Telugu Global
NEWS

ఈనెల 24నుంచి తెలంగాణ సభా సమరం.. వాడివేడిగా జరిగే అవకాశం..

ఈటల రాజేందర్ పై వేటుపడటం, ఆయన బీజేపీలో చేరడం, ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలు.. వీటన్నిటి తర్వాత ఇప్పుడు తెలంగాణ శాసన సభ, శాసన మండలి సమావేశాలు ఈనెల 24న ప్రారంభంకాబోతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గిన తర్వాత నిర్వహిస్తున్న తొలి సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ నాయకుల సవాళ్లు, ప్రతి సవాళ్లతో రాజకీయం వేడెక్కింది. ఇప్పుడు సభలో కూడా ఈ సవాళ్లు, ప్రతి సవాళ్లు […]

ఈనెల 24నుంచి తెలంగాణ సభా సమరం.. వాడివేడిగా జరిగే అవకాశం..
X

ఈటల రాజేందర్ పై వేటుపడటం, ఆయన బీజేపీలో చేరడం, ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలు.. వీటన్నిటి తర్వాత ఇప్పుడు తెలంగాణ శాసన సభ, శాసన మండలి సమావేశాలు ఈనెల 24న ప్రారంభంకాబోతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గిన తర్వాత నిర్వహిస్తున్న తొలి సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ నాయకుల సవాళ్లు, ప్రతి సవాళ్లతో రాజకీయం వేడెక్కింది. ఇప్పుడు సభలో కూడా ఈ సవాళ్లు, ప్రతి సవాళ్లు ప్రతిధ్వనించే అవకాశం ఉంది.

శాసన సభ సమావేశాల షెడ్యూల్ తో పాటు.. పలు ఇతర కీలక నిర్ణయాలు తీసుకుంది తెలంగాణ మంత్రిమండలి. రాష్ట్రంలో భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు అదనంగా రూ.100 కోట్లు మంత్రిమండలి కేటాయించింది. హైదరాబాద్‌ లో 4 మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణాలను వేగంగా జరపాలని నిర్ణయించింది. వచ్చేఏడాది నుంచి మద్యం దుకాణాల్లో కల్లుగీత(గౌడ) సామాజిక వర్గం వారికి 15 శాతం, దళితులకు 10 శాతం, గిరిజనులకు 5 శాతం కేటాయించబోతున్నారు. కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో పోలీస్‌ స్టేషన్లలోని సమస్యలు, అవసరాలను సమీక్షించేందుకు హోంమంత్రి మహమూద్‌అలీ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో నూతన జోనల్‌ విధానానికి అనుగుణంగా పోలీసు శాఖలో తీసుకోవాల్సిన చర్యలను ఈ కమిటీ సమీక్షిస్తుంది.

ముసాయిదా బిల్లులకు ఆమోదం
శాసనసభ వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు 5 ముసాయిదా బిల్లులను మంత్రిమండలి ఆమోదించింది. గృహ నిర్మాణ సంస్థ బిల్లు, ఉద్యాన విశ్వవిద్యాలయ బిల్లు, పర్యాటకులపై దాడులను నియంత్రించేలా ప్రత్యేక చట్టం, రెవెన్యూ రిజిస్ట్రేషన్‌ చట్ట సవరణ, పురపాలక పంచాయతీరాజ్‌ చట్ట సవరణల బిల్లులు ఇందులో ఉన్నాయి.

కరోనాపై విస్తృత చర్చ
కరోనాపై మంత్రిమండలిలో విస్తృత స్థాయి చర్చ జరిగింది. ప్రతిరోజూ 3 లక్షల ప్రత్యేక టీకాల కార్యక్రమాన్ని పెద్దఎత్తున చేపడుతున్నామని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో కొవిడ్‌ పూర్తిగా అదుపులో ఉందని, విద్యాసంస్థలు తెరిచిన తర్వాత కూడా కేసుల్లో పెరుగుదల లేదని స్పష్టం చేశారు. థర్డ్ వేవ్ ని ఎదుర్కునేందుకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ సిద్ధంగా ఉందని, అన్నిరకాల ఔషధాలు, ఆక్సిజన్‌, టెస్ట్‌ కిట్లు, టీకాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఇప్పటివరకు తెలంగాణలో 2.56 కోట్ల టీకా డోసులు అందించామని తెలిపారు. చిన్న పిల్లలకు వైద్యం కోసం ప్రత్యేకంగా 5200 పడకలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఆక్సిజన్‌ కొరత నివారించేందుకు ఇప్పటికే ఉత్పత్తి సామర్థ్యాన్ని 280 మెట్రిక్‌ టన్నులకు చేర్చామని, దానిని 550 మెట్రిక్‌ టన్నులకు పెంచాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.

First Published:  17 Sept 2021 5:03 AM IST
Next Story