పరిషత్ ఎన్నికలతో బలపడ్డాం.. పాతిక శాతం ఓట్లు మావే..
ఏపీలో ఇటీవల విడుదలైన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలతో జనసేనకు కొత్త బలం వచ్చిందని చెప్పారు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్. పాతిక శాతం ఓట్లు తమకే వచ్చాయని అన్నారు. 180 ఎంపీటీసీ సీట్లతో సహా, 2 జడ్పీటీసీ స్థానాలు సొంతం చేసుకున్నామని, మార్పుకి ఇదే శ్రీకారం అని అన్నారు. గతంలో ఎన్నికల ప్రక్రియ సరిగా జరగలేదని, అందుకే వాటిని రద్దుచేయాలని తాము కోర్టు మెట్లెక్కినట్టు తెలిపారు పవన్ కల్యాణ్. ఇప్పటికిప్పుడు పరిషత్ ఎన్నికలు పెడితే […]
ఏపీలో ఇటీవల విడుదలైన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలతో జనసేనకు కొత్త బలం వచ్చిందని చెప్పారు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్. పాతిక శాతం ఓట్లు తమకే వచ్చాయని అన్నారు. 180 ఎంపీటీసీ సీట్లతో సహా, 2 జడ్పీటీసీ స్థానాలు సొంతం చేసుకున్నామని, మార్పుకి ఇదే శ్రీకారం అని అన్నారు. గతంలో ఎన్నికల ప్రక్రియ సరిగా జరగలేదని, అందుకే వాటిని రద్దుచేయాలని తాము కోర్టు మెట్లెక్కినట్టు తెలిపారు పవన్ కల్యాణ్. ఇప్పటికిప్పుడు పరిషత్ ఎన్నికలు పెడితే 1500 ఎంపీటీసీ, 40నుంచి 80 జడ్పీటీసీ స్థానాలను జనసేన గెలుచుకుంటుందని పరిశీలకులు చెబుతున్నట్టు పవన్ విశ్లేషించారు.
అలా చేసి ఉంటే మరిన్ని స్థానాలు..
పరిషత్ ఎన్నికల్లో ఫలితాలు మరింత మెరుగ్గా ఉండే అవకాశం ఉన్నా.. కొన్ని కారణాల వల్ల తమకు ఆశించిన స్థాయిలో ఎక్కువ సీట్లు రాలేకపోయాయని చెప్పారు పవన్ కల్యాణ్. పొత్తులో భాగంగా బీజేపీకి ఎక్కువ స్థానాలివ్వడం కూడా దీనికి పరోక్ష కారణం అని వివరణ ఇచ్చారు. బీజేపీతో సర్దుబాటు లేకపోతే ఇంకా ఎక్కువ స్థానాలు గెలిచేవారమని చెప్పారు. ఆ పార్టీ కూడా ఇంకా బాగా పనిచేసి ఉంటే ఫలితాలు మరింత బాగా వచ్చేవని అన్నారు పవన్ కల్యాణ్.
టీఆర్ఎస్ లాగే జనసేన..
టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు కూడా మొదట్లో ప్రజలనుంచి అంతంతమాత్రంగానే స్పందన ఉందని, అయితే క్రమక్రమంగా ఆ పార్టీ బలపడి ఏకంగా అధికారమే చేపట్టిందని గుర్తు చేశారు పవన్ కల్యాణ్. ఏపీలో జనసేన కూడా అలాగే బలపడుతోందని అన్నారు. అధికారం చేపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇకపై క్షేత్రస్థాయి పోరాటాలు..
పరిషత్ ఎన్నికల ఫలితాలు తమకి ఉత్సాహాన్నిచ్చాయని అంటున్న పవన్ కల్యాణ్.. వైసీపీ పాలనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ దాష్టీకాలను ఎదుర్కొంటామని చెప్పారు. క్షేత్రస్థాయి పోరాటాలకు సిద్ధమవుతున్నట్టు తెలిపిన జనసేనాని.. ఈనెల 27, 28 తేదీల్లో విజయవాడలో పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో దీనికి సంబంధించిన కార్యాచరణ రూపొందిస్తామన్నారు. ప్రతి జిల్లాలో క్షేత్రస్థాయిలో పర్యటనలు చేసి ప్రజలపక్షాన నిలబడతామని చెప్పారు పవన్ కల్యాణ్.