ఏపీ రాజధానిపై మరో రగడ.. కేంద్రం వివరణ..
ఇప్పటికే ఏపీ రాజధాని అంశం కోర్టు కేసుల్లో చిక్కుకుపోయి ఉంది. శాసన సభ మూడు రాజధానుల బిల్లుకి ఆమోదం తెలిపినా కోర్టు కేసులతో ఇంకా ఆ విషయం పెండింగ్ లోనే ఉంది. దీంతో ఏపీ రాజధాని అమరావతా లేక, పరిపాలనా రాజధానిగా ప్రతిపాదించిన విశాఖనా అనే విషయంలో అటు కేంద్రం కూడా సందిగ్ధంలో పడింది. తాజాగా ఈ విషయమై విడుదల చేసిన ఓ నివేదిక మరింత వివాదానికి కారణం అయింది. జులై 26న లోక్ సభలో ఓ […]
ఇప్పటికే ఏపీ రాజధాని అంశం కోర్టు కేసుల్లో చిక్కుకుపోయి ఉంది. శాసన సభ మూడు రాజధానుల బిల్లుకి ఆమోదం తెలిపినా కోర్టు కేసులతో ఇంకా ఆ విషయం పెండింగ్ లోనే ఉంది. దీంతో ఏపీ రాజధాని అమరావతా లేక, పరిపాలనా రాజధానిగా ప్రతిపాదించిన విశాఖనా అనే విషయంలో అటు కేంద్రం కూడా సందిగ్ధంలో పడింది. తాజాగా ఈ విషయమై విడుదల చేసిన ఓ నివేదిక మరింత వివాదానికి కారణం అయింది. జులై 26న లోక్ సభలో ఓ ప్రశ్నకు సమాధానంగా విడుదల చేసిన నివేదికలో రాష్ట్రాలు, వాటి రాజధానుల్లో పెట్రోల్ రేట్లు అనే పేరుతో ఓ సమాధానమిచ్చింది పెట్రోలియం శాఖ. అందులో ఏపీ రాజధానిగా విశాఖను పేర్కొంది. దీంతో అమరావతి ఏకైక రాజధానిగా కావాలని కోరుకుంటున్న వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. అటు మీడియాలో కూడా ఈ వ్యవహారం హైలెట్ కావడంతో కేంద్రం వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
పెట్రోల్ రేట్ల పెంపుపై ఇచ్చిన సమాధానం ద్వారా విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చెప్పడం తమ ఉద్దేశం కాదని, పెట్రో పెరుగుదలకు సంబంధించి దాన్ని ఒక ప్రతిపాదిత నగరంగా మాత్రమే చెప్పామని పేర్కొంది. హరియాణాకు అంబాలా, పంజాబ్ కు జలంధర్ సిటీలను కూడా ఇలాగే కేంద్రం రాజధాని లిస్ట్ లో చేర్చడం కూడా వివాదాస్పదమైంది. దీంతో ఈ తప్పును సరిదిద్దుకుంటున్నట్లు పెట్రోలియం శాఖ ప్రకటన విడుదల చేసింది. రాజధాని అని పొరపాటున హెడ్డింగ్ ప్రింట్ అయిందని, అయితే దాన్ని కేపిటల్ లేదా రిఫరెన్స్ సిటీగా చదువుకోవాలని కోరింది. సమాధానంలో ఆ మేరకు మార్పు చేసి లోక్‌సభ సచివాలయానికి కూడా సమాచారం పంపామని పెట్రోలియం శాఖ పేర్కొంది.
ఇప్పటికీ హైదరాబాదే రాజధాని..
లోక్ సభ నుంచి సంబంధిత శాఖలు లిఖిత పూర్వకంగా ఇచ్చే సమాధానాల్లో కొన్ని సార్లు హైదరాబాద్ ని కూడా ఏపీ రాజధానిగా ఉదహరించిన సందర్భాలున్నాయి. ఈసారి విశాఖను కేపిటల్ గా పేర్కొనడంతో మరింత కలకలం రేగింది. దీంతో కేంద్రం వెంటనే వివరణ ఇచ్చుకుంది. విశాఖను కేవలం రిఫరెన్స్ సిటీగా మాత్రమే పేర్కొంది.