ఇక ఏ నెల పింఛను ఆ నెల మాత్రమే పంపిణీ.. బకాయిలకు స్వస్తి..!
ఏపీ ప్రభుత్వం పింఛన్ల పంపిణీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఇక ఏ నెల పింఛన్ ఆ నెల మాత్రమే తీసుకునేలా కొత్త నిబంధన తీసుకొచ్చింది. ఇకపై వృద్ధాప్య, వితంతు పింఛన్లకు బకాయిల చెల్లింపు ఉండదు. ఇతర రాష్ట్రాల్లో జీవిస్తూ రెండు నెలలకో,మూడు నెలలకో ఒకసారి ఊర్లకు వచ్చి అక్రమంగా పింఛను తీసుకెళ్లే వారికి చెక్ పెట్టేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.ఏపీ ప్రభుత్వం ప్రతి నెలా 60 లక్షల మంది లబ్ధిదారులకు పింఛను అందజేస్తోంది. ప్రతి […]
ఏపీ ప్రభుత్వం పింఛన్ల పంపిణీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఇక ఏ నెల పింఛన్ ఆ నెల మాత్రమే తీసుకునేలా కొత్త నిబంధన తీసుకొచ్చింది. ఇకపై వృద్ధాప్య, వితంతు పింఛన్లకు బకాయిల చెల్లింపు ఉండదు. ఇతర రాష్ట్రాల్లో జీవిస్తూ రెండు నెలలకో,మూడు నెలలకో ఒకసారి ఊర్లకు వచ్చి అక్రమంగా పింఛను తీసుకెళ్లే వారికి చెక్ పెట్టేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.ఏపీ ప్రభుత్వం ప్రతి నెలా 60 లక్షల మంది లబ్ధిదారులకు పింఛను అందజేస్తోంది. ప్రతి లబ్ధిదారుడికి రూ. 2250 అందజేస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో అందించని విధంగా ఏపీలో అధిక మొత్తంలో పింఛను అందజేస్తున్నారు.
ప్రభుత్వం ప్రతి నెల 1వ తేదీ నుంచి పింఛన్ పంపిణీ ప్రారంభిస్తోంది. అయితే ఇటీవల నెల నెలా పింఛను తీసుకొని వారి సంఖ్య పెరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. లబ్ధిదారులు ఏ నెల పింఛన్ ఆ నెల తీసుకోకుండా రెండు నెలలకు ఒకసారో,మూడు నెలలకు ఒకసారో బకాయిపడ్డ పింఛన్ మొత్తాన్ని ఒకేసారి తీసుకుంటున్నారు. అయితే ఇలాంటి వారు ఇతర రాష్ట్రాల్లో జీవనం సాగిస్తూ కేవలం పింఛన్ కోసం మాత్రమే సొంతూళ్లకు వచ్చి బకాయి మొత్తం తీసుకున్న తర్వాత తిరిగి వెళ్లిపోతున్నట్లు అధికారులు గుర్తించారు. ఇలా అక్రమంగా పింఛను తీసుకునే వారికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఇక ఏ నెల పింఛను ఆ నెలలో మాత్రమే పంపిణీ చేయనున్నారు. ఒకవేళ లబ్ధిదారుడు ఏదైనా కారణాల వల్ల ఒక నెలలో పింఛను తీసుకోకపోతే..ఇకపై ఆ మొత్తాన్ని చెల్లించరు. సెప్టెంబర్ నెలకు సంబంధించి పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఈ రోజు నుంచి ప్రారంభం కాగా, ఈ నూతన నిబంధన కూడా ఇవాళే ప్రారంభించినట్లు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్ )అధికారులు తెలిపారు.కొంత మంది లబ్ధిదారులు జూలై,ఆగస్ట్ నెలలకు సంబంధించి పింఛన్ కూడా తీసుకోవాల్సి ఉండగా.. ప్రభుత్వం వారికి బకాయిలను కూడా విడుదల చేయలేదు. కేవలం ఈ నెలకు సంబంధించి పింఛన్ మాత్రమే విడుదల చేసింది.
రాష్ట్రంలో 60 లక్షల మంది పింఛనుదారులు ఉండగా, ప్రతి నెలా రెండు లక్షలకు పైగా మంది పింఛన్ నెల నెలా తీసుకోవడం లేదు. ఇలా ఏప్రిల్ లో 2.04 లక్షల మంది, మేలో 2.57 లక్షల మంది, జూన్ లో 2.70 లక్షల మంది, జూలైలో 2.14 లక్షల మంది, ఆగస్టులో 2.40 లక్షల మంది లబ్ధిదారులు పింఛను తీసుకోనట్లు అధికారులు గుర్తించారు.
ఇక వీరందరికీ పింఛన్ బకాయిలను ప్రభుత్వం చెల్లించదు. కాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై మిశ్రమ స్పందన వస్తోంది. ఇతర ప్రాంతాల్లో జీవిస్తూ అక్రమంగా పింఛను పొందే వారికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో చెక్ పెట్టొచ్చని కొందరు అంటుండగా, సొంతూళ్లలో పనుల్లేక బతుకు దెరువు కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లి వచ్చే వారికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ద్వారా నష్టం చేకూరే అవకాశం ఉందని మరికొందరు అంటున్నారు.