Telugu Global
National

'కెప్టెన్' మారాడు.. 'పైలట్' కి అవకాశమిస్తారా..?

పంజాబ్ లో సీఎం కుర్చీ మార్పు ఇప్పుడు రాజస్థాన్ లో సెగలు రేపుతోంది. పంజాబ్ లో కెప్టెన్ అమరీందర్ సింగ్ తో రాజీనామా చేయించిన అధిష్టానం, అదే రీతిలో పార్టీ భవిష్యత్తుకోసం రాజస్థాన్ లో అశోక్ గెహ్లాత్ తో కూడా రాజీనామా చేయించాలని డిమాండ్ చేస్తున్నారు సచిన్ పైలట్ వర్గీయులు. తాజా పరిణామాల నేపథ్యంలో రాజస్థాన్ లో ఇరువర్గాలకు చెందిన కొందరు నాయకులు ఢిల్లీ చేరుకున్నారు. సచిన్‌ పైలట్‌ గత మూడు రోజులుగా ఢిల్లీలోనే మకాం వేశారని, […]

కెప్టెన్ మారాడు.. పైలట్ కి అవకాశమిస్తారా..?
X

పంజాబ్ లో సీఎం కుర్చీ మార్పు ఇప్పుడు రాజస్థాన్ లో సెగలు రేపుతోంది. పంజాబ్ లో కెప్టెన్ అమరీందర్ సింగ్ తో రాజీనామా చేయించిన అధిష్టానం, అదే రీతిలో పార్టీ భవిష్యత్తుకోసం రాజస్థాన్ లో అశోక్ గెహ్లాత్ తో కూడా రాజీనామా చేయించాలని డిమాండ్ చేస్తున్నారు సచిన్ పైలట్ వర్గీయులు. తాజా పరిణామాల నేపథ్యంలో రాజస్థాన్ లో ఇరువర్గాలకు చెందిన కొందరు నాయకులు ఢిల్లీ చేరుకున్నారు. సచిన్‌ పైలట్‌ గత మూడు రోజులుగా ఢిల్లీలోనే మకాం వేశారని, ప్రియాంక గాంధీ, అజయ్‌ మాకెన్‌ తో సమావేశమయ్యారని తెలుస్తోంది. రాజస్థాన్ తాజా రాజకీయ పరిస్థితిపై ఇన్ చార్జి అజయ్‌ మాకెన్‌ ఇటీవల తన నివేదికను సోనియా గాంధీకి సమర్పించారు కూడా. అటు సీఎం అశోక్ గెహ్లాత్ వర్గంలోని రెవెన్యూ మంత్రి హరీష్‌ చౌదరి, ఆరోగ్య శాఖ మంత్రి రఘుశర్మ సహా పలువురు నాయకులు ఆయనకు మద్దతుగా ఢిల్లీలో లాబీయింగ్ చేస్తున్నారు. మొత్తమ్మీద పంజాబ్ వ్యవహారంతో రాజస్థాన్ మరింత వేడెక్కింది.

విస్తరణ ఆలస్యం కావడంతో..
అశోక్‌ గెహ్లాత్ ను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలని కొన్నేళ్లుగా పైలట్‌ వర్గం డిమాండ్ చేస్తోంది. పైలట్ క్యాంప్ రాజకీయాలు నడపడంతో అప్పట్లో ఈ వ్యవహారం మరింత రచ్చకెక్కింది. అయితే అహ్మద్ పటేల్, పైలట్ వర్గాన్ని బుజ్జగించి పరిస్థితి చక్కదిద్దారు. మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో పైలట్ వర్గానికి ప్రాధాన్యమిస్తామని హామీ ఇచ్చారు. ఇది జరిగి ఏడాది పూర్తయినా ఇంకా రాజస్థాన్ లో మంత్రి వర్గ విస్తరణకు మహూర్తం కుదరలేదు. పైలట్ వర్గానికి న్యాయం జరగలేదు. దీంతో వారిలో అసంతృప్తి కొనసాగుతూనే ఉంది. ఇటీవల పంజాబ్ పరిణామాలతో రాజస్థాన్ లో కూడా అదే రకమైన సెటిల్మెంట్ చేయాలనే డిమాండ్ బలపడింది.

పంజాబ్ కి, రాజస్థాన్ కి తేడా అదే..
పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ ఎమ్మెల్యేలపై పట్టు కోల్పోయిన తర్వాతే ఆయన్ను ఆ కుర్చీనుంచి దించేశారు. సిద్ధూ వర్గానికి అక్కడ బలమెక్కువ. ఏడాదిలోగా అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉండటంతో.. అమరీందర్ ని పక్కనపెట్టి హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. కానీ రాజస్థాన్ లో పరిస్థితి అలా లేదు. సీఎం అశోక్ గెహ్లాత్ కి హైకమాండ్ వద్ద పరపతి ఉంది, ఎమ్మెల్యేలపై పట్టు ఉంది. సచిన్ పైలట్ వర్గం మాత్రం ఆయనకు కొరకరాని కొయ్యలా మారింది. అందులోనూ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. ఈ దశలో రాజస్థాన్ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం తొందరపాటు నిర్ణయం తీసుకుంటుందనే అంచనాలు లేవు. కానీ పంజాబ్ లో సీఎం సీటు మార్పు వ్యవహారంతో రాజస్థాన్ లో పైలట్ వర్గంలో ఆశలు చిగురించాయి.

First Published:  21 Sept 2021 2:44 AM IST
Next Story