Telugu Global
Cinema & Entertainment

లవ్ స్టోరీ మూవీ రివ్యూ

నటీనటులు: నాగచైతన్య, సాయి పల్లవి, రాజీవ్ కనకాల, ఈశ్వరి రావు, ఉత్తేజ్, ఆనంద చక్రపాణి తదితరులు సినిమాటోగ్రఫీ : విజయ్ సి.కుమార్ ఎడిటర్ : మార్తాండ్ కె.వెంకటేష్ మ్యూజిక్ : పవన్ సి.హెచ్ నిర్మాతలు : నారాయణ్ దాస్ కె నారంగ్,పి.రామ్మోహన్ రావు రచన,దర్శకత్వం: శేఖర్ కమ్ముల. రేటింగ్: 3/5 ప్రేమకథలు తీయడంలో స్పెషలిస్ట్ శేఖర్ కమ్ముల. అలాంటి దర్శకుడు ఏకంగా తన సినిమాకు లవ్ స్టోరీ అనే టైటిల్ పెడితే ఇంకేమైనా ఉందా? ఈసారి ప్రేమ పరవశంలో […]

love-story-nagachaitanya-sai-pallavi
X

నటీనటులు: నాగచైతన్య, సాయి పల్లవి, రాజీవ్ కనకాల, ఈశ్వరి రావు, ఉత్తేజ్, ఆనంద చక్రపాణి తదితరులు
సినిమాటోగ్రఫీ : విజయ్ సి.కుమార్
ఎడిటర్ : మార్తాండ్ కె.వెంకటేష్
మ్యూజిక్ : పవన్ సి.హెచ్
నిర్మాతలు : నారాయణ్ దాస్ కె నారంగ్,పి.రామ్మోహన్ రావు
రచన,దర్శకత్వం: శేఖర్ కమ్ముల.
రేటింగ్: 3/5

ప్రేమకథలు తీయడంలో స్పెషలిస్ట్ శేఖర్ కమ్ముల. అలాంటి దర్శకుడు ఏకంగా తన సినిమాకు లవ్ స్టోరీ అనే టైటిల్ పెడితే ఇంకేమైనా ఉందా? ఈసారి ప్రేమ పరవశంలో మునిగితేలొచ్చని సగడు ప్రేక్షకుడు అనుకోవడం సహజం. అంచనాలు కూడా ఆ దిశగానే పెట్టుకున్నారంతా. కానీ లవ్ స్టోరీ టైటిల్ తో సినిమా తీసిన కమ్ముల, అందులో పూర్తిస్థాయిలో లవ్ ను చూపించలేదు. పైపెచ్చు రెండు బలమైన సామాజికాంశాల్ని స్పృశించాడు.

అవును.. లవ్ స్టోరీ అనేది టైటిల్ కు తగ్గట్టు కేవలం లవ్ స్టోరీ మాత్రమే కాదు. సమాజంలో బలంగా
పాతుకుపోయిన కులాంతరాన్ని ఇందులో చర్చించారు. అక్కడితో కూడా ఆగలేదు కమ్ముల. తెలుగు
సమాజంలో ఎవ్వరూ పెద్దగా మాట్లాడ్డానికి ఇష్టపడని గృహ లైంగిక వేధింపుల అంశాన్ని కూడా టచ్ చేశారు.
ఇలా రెండు బలమైన సామాజికాంశాల్ని టచ్ చేసి సినిమా తీసిన కమ్ముల, దానికి లవ్ స్టోరీ అనే టైటిల్
పెట్టడం అంతగా రుచించదు. ఈ సంగతి పక్కనపెడితే, సినిమా మాత్రం మనసుకు హత్తుకుంటుంది.
అదెలాగో చూద్దాం రండి.

నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ అనే ప్రాంతానికి చెందిన దిగువ మధ్యతరగతి వ్యక్తి రేవంత్ (నాగచైతన్య).
హైదరాబాద్ వచ్చి జుంబా ట్రయినింగ్ సెంటర్ పెడతాడు. దాన్ని మరింతగా డెవలప్ చేసి డాన్స్ స్టుడియో
చేయాలనేది అతడి కల. ఇక అదే ప్రాంతం నుంచి మౌనిక (సాయిపల్లవి) కూడా హైదరాబాద్ వస్తుంది.
ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తుంటుంది. కానీ ఉద్యోగం దొరకదు. సరిగ్గా అదే టైమ్ లో మౌనిక డాన్స్ చూస్తాడు నాగచైతన్య. స్కూల్ లో తన పార్టనర్ గా ఆమెను ఆహ్వానిస్తాడు. ఉద్యోగం దొరక్కపోవడంతో మౌనిక కూడా ఓకే అంటుంది.

అలా మౌనిక-రేవంత్ ఈజీగానే ప్రేమలో పడతారు. కానీ తన ఊరికి చెందిన పటేల్ కూతురే మౌనిక అని
తెలుసుకుంటాడు రేవంత్. అణగారిన కులానికి చెందిన తను పటేల్ కూతురైన మౌనికకు ప్రేమ విషయం
చెప్పడానికి భయపడతాడు. చివరికి మౌనిక తన ప్రేమను బయటపెడుతుంది. ఎలాగూ కులాంతరాన్ని
పెద్దలు ఒప్పుకోరు కాబట్టి లేచిపోయి పెళ్లి చేసుకుందాం అనుకుంటారు. సరిగ్గా అప్పుడే ఓ అడ్డంకి వస్తుంది. రేవంత్-మౌనిక డ్రాప్ అయిపోతారు. అసలు ఏం జరిగింది? ఎందుకు వీళ్లు డ్రాప్ అయ్యారు? అసలు బాల్యంలో మౌనిక ఎదుర్కొన్న సమస్య ఏంటనేది సినిమా కథ.

