Telugu Global
NEWS

పవన్ వర్సెస్ నాని.. కొనసాగిన ఆరోపణల పర్వం..

రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తో మొదలైన జనసేన-వైసీపీ ఆరోపణల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. మంగళగిరిలో పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో వైసీపీపై పవన్ కల్యాణ్ విరుచుకుపడగా.. సినీ నిర్మాతలతో సమావేశమైన మంత్రి పేర్ని నాని.. జనసేనానిపై మరోసారి మండిపడ్డారు. రాబోయేది జనసేన రాజ్యమే.. 2024 ఎన్నికల్లో వైసీపీకి గుణపాఠం చెబుతామని, ఏపీలో జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు పవన్ కల్యాణ్. 2019లో వైసీపీకి వచ్చిన 151 సీట్లు 15కి […]

పవన్ వర్సెస్ నాని.. కొనసాగిన ఆరోపణల పర్వం..
X

రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తో మొదలైన జనసేన-వైసీపీ ఆరోపణల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. మంగళగిరిలో పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో వైసీపీపై పవన్ కల్యాణ్ విరుచుకుపడగా.. సినీ నిర్మాతలతో సమావేశమైన మంత్రి పేర్ని నాని.. జనసేనానిపై మరోసారి మండిపడ్డారు.

రాబోయేది జనసేన రాజ్యమే..
2024 ఎన్నికల్లో వైసీపీకి గుణపాఠం చెబుతామని, ఏపీలో జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు పవన్ కల్యాణ్. 2019లో వైసీపీకి వచ్చిన 151 సీట్లు 15కి పడిపోతాయని, పాండవుల సభ ఎలా ఉంటుందో అప్పుడు చూపిస్తామని అన్నారు. జనసేన ఒక ఎమ్మెల్యే, 180 ఎంపీటీసీ, రెండు జడ్పీటీసీ స్థానాలు సంపాదించిందని, భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్‌ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పారు. 2011లో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌ లో కలిపేసిన సందర్భాన్ని గుర్తుచేస్తూ ప్రజలకు క్షమాపణ చెప్పారు. తనకు ముఖ్యమంత్రి పదవి వచ్చినా, రాకపోయినా ప్రజలకు అండగా ఉంటానని అన్నారు. ఆ నమ్మకం ఉంటే గెలిపించాలని కోరారు. రాష్ట్రాభివృద్ధి, శాంతిభద్రతలనేవి ఎలా ఉంటాయో తాను చేసి చూపిస్తానని ప్రకటించారు. తాను రంగంలోకి దిగానని, దమ్ముంటే తనతో పోరాటానికి రావాలని వైసీపీ శ్రేణులకు సవాల్ విసిరారు.

అది కిరాయి రాజకీయ పార్టీ..
షామియానాలు అద్దెకిచ్చినట్టు పవన్ కల్యాణ్ తన జనసేన పార్టీని కిరాయికి ఇస్తుంటారని, దేశంలో ఎక్కడా లేని విధంగా కిరాయి రాజకీయ పార్టీని స్థాపించిన ఘనత పవన్‌ కల్యాణ్‌ కే దక్కుతుందని విమర్శించారు మంత్రి పేర్ని నాని. మచిలీపట్నంలో సినీ నిర్మాతలతో భేటీ అయిన ఆయన.. సినీరంగం పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందని స్పష్టం చేశారు. చిరంజీవి సహా టాలీవుడ్ ప్రముఖులు తనతో వ్యక్తిగతంగా మాట్లాడి పవన్‌ చేసిన ఆరోపణలకు, తెలుగు సినీ పరిశ్రమకు సంబంధం లేదని చెప్పారన్నారు నాని. ఆన్‌ లైన్‌ టికెటింగ్ విధానంపై నిర్మాతలు పలు సూచనలు చేశారని, వాటిని పరిగణనలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు. తన అధినేత వద్ద తాను పాలేరునేనని చెప్పిన నాని.. పవన్ కల్యాణ్ ఎవరి వద్ద పాలేరుగా చేస్తున్నారో చెప్పగలరా అని ప్రశ్నించారు. తన తల్లి తనకు సంస్కారం నేర్పిందని చెప్పారు. తనను అవమానించాలని చూస్తే ఆ అవమానాన్ని వారికే తిరిగి పరిచయం చేస్తానన్నారు. ఆవేశపూరిత ప్రసంగాలు చేయడం మినహా ఇప్పటివరకూ పవన్‌ సాధించింది ఏమీ లేదన్న విషయం తెలుసుకోవాలని హితవు పలికారు పేర్ని నాని.

First Published:  30 Sept 2021 3:06 AM IST
Next Story