చదువే వద్దంటే ఉద్యోగాలెందుకు..? ఆఫ్ఘన్ లో మరో అరాచకం..
ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల పాలనలోకి వెళ్లిన తర్వాత మహిళలు జీవచ్ఛవాల్లా బతకాల్సిందేనని అనుకున్నారంతా. కానీ తాలిబన్లు మాత్రం మహిళా హక్కులను తాము కాలరాయబోమంటూ సెలవిచ్చారు. ఇప్పుడు క్రమక్రమంగా తమ అసలు రంగు బయట పెట్టుకుంటున్నారు. ముందుగా మహిళా విద్యపై ఉక్కుపాదం మోపారు తాలిబన్లు. బాలురు, బాలికలు కలసి చదువుకోకూడదనే నియమం పెట్టారు. కో ఎడ్యుకేషన్ కాలేజీల్లో పరదా పద్ధతి అమలులోకి తెచ్చారు. మహిళా కాలేజీలు, యూనివర్శిటీల్లో పురుష ఉపాధ్యాయులు, సిబ్బంది ఉండకూడదనే నియమం పెట్టారు. ఇటీవల ఏర్పడిన మంత్రి […]
ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల పాలనలోకి వెళ్లిన తర్వాత మహిళలు జీవచ్ఛవాల్లా బతకాల్సిందేనని అనుకున్నారంతా. కానీ తాలిబన్లు మాత్రం మహిళా హక్కులను తాము కాలరాయబోమంటూ సెలవిచ్చారు. ఇప్పుడు క్రమక్రమంగా తమ అసలు రంగు బయట పెట్టుకుంటున్నారు. ముందుగా మహిళా విద్యపై ఉక్కుపాదం మోపారు తాలిబన్లు. బాలురు, బాలికలు కలసి చదువుకోకూడదనే నియమం పెట్టారు. కో ఎడ్యుకేషన్ కాలేజీల్లో పరదా పద్ధతి అమలులోకి తెచ్చారు. మహిళా కాలేజీలు, యూనివర్శిటీల్లో పురుష ఉపాధ్యాయులు, సిబ్బంది ఉండకూడదనే నియమం పెట్టారు. ఇటీవల ఏర్పడిన మంత్రి వర్గంలో కూడా మహిళలకు చోటివ్వలేదు. అసలు మహిళలకు రాజకీయాలెందుకని ప్రశ్నిస్తున్న తాలిబన్లు.. గత ప్రభుత్వ హయాంలో ఏర్పడిన మహిళా మంత్రిత్వశాఖ భవనంలోకి చొరబడి, అక్కడి సిబ్బందిని బయటికి పంపించేశారు. దీనికి కొనసాగింపుగా ఇప్పుడు మహిళా ఉద్యోగుల్ని కార్యాలయాలకు రాకుండా అడ్డుకుంటున్నారు.
ఉద్యోగ రంగంలో మహిళలను కట్టడి చేస్తే, చదువుకోవాలనే ఆలోచన, ఆశ వారిలో చచ్చిపోతుందనేది తాలిబన్ల ఊహ. అందుకే ముందుగా ఉద్యోగాలలో మహిళలు లేకుండా నిషేధం విధిస్తున్నారు. తాజాగా కాబూల్ నగరపాలక సంస్థలో పనిచేసే మహిళా ఉద్యోగులపై ఆంక్షలు విధించారు. నగరవ్యాప్తంగా విధులు నిర్వహించే మహిళా ఉద్యోగులు ఇళ్లకే పరిమితం కావాలని తాత్కాలిక మేయర్ హమదుల్లా నమోనీ ఆదేశించారు. పురుషులకు అనుమతి లేని విధుల్లో ఉండే మహిళలకు మాత్రం మినహాయింపు ఉంటుందని చెప్పారు. తాలిబన్ల ఆక్రమణకు ముందు వరకు.. నగరవ్యాప్తంగా అన్ని విభాగాల్లో కలిపి దాదాపు 3వేలమంది మహిళా ఉద్యోగులుండేవారు. వారందర్నీ ఇప్పుడు విధుల్లోకి రాకుండా అడ్డుకుంటున్నారు, ఇళ్లకే పరిమితం చేశారు.
మహిళా ఉద్యమంతో మార్పు ఉంటుందా..?
పాఠశాలలు, కళాశాలలపై ఆంక్షలు విధించిన తర్వాత కాబూల్ లో ఇటీవల మహిళలు రోడ్డెక్కి నిరససన ప్రదర్శన చేపట్టారు. అయితే నిరసనకారులపై తాలిబన్లు కఠినంగా వ్యవహరించి తరిమికొట్టారు. ఈ క్రమంలో ఇప్పుడు మహిళా ఉద్యోగుల్ని కూడా ఇంటికే పరిమితం చేస్తూ తాలిబన్లు తీసుకున్న కొత్త నిర్ణయం విమర్శలకు తావిస్తోంది. దీంతో మరోసారి అక్కడ నిరసనలు మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ నిరసనలు, ఆందోళనలకు తాలిబన్లు వెనక్కు తగ్గేలా లేరు. మహిళలకు విద్య, ఉద్యోగం, రాజకీయాల్లో అవకాశమే లేకుండా చేస్తున్నారు.