అధికారం సీఎందే.. అధిష్టానం సిద్ధూనే..
పంజాబ్ పీసీసీ పీఠానికి రాజీనామా చేసినట్టే చేసి తాను అనుకున్నది సాధించుకున్నారు సిద్ధూ. ముఖ్యమంత్రిగా చరణ్ జీత్ సింగ్ చన్నీకి అధిష్టానం బాధ్యతలు అప్పగించినా.. పంజాబ్ వరకు సిద్ధూయే అధిష్టానం అనేంతలా తన పంతం నెగ్గించుకున్నారు. తాజాగా సిద్ధూ ఇలా ట్వీట్ చేశారో లేదో అలా డీజీపీకి స్థాన చలనం కలిగిస్తామని ప్రకటించారు సీఎం చరణ్ జీత్. అంతే కాదు, సిద్ధూతో సంప్రదించి కొత్త డీజీపీని ఎంపిక చేస్తామని చెప్పారు. చరణ్ రాజీ కోరుకుంటున్నారా..? అమరీందర్ సింగ్ […]
పంజాబ్ పీసీసీ పీఠానికి రాజీనామా చేసినట్టే చేసి తాను అనుకున్నది సాధించుకున్నారు సిద్ధూ. ముఖ్యమంత్రిగా చరణ్ జీత్ సింగ్ చన్నీకి అధిష్టానం బాధ్యతలు అప్పగించినా.. పంజాబ్ వరకు సిద్ధూయే అధిష్టానం అనేంతలా తన పంతం నెగ్గించుకున్నారు. తాజాగా సిద్ధూ ఇలా ట్వీట్ చేశారో లేదో అలా డీజీపీకి స్థాన చలనం కలిగిస్తామని ప్రకటించారు సీఎం చరణ్ జీత్. అంతే కాదు, సిద్ధూతో సంప్రదించి కొత్త డీజీపీని ఎంపిక చేస్తామని చెప్పారు.
చరణ్ రాజీ కోరుకుంటున్నారా..?
అమరీందర్ సింగ్ సీఎం పీఠం నుంచి ఎందుకు వైదొలగాల్సి వచ్చిందో అందరికీ తెలిసిన విషయమే. అక్కడ ఎమ్మెల్యేలు ఆయనవైపు ఉన్నారా లేదా అనే విషయాన్ని పక్కనపెడితే, అధిష్టానం మాత్రం సిద్ధూవైపే ఉంది. సిద్ధూతో అమరీందర్ కి పడలేదు. అందుకే ఆయన వెళ్లిపోయారు. ఇప్పుడు కొత్తగా ఆ స్థానంలోకి వచ్చిన చరణ్ జీత్ మాత్రం సిద్ధూతో రాజీ ఫార్ములాకి వచ్చేశారు. ఆయన పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేసిన వెంటనే తానే స్వయంగా వెళ్లి సర్దిచెప్పి వచ్చారు. కీలక నిర్ణయాలన్నీ సిద్ధూతో చర్చించాకేనని తేల్చి చెప్పారు. ప్రభుత్వానికి పీసీసీకి మధ్య వారధిగా ఓ కమిటీ ఏర్పాటు చేయడానికి కూడా సిద్ధమయ్యారు.
తాజాగా పంజాబ్ డీజీపీ, అడ్వొకేట్ జనరల్ పై సిద్ధూ అసహనం వ్యక్తం చేశారు. వారి పనితీరుని తప్పుబడుతూ ఆయన ఓ ట్వీట్ వేశారు. వారిద్దర్నీ మార్చాల్సిన అవసరం ఉందన్నారు. ఆ ట్వీట్ బయటకొచ్చిన గంటల వ్యవధిలోనే చరణ్ జీత్ సింగ్ వారిని మార్చేస్తున్నట్టు ప్రకటించారు. అది కూడా సిద్ధూతో చర్చించి కొత్తవారిపై నిర్ణయం తీసుకుంటామన్నారు.
ఇంతకీ సిద్ధూ పీసీసీ అధ్యక్షుడా..? కాదా..?
పీసీసీ పదవికి రాజీనామా చేశానని అధికారికంగా ప్రకటించిన సిద్ధూ.. ఆ తర్వాత వెనక్కి తగ్గిన విషయాన్ని మాత్రం ఎక్కడా బహిరంగ పరచలేదు. పోస్ట్ ఉన్నా లేకపోయినా.. తాను మాత్రం రాహుల్, ప్రియాంకకు విధేయుడినంటూ ప్రకటించుకున్నారాయన. అంతలా కాకా పట్టిన తర్వాత ఇంకా ఆయన్ను అధిష్టానం ఎందుకు పక్కనపెడుతుందని అంటున్నారు పంజాబ్ నేతలు. దళిత నేతకు సీఎం కుర్చీ ఇచ్చామనే సింపతీతో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోవాలనేది కాంగ్రెస్ పన్నాగం. పరోక్షంగా పెత్తనమంతా సిద్ధూకే అప్పగించి పంజాబ్ ఎన్నికలకు ఆ పార్టీ సిద్ధమవుతోంది.