులోకి రాలేదు. ప్రభుత్వాలు మారినా ఢిల్లీకి మునక బాధ మాత్రం తప్పడంలేదు.

First Published:  4 Oct 2021 5:33 AM IST
Next Story