Telugu Global
National

మమత అంటే మోదీకి జలసీయా..? అందుకే ఇటలీ టూర్ అడ్డుకున్నారా..?

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఇటలీ టూర్ కి కేంద్రం మోకాలడ్డింది. అక్టోబర్ లో ఇటలీలో జరిగే ప్రపంచ శాంతి సమావేశంలో పాల్గొనేందుకు మమతకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. ‘రాజకీయ కోణం’ నేపథ్యంలో ఆమె క్లియరెన్స్‌ ను తిరస్కరించినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొనే హోదాకు అనుగుణంగా ఆ కార్యక్రమం జరగడం లేదని పేర్కొంది. రాజకీయ కోణం కాదు.. దురుద్దేశం.. మమత ఇటలీ పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించడంతో ఒక్కసారిగా […]

మమత అంటే మోదీకి జలసీయా..? అందుకే ఇటలీ టూర్ అడ్డుకున్నారా..?
X

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఇటలీ టూర్ కి కేంద్రం మోకాలడ్డింది. అక్టోబర్ లో ఇటలీలో జరిగే ప్రపంచ శాంతి సమావేశంలో పాల్గొనేందుకు మమతకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. ‘రాజకీయ కోణం’ నేపథ్యంలో ఆమె క్లియరెన్స్‌ ను తిరస్కరించినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొనే హోదాకు అనుగుణంగా ఆ కార్యక్రమం జరగడం లేదని పేర్కొంది.

రాజకీయ కోణం కాదు.. దురుద్దేశం..
మమత ఇటలీ పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. గతంలో మమత చైనా టూర్‌ ను కేంద్రం రద్దు చేసిన విషయాన్ని టీఎంసీ అధికార ప్రతినిధి దేవాన్ష్ భట్టాచార్య గుర్తు చేశారు. భారత దేశ ప్రయోజనాల దృష్ట్యా తాము అప్పుడు కేంద్రం నిర్ణయానికి కట్టుబడి చైనా పర్యటన విరమించుకున్నామని, ఇప్పుడు ఇటలీ టూర్ ని ఎందుకు అడ్డుకోవాలనుకుంటున్నారని నిలదీశారు. బెంగాల్‌ తో మీకేంటి సమస్య అంటూ ప్రశ్నించారు.

మోదీజీ.. నేనంటా మీకు అసూయ..
ఇటలీ టూర్ కు అనుమతి నిరాకరణ విషయంలో నేరుగా ప్రధాని నరేంద్రమోదీపై విమర్శలు ఎక్కుపెట్టారు మమతా బెనర్జీ. తనకు విదేశాలకు వెళ్లాల‌నే ఆతృత లేదని, కానీ ప్ర‌పంచ శాంతి స‌ద‌స్సుకు వెళ్ల‌డం మ‌న‌ దేశ గౌర‌వానికి సంబంధించిన విష‌యం అని మ‌మ‌త పేర్కొన్నారు. మోదీ ఎప్పుడూ హిందువుల గురించి మాట్లాడుతుంటారని, తానూ ఒక హిందూ మ‌హిళ‌నేనని, మరి తననెందుకు విదేశాలకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. మోదీకి తానంటే అసూయ అని మ‌మ‌త మండిప‌డ్డారు.

తాలిబనీ బీజేపీ..
ఇటలీకి వెళ్ల‌కుండా తనని ఎవరూ ఆపలేరని అన్నారు మమతా బెనర్జీ. కేంద్రంతో తాడో పేడో తేల్చుకోడానికి సిద్ధమని చెప్పారు. మనం, మ‌న స్వేచ్ఛ‌ను కాపాడుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. తాలిబనీ బీజేపీ దేశాన్ని పాలించ‌కూడ‌దని వ్యాఖ్యానించారు. భ‌విష్య‌త్తులో టీఎంసీ ఒంట‌రిగా బీజేపీని ఓడిస్తుంద‌ని జోస్యం చెప్పారు. భ‌వానీపూర్ అసెంబ్లీ ఉపఎన్నిక‌తో ఆట మొద‌ల‌వుతుంద‌ని.. దేశమంతా టీఎంసీ విజయం తర్వాత ఆ ఆట ముగుస్తుందని చెప్పారు. సరిగ్గా ప్రధాని మోదీ విదేశీ పర్యటనలో ఉన్న సందర్భంలో.. బీజేపీయేతర ముఖ్యమంత్రి అయిన మమతా బెనర్జీ విదేశీ పర్యటన ఏర్పాట్లను విదేశాంగ శాఖ అడ్డుకోవడం సంచలనంగా మారింది.

First Published:  25 Sept 2021 10:09 AM
Next Story