కమ్ముల సినిమాలో ఉండే ప్రేమ మాధుర్యం ఇందులో కూడా ఉంది. నాగచైతన్య-సాయిపల్లవి మధ్య వచ్చే
రొమాంటిక్ సన్నివేశాలు మనసుకు గిలిగింతలు పెడతాయి. కమ్ముల మార్కు సన్నివేశాలన్నీ ఉన్నాయి.
అయితే సినిమా పూర్తయిన తర్వాత వీటి కంటే కమ్ముల పండించిన ఎమోషనల్ సన్నివేశాలే ఎక్కువగా
గుర్తొస్తాయి. ఆనంద్ సినిమా నుంచి మొన్నొచ్చిన ఫిదా వరకు ఏ సినిమా తీసుకున్నా అందులో సున్నితమైన ప్రేమభావాల్ని తెరపై సరదాగా చూపించాడు కమ్ముల. కానీ లవ్ స్టోరీ సినిమాకు వచ్చేసరికి మాత్రం సరదా ప్రేమకథ కంటే ఎమోషనల్ కనెక్ట్ ఎక్కువగా ఉంది. అందుకే లవ్ స్టోరీ అనేది తన టైటిల్ ను జస్టిఫై చేయదు. కానీ సినిమా మాత్రం ఓ రేంజ్ లో ఆకట్టుకుంటుంది.

శేఖర్ కమ్ముల నుండి ఇలాంటి ఓ లవ్ స్టోరీ ఎక్స్ పెక్ట్ చేయని వారికి ఇది కొత్తగా అనిపిస్తుంది. అలాగని
సినిమాలో శేఖర్ కమ్ముల స్టైల్ లవ్ ట్రాక్ , రొమాంటిక్ సీన్స్ మిస్ అవ్వలేదు. అవన్నీ ఉన్నాయి కానీ ఈసారి చైల్డ్ అబ్యూస్ అనే పాయింట్ ని తీసుకొని సమాజంలో ఇలాంటివి జరుగుతున్నాయని తల్లిదండ్రులు జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలని ఆ విషయాన్ని రైజ్ చేశాడు దర్శకుడు. కాకపోతే క్లైమాక్స్ వరకూ తను చెప్పాలనుకుంటున్న పాయింట్ దాచి పెట్టి అక్కడక్కడా హింట్ ఇస్తూ ప్రీ క్లైమాక్స్ లో ఆ విషయాన్ని ఓపెన్ చేసి క్లైమాక్స్ లో హీరోతో విలన్ ని చంపించి ఎండ్ చేశాడు. కులాంతర ప్రేమకథకు కూడా తనదైన ముగింపు ఇచ్చాడు.

ఓవైపు సందేశం, మరోవైపు ప్రేమను బ్యాలెన్స్ చేస్తూ కమ్ముల ఈ సినిమాను చక్కగా నడిపించాడు. కాకపోతే
తన రూటు నుంచి కాస్త పక్కకు రావడంతో, నెరేషన్ అక్కడక్కడ గాడి తప్పుతుంది. సెకెండాఫ్ లో కొన్ని
సన్నివేశాలు స్లో అయ్యాయి. కమ్ముల తర్వాత టెక్నికల్ డిపార్ట్ మెంట్ లో చెప్పుకోవాల్సిన వ్యక్తి పవన్. తన మ్యూజిక్ తో ఈ సినిమాను మరో మెట్టు పైకి తీసుకెళ్లాడు ఈ సంగీత దర్శకుడు. సారంగదరియా తెరపై కూడా బాగుంది. రీ-రికార్డింగ్ కూడా అద్భుతంగా చేశాడు. సినిమాటోగ్రాఫీ, ప్రొడక్షన్ డిజైన్ కూడా బాగుంది. ఎడిటింగ్ లో మూవీని కాస్త ట్రిమ్ చేస్తే బాగుండేది.

నటీనటుల విషయానికొస్తే.. నాగచైతన్య మెరిశాడు. సగటు మధ్యతరగతి కుర్రాడిగా, తక్కువ జాతికి చెందిన వ్యక్తిగా చక్కగా నటించాడు. చైతన్య కెరీర్ లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇదే. అటు సాయిపల్లవి ఎప్పట్లానే చాలా బాగా చేసింది. వీళ్లిద్దరి కెమిస్ట్రీ సినిమాకు అతిపెద్ద ఎస్సెట్. వీళ్లతోపాటు ఈశ్వరిరావు, ఉత్తేజ్, రాజీవ్ కనకాల తమ పాత్రలకు న్యాయం చేశారు.

ఓవరాల్ గా లవ్ స్టోరీ సినిమాను ఓ హాయిగొలిపే రొమాంటిక్ స్టోరీగా ఊహించుకొని థియేటర్లకు వెళ్తే మాత్రం
ఆశాభంగం తప్పదు. కమ్ముల ఏదో కొత్తగా చెప్పాడనే మైండ్ సెట్ తో వెళ్తే మాత్రం ఈ సినిమా మనసుకు
హత్తుకుంటుంది. బరువెక్కిన గుండెతో థియేటర్ల నుంచి బయటకు పంపిస్తుంది.

బాటమ్ లైన్- ”లవ్” తో కూడిన మెసేజ్ ”స్టోరీ”

First Published:  24 Sept 2021 2:06 PM IST
Next Story