గొంతు నొక్కడమేంటి.. బ్రహ్మాండంగా మాట్లాడండి..
తెలంగాణ శాసన సభ సమావేశాలు వాడివేడిగా సాగాయి. సీఎం కేసీఆర్, కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య ఆసక్తికర వాదోపవాదాలు జరిగాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క, ప్రతిపక్ష ఎమ్మెల్యేల మైక్ కట్ చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ప్రతిపక్షాల గొంతు నొక్కడం వల్ల అధికార పార్టీ సభ్యులకు ఏం ఆనందం కలుగుతుందో అర్థం కావడం లేదని అన్నారామె. గ్రామ పంచాయతీలకు ఇచ్చే నిధుల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గొప్పలు చెప్పుకుంటున్నాయని, అసలు ఎవరి వాటా ఎంతో స్పష్టం చేయాలని అసెంబ్లీలో నిలదీశారు. […]
తెలంగాణ శాసన సభ సమావేశాలు వాడివేడిగా సాగాయి. సీఎం కేసీఆర్, కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య ఆసక్తికర వాదోపవాదాలు జరిగాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క, ప్రతిపక్ష ఎమ్మెల్యేల మైక్ కట్ చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ప్రతిపక్షాల గొంతు నొక్కడం వల్ల అధికార పార్టీ సభ్యులకు ఏం ఆనందం కలుగుతుందో అర్థం కావడం లేదని అన్నారామె. గ్రామ పంచాయతీలకు ఇచ్చే నిధుల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గొప్పలు చెప్పుకుంటున్నాయని, అసలు ఎవరి వాటా ఎంతో స్పష్టం చేయాలని అసెంబ్లీలో నిలదీశారు. మంత్రులు సమాధానం చెప్పాల్సిన సందర్భంలో ముఖ్యమంత్రి ఎందుకు జోక్యం చేసుకుంటున్నారని అడిగారు. ప్రభుత్వానికి డబ్బా కొట్టేలా అధికార పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడుతుంటే మాత్రం స్పీకర్ గంటల కొద్దీ సమయం ఇస్తున్నారని, ప్రజా సమస్యలపై ప్రతిపక్ష ఎమ్మెల్యేలు మాట్లాడటం మొదలు పెడితే మైక్ కట్ చేస్తున్నారని మండిపడ్డారు. సభ్యుల హక్కులు, సభా సంప్రదాయాలను సీఎం గౌరవించాలన్నారు. ప్రతిపక్షాల ఆరోపణలను నివృత్తి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని చెప్పారు సీతక్క.
అడ్డగోలుగా మాట్లాడొద్దు..
రాష్ట్రంలో పంచాయతీల నిధులు దారి మళ్లిస్తున్నారంటూ కాంగ్రెస్ సభ్యులు చేసిన ఆరోపణలు అవాస్తవం అని అన్నారు సీఎం కేసీఆర్. అడ్డగోలుగా మాట్లాడొద్దని ప్రతిపక్షాలకు హితవు పలికారు. దేశంలోనే తెలంగాణ సర్పంచ్ లు గర్వంగా తలెత్తుకునేలా చేశామని వివరించారు. తెలంగాణలోని గ్రామాలను చూసి పొరుగు రాష్ట్రాలు ఆశ్చర్యపోతున్నాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్నో అవార్డులు కూడా తెలంగాణకు వచ్చాయని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో పంచాయతీల పరిధిలో ఒక్కో వ్యక్తిపై సగటును 4రూపాయలు ఖర్చు చేస్తే ఇప్పుడు తమ ప్రభుత్వం 650 రూపాయలు ఖర్చు చేస్తోందని చెప్పారు.
అద్భుతంగా మాట్లాడండి.. జనం చూస్తారు..
ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారంటూ ఎమ్మెల్యే సీతక్క చేసిన వ్యాఖ్యలపై కూడా సీఎం కేసీఆర్ స్పందించారు. ‘‘ఎవరు గొంతు నొక్కుతున్నారు? మీరు బ్రహ్మాండంగా.. అద్భుతంగా మాట్లాడండి.. మేం మీకంటే ఇంకా అద్భుతంగా మాట్లాడతాం. మనకంటే అద్భుతంగా ప్రజలు గమనిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సర్పంచ్ లు బాధపడిన మాట వాస్తవం. ఇప్పుడు వారు సంతోషంగా ఉన్నారు’’ అని ముక్తాయించారు.