Telugu Global
NEWS

ఖైరతాబాద్ లో మట్టి గణపతి ప్రతిష్ట.. ఎప్పటినుంచంటే..!

హుస్సేన్ సాగర్ లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు నిమజ్జనం చేయవద్దని హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది నుంచి ఖైరతాబాద్ లో మట్టి గణపతిని మాత్రమే ప్రతిష్టించాలని కమిటీ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. ఖైరతాబాద్ లో అతి పెద్ద వినాయకుడిని ప్రతిష్టించడం ఆనవాయితీగా వస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఖైరతాబాద్లో మాత్రమే అతి పెద్ద విగ్రహాన్ని ప్రతిష్ట చేస్తూ వస్తున్నారు. అక్కడ ప్రతిష్టించే ప్లాస్టర్ ఆఫ్ […]

ఖైరతాబాద్ లో మట్టి గణపతి ప్రతిష్ట.. ఎప్పటినుంచంటే..!
X

హుస్సేన్ సాగర్ లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు నిమజ్జనం చేయవద్దని హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది నుంచి ఖైరతాబాద్ లో మట్టి గణపతిని మాత్రమే ప్రతిష్టించాలని కమిటీ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. ఖైరతాబాద్ లో అతి పెద్ద వినాయకుడిని ప్రతిష్టించడం ఆనవాయితీగా వస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఖైరతాబాద్లో మాత్రమే అతి పెద్ద విగ్రహాన్ని ప్రతిష్ట చేస్తూ వస్తున్నారు.

అక్కడ ప్రతిష్టించే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను పక్కనే ఉన్న హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేస్తుంటారు. అయితే హుస్సేన్ సాగర్ లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను నిమజ్జనం చేయవద్దని హైకోర్టు ఇటీవల తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో హైదరాబాద్లో ఏర్పాటు చేసిన వేలాది విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా చర్యలు చేపడుతోంది. అలాగే హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీం కోర్టుకు వెళ్లింది. రేపు సుప్రీం కోర్టు ధర్మాసనం హైకోర్టు ఇచ్చిన తీర్పు పై విచారణ చేపట్టనుంది.

హుస్సేన్ సాగర్ లో గణేష్ విగ్రహాల నిమజ్జనం పై వివాదం నెలకొన్న నేపథ్యంలో ఇటీవల ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. నిమజ్జనానికి ఇబ్బందులు తలెత్తకుండా వచ్చే ఏడాది నుంచి మట్టి గణపతి ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది 70 అడుగుల మట్టి గణపతి ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మట్టితో తయారు చేసిన విగ్రహాన్ని నిమజ్జనానికి తీసుకుపోవడం కూడా కష్టం కాబట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన స్థానంలోనే నీటితో నిమజ్జనం చేయనున్నారు. ఇప్పటివరకూ ఖైరతాబాద్లో రంగురంగుల ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను చూసిన జనం ఇకపై ఆకట్టుకునే మట్టి గణపతి విగ్రహాలను చూడనున్నారు.

First Published:  15 Sept 2021 1:00 PM IST
Next Story