Telugu Global
National

టీకా వేసుకున్నారు సరే.. అది అసలా..? నకిలీయా..?

కాదేదీ కల్తీకి అనర్హం. అందులోనూ భారత్ లో కల్తీ వస్తువులకు ఉన్న మార్కెట్, అసలు వస్తువులకు కూడా ఉండదంటారు. కల్తీకి అలవాటు పడిపోయిన ప్రజలు, అసలు వస్తువుని చూపించినా నమ్మలేని స్థితికి చేరుకున్నారని ఇప్పటికే చాలా సర్వేలు రుజువు చేశాయి. ఈ క్రమంలో భారత్ లో నకిలీ వ్యాక్సిన్లు ప్రవేశించాయని కేంద్రానికి సమాచారమందింది. పక్కా ఇన్ఫర్మేషన్ తో కేంద్రం రంగంలోకి దిగింది. నకిలీల భరతం పట్టడానికి రాష్ట్రాలను అప్రమత్తం చేస్తోంది. గతంలో టీకాల కొరత వల్ల ప్రజలు […]

టీకా వేసుకున్నారు సరే.. అది అసలా..? నకిలీయా..?
X

కాదేదీ కల్తీకి అనర్హం. అందులోనూ భారత్ లో కల్తీ వస్తువులకు ఉన్న మార్కెట్, అసలు వస్తువులకు కూడా ఉండదంటారు. కల్తీకి అలవాటు పడిపోయిన ప్రజలు, అసలు వస్తువుని చూపించినా నమ్మలేని స్థితికి చేరుకున్నారని ఇప్పటికే చాలా సర్వేలు రుజువు చేశాయి. ఈ క్రమంలో భారత్ లో నకిలీ వ్యాక్సిన్లు ప్రవేశించాయని కేంద్రానికి సమాచారమందింది. పక్కా ఇన్ఫర్మేషన్ తో కేంద్రం రంగంలోకి దిగింది. నకిలీల భరతం పట్టడానికి రాష్ట్రాలను అప్రమత్తం చేస్తోంది.

గతంలో టీకాల కొరత వల్ల ప్రజలు ఇబ్బంది పడిన మాట వాస్తవం. వ్యాక్సినేషన్ కేంద్రాల ముందు తెగబారెడు క్యూలైన్లు కనిపించేవి, కొన్ని చోట్ల ఘర్షణలు కూడా జరిగాయి. టీకాల కోసం రాష్ట్రాలు కేంద్రంపై తీవ్ర ఒత్తిడి తెచ్చాయి. కానీ ఇటీవల పరిస్థితిలో చాలా మార్పులొచ్చాయి. టీకాల లభ్యత బాగా పెరిగింది. రోడ్లపై ఖాళీగా ఉన్నవారిని పిలిచి టీకా వేయించుకున్నారా లేదా అని అడిగి మరీ వారికి వ్యాక్సిన్ వేస్తున్న సంఘటనలు ఏపీ సహా చాలా రాష్ట్రాల్లో ఉన్నాయి. మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ ల పేరుతో అధికారులకు టార్గెట్లు ఇచ్చి మరీ వ్యాక్సిన్ వేయిస్తున్నారు. ఈ క్రమంలో విరివిగా లభిస్తున్న టీకాల్లో అసలు ఏది..? నకిలీ ఏది..? అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.

నకిలీ టీకాలపై ప్రపంచ ఆరోగ్యసంస్థ కూడా ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేసింది. నకిలీ టీకాలు ఆసియా, ఆఫ్రికా మార్కెట్లోకి వచ్చినట్లు వార్తలు వచ్చాయి. భారత్ లో పలుచోట్ల ఇటువంటి టీకాలు వాడుకలో ఉన్నాయనే అనుమానాలు వ్యక్తం చేస్తూ మీడియాలో కథనాలు వెలుబడ్డాయి. ఈ నేపథ్యంలో నకిలీ టీకాల వ్యవహారంపై కేంద్రం దర్యాప్తు ప్రారంభించింది. ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది. కరోనా వ్యాక్సిన్‌ అసలైనదా? నకిలీదా అనే విషయాన్ని సులువుగా తెలుసుకునేందుకు రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది. ప్రస్తుతం దేశంలో వినియోగిస్తోన్న కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌, స్పుత్నిక్‌-వి టీకాల తయారీ సంస్థలకు సంబంధించి.. ఆయా బాటిళ్లపై లేబుల్‌, రంగుతో పాటు తయారీ సంస్థల సమాచారం గురించిన వివరాలను తెలియజేస్తూ రాష్ట్రాలకు లేఖ రాసింది కేంద్రం.

అసలైన కొవిషీల్డ్‌ ని గుర్తించడం ఎలా..?
SII (సీరం ఇన్‌ స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా) పేరుతో లేబుల్‌, కొవిషీల్డ్‌ బ్రాండ్‌ పేరు.. ట్రేడ్‌ మార్కు(TM) గుర్తు, బోల్డ్ లెటర్స్ కాకుండా, సాధారణ ఫాంటులో జనరిక్‌ మందు పేరు, స్టిక్కర్‌ పైన ఎరుపు రంగులో CGS Not For Sale అనే స్టాంపు, ఆకుపచ్చ రంగులో అల్యూమినియంతో కూడిన బాటిల్‌ మూత.. ఇలా కొన్ని గుర్తుల ద్వారా కొవిషీల్డ్ అసలా నకిలీయా అని గుర్తించాలని సూచించింది.

ఇవీ.. అసలైన కొవాగ్జిన్‌ గుర్తులు..
అల్ట్రావైలెట్ రేస్ మాత్రమే గుర్తించే లేబుల్ పై డీఎన్ఏ లాంటి గుర్తులు, లేబుల్‌ మీద అతిచిన్న చుక్కల రూపంలో కొవాగ్జిన్‌ అనే పేరు, కొవాగ్జిన్ హోలోగ్రామ్‌.

స్పుత్నిక్‌-వి టీకాకు ఇవే గుర్తులు..
స్పుత్నిక్-వి లో రెండు రకాలున్నాయి. ఒకటి రష్యా తయారీ, మరొకటి ఇండియన్ మేడ్. ఈ రెండు బాటిళ్ల డిజైన్‌, వాటిపై సమాచారం ఒకటే ఉన్నా, తయారీ సంస్థ పేరు మాత్రం వేర్వేరుగా ఉంటుంది. టీకా బాక్సు ముందు, వెనక భాగాల్లో సమాచారం ఇంగ్లీష్‌ లో ఉంటుంది, సీసా లేబుల్‌ పై మాత్రం రష్యా భాషలో సమాచారం ఉంటుంది.

ఇలాంటి కొన్ని గుర్తులను రాష్ట్రాలకు పంపించింది కేంద్రం. నకిలీ టీకాల సమాచారం దొరికితే వెంటనే తమకు తెలియజేయాలని చెప్పింది. ఆమధ్య.. పశ్చిమబెంగాల్ లో నకిలీ టీకాల ముఠా గుట్టు రట్టయింది. ఏకంగా ఓ మహిళా ఎంపీకి నకిలీ టీకా వేసి మోసం చేశారు కేటుగాళ్లు. ఇప్పుడీ మార్కెట్ దేశమంతా విస్తరించిందనే సమాచారంతో కేంద్రం రంగంలోకి దిగింది.

First Published:  6 Sept 2021 2:25 AM IST
Next Story