Telugu Global
NEWS

వైట్ ఛాలెంజ్ కి సిద్ధమా..? కేటీఆర్ కు రేవంత్ రెడ్డి సవాల్..

టీఆర్‌ఎస్‌ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్‌ మొక్కలు నాటే గ్రీన్‌ ఛాలెంజ్‌ స్ఫూర్తితో తాను వైట్ ఛాలెంజ్ విసురుతున్నానని, ఈ ఛాలెంజ్ ని మంత్రి కేటీఆర్, మాజీ ఎంపీ కొండా విశ్వశ్వర్ రెడ్డి స్వీకరించాలని వారు మరో ఇద్దరికి ఈ సవాల్ విసరాలని సూచించారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. ఈ సవాల్ తీసుకున్నవారు రక్త నమూనాలను పరీక్షల కోసం ఇచ్చి ఆదర్శంగా నిలబడాలన్నారు. ప్రజా జీవితంలో ఉన్న నేతలు, సినీ నటులు ఈ ఛాలెంజ్‌ను స్వీకరించాలని […]

వైట్ ఛాలెంజ్ కి సిద్ధమా..? కేటీఆర్ కు రేవంత్ రెడ్డి సవాల్..
X

టీఆర్‌ఎస్‌ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్‌ మొక్కలు నాటే గ్రీన్‌ ఛాలెంజ్‌ స్ఫూర్తితో తాను వైట్ ఛాలెంజ్ విసురుతున్నానని, ఈ ఛాలెంజ్ ని మంత్రి కేటీఆర్, మాజీ ఎంపీ కొండా విశ్వశ్వర్ రెడ్డి స్వీకరించాలని వారు మరో ఇద్దరికి ఈ సవాల్ విసరాలని సూచించారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. ఈ సవాల్ తీసుకున్నవారు రక్త నమూనాలను పరీక్షల కోసం ఇచ్చి ఆదర్శంగా నిలబడాలన్నారు. ప్రజా జీవితంలో ఉన్న నేతలు, సినీ నటులు ఈ ఛాలెంజ్‌ను స్వీకరించాలని కోరారు. ఇటీవల సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ మాఫియాపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కొంతమంది నటీ నటులను విచారణ లిస్ట్ లోనుంచి టీఆర్ఎస్ నేతలు తప్పించారని అన్నారు. పరోక్షంగా కేటీఆర్ ని టార్గెట్ చేశారు. అదే క్రమంలో మత్తుపదార్థాల వినియోగానికి వ్యతిరేకంగా యువతలో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నానికి తెలంగాణ నాయకులు, సినీ నటులు ప్రయత్నం చేయాలని పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి. వ్యసనాలకు, మత్తు పదార్థాలకు మనం బానిసలం కాదని నిరూపించుకుని యువతకు రోల్‌ మోడల్‌ గా నిలుద్దామని అన్నారు. అమరవీరుల స్థూపం వద్దకు తాను వస్తానని, కేటీఆర్, విశ్వేశ్వర్ రెడ్డి కూడా రావాలని, అటునుంచి అటే ఉస్మానియా కానీ, ఇతర ఆస్పత్రికి వెళ్లి రక్త నమూనాలు ఇచ్చి వద్దామని అన్నారు. వైట్ ఛాలెంజ్ స్వీకరించాలని కోరారు.

వైట్ ఛాలెంజ్ కి కౌంటర్లు.. ప్రతి కౌంటర్లు..
‘‘నాకు.. డ్రగ్స్‌కు ఏం సంబంధం? నా రక్తం, వెంట్రుకలు ఇస్తా. ఏ పరీక్షకైనా సిద్ధం. మరి రాహుల్‌ గాంధీ కూడా నమూనాలు ఇస్తారా?’’ అంటూ మంత్రి కేటీఆర్‌, రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందిస్తూ ట్వీట్ చేశారు. దీనికి రేవంత్ కూడా కాస్త గట్టిగానే బదులిచ్చారు. ‘‘రాహుల్‌, జో బైడెన్‌, ట్రంప్‌, ఇవాంకా దాకా ఎందుకు..? నేను విసురుతున్న వైట్‌ చాలెంజ్‌ స్వీకరించు’’ అంటూ మరో కౌంటర్ ఇచ్చారు. డ్రగ్స్‌ కేసులో ఈడీ విచారణకు ప్రభుత్వ పెద్దలు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. డ్రగ్స్‌ కేసులో 2017లో ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ విచారణ నిర్వహించినప్పుడు ఇద్దరు కీలక నటుల పేర్లు లేవని, తాజాగా ఈడీ విచారించిన వారిలో వారిద్దరూ ఉన్నారని అన్నారు. అప్పట్లో వారిని కాపాడిందెవరని ప్రశ్నించారు. డ్రగ్స్‌ కేసుపై సమగ్ర విచారణ చేయాల్సిందిగా ఈడీని కోరేందుకు కేటీఆర్‌ కు ఉన్న అభ్యంతరమేంటని అన్నారు రేవంత్ రెడ్డి.

మొత్తమ్మీద గ్రీన్ ఛాలెంజ్ కి పోటీగా, వైట్ ఛాలెంజ్ అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు.. తెలంగాణలో కలకలం రేపాయి. వైట్ ఛాలెంజ్ స్వీకరించి యువతకు ఆదర్శంగా నిలవాలని ఆయన రాజకీయ నాయకులు, సినీ నటుల్ని కోరారు. వైట్ ఛాలెంజ్ స్వీకరించండి, మీరు కళంకితులు కాదని నిరూపించుకోండి అంటూ ఇరుకున పెట్టే ప్రయత్నం మొదలు పెట్టారు. మొక్కలు నాటుతూ ఫోజులిచ్చి, గ్రీన్ ఛాలెంజ్ అంటూ ఇద్దరి పేర్లు చెప్పి.. దాన్ని కూడా ప్రచారంగా మార్చుకునే నాయకులు, నటులు.. ఈ వైట్ ఛాలెంజ్ స్వీకరించాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి. రక్త పరీక్షలకు ఎవరు సిద్ధమైనా, కాకపోయినా.. ఈ వైట్ ఛాలెంజ్ మాత్రం టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది.

First Published:  19 Sept 2021 4:19 AM IST
Next Story