Telugu Global
NEWS

ప్రై'వేటు' దిశగా తెలంగాణ ఆర్టీసీ..

ఆర్టీసీ నష్టాల్లో ఉంది, ప్రభుత్వం ఆదుకోవాలనే మాట ఎప్పుడూ వినపడేదే. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకోవడంతో ఏపీలో సంస్థ కష్టనష్టాల గురించి చర్చ ఆగిపోయింది. అయితే తెలంగాణలో మాత్రం ఆర్టీసీ మెడపై నష్టాల కత్తి వేలాడుతూనే ఉంది. ఉద్యోగులు ఎన్ని ఉద్యమాలు చేసినా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకోడానికి ససేమిరా అంటున్నారు సీఎం కేసీఆర్. గతంలో ఆర్టీసీకి, ప్రభుత్వానికి మధ్య జరిగిన ఆధిపత్య పోరులో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. […]

ప్రైవేటు దిశగా తెలంగాణ ఆర్టీసీ..
X

ఆర్టీసీ నష్టాల్లో ఉంది, ప్రభుత్వం ఆదుకోవాలనే మాట ఎప్పుడూ వినపడేదే. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకోవడంతో ఏపీలో సంస్థ కష్టనష్టాల గురించి చర్చ ఆగిపోయింది. అయితే తెలంగాణలో మాత్రం ఆర్టీసీ మెడపై నష్టాల కత్తి వేలాడుతూనే ఉంది. ఉద్యోగులు ఎన్ని ఉద్యమాలు చేసినా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకోడానికి ససేమిరా అంటున్నారు సీఎం కేసీఆర్. గతంలో ఆర్టీసీకి, ప్రభుత్వానికి మధ్య జరిగిన ఆధిపత్య పోరులో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఆ క్రమంలో ఆర్టీసీలో ఉద్యోగ సంఘాలే కనుమరుగయ్యాయి. ఉద్యమాలు ఆగిపోయాయి.

ప్రస్తుతం తెలంగాణలో ఆర్టీసీ నష్టాల వ్యవహారం మరోసారి చర్చకు వచ్చింది. ఈ దఫా ఆర్టీసీని ప్రైవేటు పరం చేస్తానని కాస్త గట్టిగానే సీఎం కేసీఆర్ హెచ్చరించారని తెలుస్తోంది. ఈమేరకు టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ క్లారిటీ ఇచ్చారు. ఆర్టీసీని ఆదుకునేందుకు ప్రభుత్వం కొన్నేళ్లుగా ఆర్థిక సాయం చేస్తున్నా ఎలాంటి ఫలితం లేదని చెప్పారు. 4 నెలల్లోగా ఆర్టీసీ గాడిలో పడకపోతే ప్రైవేట్ పరం చేస్తామని సీఎం కేసీఆర్‌ హెచ్చరించారని బాజిరెడ్డి చెప్పారు. సంస్థ ఉద్యోగులు ఈ విషయాన్ని గుర్తుంచుకొని పనిచేయాలన్నారు. ఆర్టీసీ చార్జీల పెంపుపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కేసీఆర్ ఆదేశించినట్టు తెలిపారాయన.

నష్టాలపేరుతో వడ్డింపులా..?
అయితే ఆర్టీసీ విషయంలో ప్రభుత్వం నిరంకుశ ధోరణిలో ఉందని మండిపడ్డారు బీజేపీ నేతలు. ఆర్టీసీని ప్రైవేటుపరం చేస్తామంటూ బెదిరించడం సరికాదన్నారు. బస్సు చార్జీలు, కరెంట్ చార్జీలు పెంచితే కేసీఆర్ సర్కారు మెడలు వంచుతామన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. మంచి జరిగితే రాష్ట్రం, చెడు జరిగితే కేంద్రం కారణం అనడం కేసీఆర్ కి అలవాటైపోయిందని మండిపడ్డారు. లీటర్‌ డీజిల్ పై రూ.26 వ్యాట్ , రూ. 14 టాక్స్ రూపంలో తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ చార్జీలు పెంచడం సరికాదన్నారు. ఆర్టీసీకి రాయితీపై ఇంధనం సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ, కరెంట్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

మొత్తమ్మీద తెలంగాణలో ఆర్టీసీని ప్రైవేటుపరం చేస్తారనే వార్తలు మరోసారి ఊపందుకున్నాయి. నాలుగు నెలల్లో సంస్థ లాభాలబాట పట్టాలంటే అది సాధ్యమయ్యే పనికాదని చెబుతున్నారు ఉద్యోగులు. ప్రైవేటు పరం చేస్తే మాత్రం ఊరుకోమని హెచ్చరిస్తున్నారు.

First Published:  23 Sept 2021 2:21 AM IST
Next Story