ఇకపై ఆన్ లైన్లోనూ సర్వదర్శనం టోకెన్లు..
తిరుమల భక్తులకు మరో శుభవార్త చెప్పారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. ప్రస్తుతం పరిమితంగా శ్రీవారి సర్వదర్శనం టోకెన్లను తిరుపతిలో జారీ చేస్తున్నారు. వీటితోపాటు సర్వదర్శనం టోకెన్లను ఆన్ లైన్లో జారీ చేసేందుకు టీటీడీ నిర్ణయించింది.
తిరుమల భక్తులకు మరో శుభవార్త చెప్పారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. ప్రస్తుతం పరిమితంగా శ్రీవారి సర్వదర్శనం టోకెన్లను తిరుపతిలో జారీ చేస్తున్నారు. వీటితోపాటు సర్వదర్శనం టోకెన్లను ఆన్ లైన్లో జారీ చేసేందుకు టీటీడీ నిర్ణయించింది. వారం రోజుల్లో ఆన్ లైన్లో టికెట్లు అందుబాటులోకి వస్తాయి. ఈ నెల 18వ తేదీ నుంచి పెరటాసి మాసం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో తిరుపతిలో ఇస్తున్న సర్వదర్శనం టోకెన్లను నిలిపివేస్తారని తెలుస్తోంది. టోకెన్ల కోసం తమిళ భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండటంతో కోవిడ్ నిబంధనలు అమలు చేయడం కష్టం అవుతుందని భావిస్తున్న టీటీడీ, ఈ నిర్ణయానికి వచ్చింది. ఇకపై రోజుకి 8వేల చొప్పున ఆన్ లైన్లో సర్వదర్శనం టోకెన్లు విడుదల చేస్తారు.
అందుబాటులోకి అగరబత్తులు..
టీటీడీ ఆధ్వర్యంలో అగరబత్తీల విక్రయ కేంద్రాన్ని చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించారు. ఆలయాల్లో వాడిన పూలతో ఏడు రకాల అగరబత్తీలు తయారు చేసి భక్తులకు టీటీడీ విక్రయిస్తోంది. లాభాపేక్ష లేకుండా దర్శన్ సంస్థ వీటిని తయారు చేస్తోంది. శ్రీవారి ఏడుకొండలకు సూచికగా అభయహస్త, తందనాన, దివ్యపాద, ఆకృష్టి, స్పష్టి, తుష్టి, దృష్టి పేర్లతో ఏడు రకాల అగరబత్తులను టీటీడీ విడుదల చేసింది. తిరుమల లోని లడ్డూ కౌంటర్లలో అగరబత్తులు విక్రయిస్తున్నారు.
పాలకమండలి సభ్యుల కోటా పెంపు..!
టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుల జాబితా రెండు మూడు రోజుల్లో ఖరారయ్యే అవకాశం ఉంది. గత పాలకమండలిలో మాదిరిగానే ఛైర్మన్ కాక మరో 24 మంది సభ్యులతో జాబితా రెడీ అయినట్టు తెలుస్తోంది. అయితే ఈసారి ప్రత్యేక ఆహ్వానితుల సంఖ్య 40కు పెంచుతారని అంటున్నారు. ఆహ్వానితిలు అనే పేరు లేకుండా సభ్యుల సంఖ్యనే 52కు పెంచుతారనే ప్రచారం కూడా ఉంది. పాలకమండలి సభ్యుల సంఖ్యను పెంచాలంటే చట్టసవరణ చేయాల్సి ఉంటుంది. ఈనెల 16న జరిగే మంత్రిమండలి సమావేశంలో ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్నాటక, తమిళనాడుతోపాటు మహారాష్ట్ర, ఢిల్లీ నుంచి కూడా ఈసారి టీటీడీ పాలకమండలి సభ్యత్వం కోసం సిఫార్సులు ఎక్కువగా వచ్చినట్టు తెలుస్తోంది.