సంస్కృతంలోనే మంత్రాలు చదవాలా..? హైకోర్టు కీలక వ్యాఖ్యలు..
దేవుడికి సంస్కృతం మాత్రమే అర్థమవుతుందని, సంస్కృతంలో మాత్రమే మంత్రాలు చదివితే ఆయన అర్థం చేసుకుని భక్తులకు వరాలిస్తారని, ఆలయాల్లో పూజలు చేసే సమయంలో సంస్కృతంలోనే మంత్రాలు చదవాలని అనుకోవడం పొరపాటని మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యానించింది. మనుషుల్ని సృష్టించిన దేవుడు, మనుషులు సృష్టించిన భాషలను అర్థం చేసుకోలేడా అని ప్రశ్నించింది. దేవుడికి అన్ని భాషలూ వచ్చని, ఏ భాషలో మంత్రాలు చదివినా ఆయన అర్థం చేసుకోగలరని వ్యాఖ్యానించింది. హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యం ఇదీ.. తమిళనాడులోని కరూర్ జిల్లాలోని ఓ […]
దేవుడికి సంస్కృతం మాత్రమే అర్థమవుతుందని, సంస్కృతంలో మాత్రమే మంత్రాలు చదివితే ఆయన అర్థం చేసుకుని భక్తులకు వరాలిస్తారని, ఆలయాల్లో పూజలు చేసే సమయంలో సంస్కృతంలోనే మంత్రాలు చదవాలని అనుకోవడం పొరపాటని మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యానించింది. మనుషుల్ని సృష్టించిన దేవుడు, మనుషులు సృష్టించిన భాషలను అర్థం చేసుకోలేడా అని ప్రశ్నించింది. దేవుడికి అన్ని భాషలూ వచ్చని, ఏ భాషలో మంత్రాలు చదివినా ఆయన అర్థం చేసుకోగలరని వ్యాఖ్యానించింది.
హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యం ఇదీ..
తమిళనాడులోని కరూర్ జిల్లాలోని ఓ ఆలయంలో పూజలు, ఇతర కార్యక్రమాలు తమిళంలో జరిపేలా ఆదేశించాలని దాఖలైన పిటిషన్ మద్రాస్ హైకోర్టులో విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా జస్టిస్ కిరుబాకరన్ నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. సంస్కృతం మాత్రమే దేవుళ్ల భాష అని.. ఆ భాషలో ప్రార్థనలు చేస్తే మాత్రమే దేవుడికి చేరతాయనే విధంగా గతంలో ప్రచారం కల్పించారని, దాని వల్లే ఇప్పటికీ సంస్కృతంలో మాత్రమే పూజలు చేస్తున్నారని న్యాయమూర్తులు చెప్పారు. అయితే తమిళం కూడా దేవుళ్ల భాషేనని, తమిళంలో మంత్రాలు చదివినా దేవుడు అర్థం చేసుకుంటాడని స్పష్టం చేశారు.
తమిళ భాష ఇలా పుట్టింది..
శివుడు నృత్యం చేస్తుండగా ఢమరుక శబ్దం నుంచి తమిళం పుట్టిందని నమ్ముతారని మద్రాస్ హైకోర్టు పేర్కొంది. దేవుడికి ఒక భాషే అర్థమవుతుందని నమ్మడానికి వీల్లేదని చెప్పింది. ఆళ్వార్లు తమిళంలో మంత్ర పఠనాన్ని అభివృద్ధి చేశారని.. ఇప్పటికీ తిరుమల తిరుపతి దేవస్థానంలో మార్గశిర మాసంలో ‘తిరుప్పావై’ చదువుతారని పేర్కొంది. పిటిషనర్ ఒక దేవాలయానికి సంబంధించి మాత్రమే ఆదేశాలివ్వాలని కోరారని.. కానీ దేశవ్యాప్తంగా దీన్ని పరిశీలించాల్సిన ఆవశ్యకత ఉందని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. సంస్కృతం మాత్రమే దేవ భాష అని ఇన్నాళ్లూ భక్తులను నమ్మిస్తూ వచ్చారని, ఇలాంటి సంప్రదాయాలను పక్కనపెట్టాల్సిన అవసరం ఉందని కోర్టు వ్యాఖ్యానించింది.