అమెజాన్ వర్సెస్ ఆర్ఎస్ఎస్..
ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ పై ఆర్ఎస్ఎస్ అనుబంధ పత్రిక పాంచజన్యలో రాసిన కథనం కలకలం రేపింది. అమెజాన్ ను ‘ఈస్ట్ ఇండియా కంపెనీ 2.0’ గా పేర్కొంటూ ‘పాంచజన్య’లో ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలను అఖిల భారత వర్తకుల సమాఖ్య కూడా సమర్థించడం, ఆర్‌ఎస్‌ఎస్ పత్రిక చేసిన ఆరోపణలు తీవ్రమైనవని, వాటిని విస్మరించడానికి వీల్లేదని కాంగ్రెస్ పేర్కొనడంతో ఈ వ్యవహారం మరింత సంచలనంగా మారింది. అయితే అమెజాన్ వెంటనే దిద్దుబాటు చర్యలకు దిగడం విశేషం. చిన్న వ్యాపారులు, […]
ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ పై ఆర్ఎస్ఎస్ అనుబంధ పత్రిక పాంచజన్యలో రాసిన కథనం కలకలం రేపింది. అమెజాన్ ను ‘ఈస్ట్ ఇండియా కంపెనీ 2.0’ గా పేర్కొంటూ ‘పాంచజన్య’లో ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలను అఖిల భారత వర్తకుల సమాఖ్య కూడా సమర్థించడం, ఆర్‌ఎస్‌ఎస్ పత్రిక చేసిన ఆరోపణలు తీవ్రమైనవని, వాటిని విస్మరించడానికి వీల్లేదని కాంగ్రెస్ పేర్కొనడంతో ఈ వ్యవహారం మరింత సంచలనంగా మారింది. అయితే అమెజాన్ వెంటనే దిద్దుబాటు చర్యలకు దిగడం విశేషం. చిన్న వ్యాపారులు, కళాకారులు, సరఫరాదారులకు తాము తోడ్పాటు అందిస్తున్నామంటూ అమెజాన్ సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది
ఆర్ఎస్ఎస్ పత్రిక కథనం ఏంటి..?
“18 వ శతాబ్దంలో ఈస్ట్ ఇండియా కంపెనీ భారత దేశాన్ని అక్రమించుకోవడానికి చేసిన పనులే ఇప్పుడు అమెజాన్ కూడా చేస్తోంది, ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాలను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి కోట్లాది రూపాయల ముడుపులు చెల్లిస్తోంది. తద్వారా దేశంలో పాగా వేసి దేశీయ కంపెనీలను దెబ్బకొట్టి, వ్యాపారంలో గుత్తాధిపత్యం సంపాదించాలని అమెజాన్ చూస్తోంది” అంటూ ఆర్ఎస్ఎస్ తన సొంత వారపత్రిక పాంచజన్యలో పేర్కొంది.
ఈ ఆరోపణలను సమర్థించిన అఖిల భారత వర్తకుల సమాఖ్య ప్రతినిధులు.. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ సంస్థల వ్యాపార విధానాలు ఈస్ట్ ఇండియా కంపెనీ తరహాలోనే ఉన్నాయని చెప్పారు. మార్కెట్ లో పోటీని నాశనం చేయడం ద్వారా వీరు గుత్తాధిపత్యాన్ని సాధిస్తున్నారని అన్నారు. ఇప్పటికే ఆ రెండు సంస్థలు కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) విచారణను ఎదుర్కొంటున్నాయని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఈ వాదనను విస్మరించడానికి వీళ్లేదంటూనే.. ఆర్ఎస్ఎస్ పై విమర్శలు ఎక్కుపెట్టింది. వ్యవసాయ చట్టాల రద్దుకోసం రైతులు 10 నెలలుగా ఉద్యమిస్తుంటే.. సంఘ్ పరివార్ కు చెందిన భారతీయ కిసాన్ సంఘ్ ఒక్క రోజు కూడా అందులో పాల్గొనలేదని, ఇప్పుడు కూడా జాతీయ ప్రయోజనాలకోసం కాకుండా, కాషాయ పార్టీ ప్రయోజనాలకోసమే ఆర్ఎస్ఎస్ గళమెత్తిందని విమర్శించింది.
ఈ నేపథ్యంలో తమపై వచ్చిన ఆరోపణలపై అమెజాన్ వివరణ ఇచ్చుకుంది. భారత్ లో సుమారు 3లక్షలమంది వ్యాపారులు తమతో ఉన్నారని, వారిలో 75వేలమంది స్థానిక దుకాణదారులేనని తెలిపింది. అమెజాన్ ఎక్స్‌పోర్ట్ కార్యక్రమం ద్వారా దేశంలోని 70 వేలమందికి పైగా వ్యాపారులు… తమ ‘మేడ్ ఇన్ ఇండియా’ ఉత్పత్తులను విదేశాల్లో విక్రయిస్తున్నారని తెలిపింది. భారత్ లో గుత్తాధిపత్యంకోసం తాము ప్రయత్నించడంలేదని, భారత వ్యాపారుల అభివృద్ధికోసమే తమ సంస్థ ప్రయత్నిస్తోందని తెలిపింది.