Telugu Global
NEWS

రాయలసీమ వర్సెస్ పాలమూరు.. పోటాపోటీగా ఫిర్యాదులు..

ఏపీ ప్రభుత్వం చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణాన్ని ఆపి వేయాలంటూ జాతీయ హరిత ట్రైబ్యునల్ లో తెలంగాణ ప్రభుత్వం చేసిన ఫిర్యాదుపై విచారణ కొనసాగుతోంది. ఇప్పుడు తెలంగాణలో చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల్ని కూడా తక్షణం నిలిపివేయాలంటూ ఏపీ ప్రభుత్వం న్యాయపోరాటానికి దిగింది. ఇటీవల ఈ ప్రాజెక్ట్ పై ఎన్జీటీకి ఫిర్యాదు చేయగా.. నిపుణుల బృందం వనపర్తి జిల్లాలో పర్యటించి వివరాలు సేకరించింది. తాజాగా ఈ వివాదంపై ఏపీ ప్రభుత్వం పూర్తి వివరాలతో ఎన్జీటీ […]

రాయలసీమ వర్సెస్ పాలమూరు.. పోటాపోటీగా ఫిర్యాదులు..
X

ఏపీ ప్రభుత్వం చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణాన్ని ఆపి వేయాలంటూ జాతీయ హరిత ట్రైబ్యునల్ లో తెలంగాణ ప్రభుత్వం చేసిన ఫిర్యాదుపై విచారణ కొనసాగుతోంది. ఇప్పుడు తెలంగాణలో చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల్ని కూడా తక్షణం నిలిపివేయాలంటూ ఏపీ ప్రభుత్వం న్యాయపోరాటానికి దిగింది. ఇటీవల ఈ ప్రాజెక్ట్ పై ఎన్జీటీకి ఫిర్యాదు చేయగా.. నిపుణుల బృందం వనపర్తి జిల్లాలో పర్యటించి వివరాలు సేకరించింది. తాజాగా ఈ వివాదంపై ఏపీ ప్రభుత్వం పూర్తి వివరాలతో ఎన్జీటీ ముందు రెండు అఫిడవిట్లు దాఖలు చేసింది.

కృష్ణా జల వివాద ట్రైబ్యునల్‌-1, 2లో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేటాయింపు లేదని, పునర్విభజన చట్టంలోని 11వ షెడ్యూలులో కూడా దీని ప్రస్తావన లేదని ఏపీ ప్రభుత్వం తన అఫిడవిట్లో పేర్కొంది. ఈ ప్రాజెక్ట్ వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పర్యావరణంపై ప్రభావం ఉంటుందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం ప్రకారం ఈ ప్రాజెక్టు కట్టే హక్కు తెలంగాణకు లేదని చెప్పింది. ఇటీవల పునర్విభజన చట్టం ప్రకారం నీటి కేటాయింపులు జరగాలంటూ కేసీఆర్ కేంద్ర మంత్రుల్ని కలసి నివేదికలివ్వగా.. వాటికి కౌంటర్ గా ఎన్జీటీలో ఏపీ అఫిడవిట్లు దాఖలు చేసింది.

మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలంలోని కరివెన వద్ద పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును తెలంగాణ నిర్మిస్తోంది. 2015, జూన్ 11న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. జూరాల ప్రాజెక్టు వద్ద కృష్ణానది నుంచి 70 టీఎంసీల వరద నీటిని ఎత్తిపోయడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. అటు నాగర్‌ కర్నూలు జిల్లా ఎల్లూరు వద్ద శ్రీశైలం జలాశయం నుండి నీటిని తోడి, రంగారెడ్డి జిల్లా, కొందుర్గ్ మండలం, లక్ష్మీదేవిపల్లి వరకూ పంపిస్తారు. వర్షాకాలంలో 60 రోజుల పాటు వరద ఉండే రోజుల్లో రోజుకు 1.5 టీఎంసీ చొప్పున మొత్తం 90 టిఎమ్‌సి నీటిని ఎత్తిపోయడం కూడా ఈ ప్రాజెక్ట్ లో భాగమే.

ఈ ప్రాజెక్ట్ నిర్మాణం 2019 నాటికి పూర్తి కావాల్సి ఉన్నా.. ఇంకా పనులు జరుగుతూనే ఉన్నాయి. ఈ ఏడాది చివరకు డెడ్ లైన్ పెట్టిన కేసీఆర్.. ఆ లోగా పనులు పూర్తి చేయాలని ఇరిగేషన్ శాఖ అధికారుల్ని ఆదేశించారు. ఆ తర్వాత ఢిల్లీ పర్యటనలో ఆయన నీటివాటాలపై ప్రత్యేకంగా ప్రధానికి, ఇతర మంత్రులకు నివేదికలు ఇచ్చారు. విభజన చట్టం ప్రకారం, ప్రాజెక్ట్ ల నిర్మాణాలు, నీటి పంపకాలు జరగాలన్నారు. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం విభజన చట్టంలో ప్రస్తావన లేని పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మాణాన్ని అడ్డుకోవాలని ఎన్జీటీని ఆశ్రయించింది. రాయలసీమ ఎత్తిపోతలను అడ్డుకునేలా తెలంగాణ ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తుండగా.. ఏపీ దానికి కౌంటర్ గా పాలమూరు ఎత్తిపోతలను తెరపైకి తెచ్చింది. ప్రస్తుతం ఈ రెండు అంశాలపై ఎన్జీటీ విచారణ జరుపుతోంది.

First Published:  22 Sept 2021 2:38 AM IST
Next Story