ప్రధాని ముందు తెలంగాణ కోర్కెల చిట్టా..
దేశ రాజధాని ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ భవనానికి శంకుస్థాపన చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనంతరం ప్రధాని నరేంద్రమోదీతో గంటసేపు ఏకాంతంగా భేటీ అయ్యారు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమం పూర్తవుతున్న సందర్భంలో ప్రారంభోత్సవానికి ఆయనను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. అనంతరం ఆయన ముందు తెలంగాణ కోర్కెల చిట్టాను ఉంచారు. జీహెచ్ఎంసీ ఉప ఎన్నికల సందర్భంలో మోదీపై తీవ్ర స్థాయిలో మాటల తూటాలు పేల్చిన అనంతరం తొలిసారిగా ఆయనతో ముఖా ముఖి భేటీ అయ్యారు కేసీఆర్. తెలంగాణ […]
దేశ రాజధాని ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ భవనానికి శంకుస్థాపన చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనంతరం ప్రధాని నరేంద్రమోదీతో గంటసేపు ఏకాంతంగా భేటీ అయ్యారు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమం పూర్తవుతున్న సందర్భంలో ప్రారంభోత్సవానికి ఆయనను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. అనంతరం ఆయన ముందు తెలంగాణ కోర్కెల చిట్టాను ఉంచారు.
జీహెచ్ఎంసీ ఉప ఎన్నికల సందర్భంలో మోదీపై తీవ్ర స్థాయిలో మాటల తూటాలు పేల్చిన అనంతరం తొలిసారిగా ఆయనతో ముఖా ముఖి భేటీ అయ్యారు కేసీఆర్. తెలంగాణ అభివృద్ధికి బాసటగా నిలవాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన అనంతరం ఢిల్లీలోని ఏపీ భవన్ లో సగభాగాన్ని తెలంగాణకు కేటాయించారు. అయితే తాము ప్రత్యేకంగా మరో ప్రాంతంలో తెలంగాణ భవన్ నిర్మించుకుంటామని, దానికి స్థలాన్ని కేటాయించాలని ప్రధానికి విన్నవించారు కేసీఆర్.
కేఎంటీపీకి వెయ్యి కోట్లు..
వరంగల్ లో ఏర్పాటుచేసిన కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు (కేఎంటీపీ)లో సౌకర్యాల కల్పనకోసం రూ.వెయ్యి కోట్లు మంజూరు చేయాలని సీఎం కేసీఆర్ విజ్ఞప్తిచేశారు. పార్కుకు అవసరమయ్యే ఇతర నిధులను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని పేర్కొన్నారు. విభజన చట్టంలో పేర్కొన్నట్టు తెలంగాణలో గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటుచేయాలని కోరారు. కరీంనగర్ లో ట్రిపుల్ ఐటీ నిర్మాణానికి సహకరించాలన్నారు.
రోడ్ల నిర్మాణానికి అదనపు నిధులు..
ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన కింద తెలంగాణలో 4 వేల కిలోమీటర్ల పొడవున రోడ్లు ఉన్నాయని వాటి వెడల్పుని పెంచి కొత్తగా రోడ్లు వేయాలని, దానికి తగిన నిధులు కేటాయించాలని ప్రధానిని కోరారు. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి అదనపు నిధులు ఇవ్వలేదని ఈ సందర్భంగా ప్రధానికి గుర్తుచేశారు కేసీఆర్.
కొత్త జిల్లాలకు ఐపీఎస్ లు, జవహర్ విద్యాలయాలు..
తెలంగాణలోని 21 కొత్త జిల్లాల్లో జవహర్ నవోదయ విద్యాలయాలు (జేఎన్వీ) ఏర్పాటుచేయాలని కోరారు కేసీఆర్. దేశంలోని ప్రతి జిల్లాలో నవోదయ విద్యాలయం ఏర్పాటుచేయాలన్న కేంద్ర ప్రభుత్వ పాలసీ ప్రకారం తెలంగాణలో నూతనంగా ఏర్పాటైన జిల్లాల్లో జేఎన్వీలు నిర్మించాలన్నారు. జిల్లాల పునర్ వ్యవస్థీకరణ తర్వాత పోలీస్ జిల్లా యూనిట్లు, పోలీస్ కమిషనరేట్ల సంఖ్య పెరిగిందని, అందుకు అనుగుణంగా ఐపీఎస్ క్యాడర్ సంఖ్యను పెంచాలని ప్రధానిని సీఎం కేసీఆర్ కోరారు. ఐపీఎస్ క్యాడర్‌ను 139 నుంచి 195కు పెంచాలని వినతి పత్రం అందించారు.
ఐఐఎం, పారిశ్రామిక కారిడార్..
ప్రతి రాష్ట్రంలో ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ (ఐఐఎం) ఏర్పాటుచేయాలన్న కేంద్ర ప్రభుత్వ విధానం ప్రకారం హైదరాబాద్ కు ఐఐఎంను మంజూరుచేయాలని కోరారు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (హెచ్.సి.యు.) క్యాంపస్ లో 2వేల ఎకరాల స్థలం అందుబాటులో ఉందని చెప్పారు. తెలంగాణకు ప్రతిపాదించిన హైదరాబాద్-నాగ్ పూర్, హైదరాబాద్-వరంగల్ పారిశ్రామిక కారిడార్లను వెంటనే మంజూరుచేయాలని ప్రధానికి వినతిపత్రం అందించారు కేసీఆర్. దీనిద్వారా ఆయా ప్రాంతాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతాయని, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని చెప్పారు.
మొత్తం 10లేఖలను ఈ భేటీ సందర్భంగా ప్రధానికి అందజేశారు కేసీఆర్. ఈ లేఖలను స్వీకరించిన మోదీ, సానుకూలంగా స్పందించారని, యాదాద్రి ప్రారంభోత్సవానికి వస్తానని హామీ ఇచ్చారని తెలంగాణ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈరోజు కూడా ఢిల్లీలోనే మకాం వేస్తున్న కేసీఆర్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ను కలుస్తారు.