Telugu Global
NEWS

మల్లారెడ్డి ఎపిసోడ్ తో కేసీఆర్ ని ఇరుకున పెడుతున్న రేవంత్..

అప్పట్లో అవినీతి ఆరోపణలు రావడంతో ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న టి.రాజయ్యను వెంటనే పక్కనపెట్టారు, ఇటీవల ఈటల రాజేందర్ పై ఆరోపణలు రాగానే ఆయన్నూ తప్పించేశారు. ఈ మధ్య కాలంలో చాలామందిని ఇలాంటి ఆరోపణల కారణంగా దూరం పెట్టిన తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి మల్లారెడ్డిని మాత్రం ఎందుకు ఇంకా భరిస్తున్నారంటూ ప్రశ్నించారు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. మల్లారెడ్డి అవినీతిని సాక్ష్యాధారాలతో సహా రుజువు చేస్తామని సవాల్ విసిరారు. అవినీతి మకిలి అంటినవారిని కేబినెట్ లో […]

మల్లారెడ్డి ఎపిసోడ్ తో కేసీఆర్ ని ఇరుకున పెడుతున్న రేవంత్..
X

అప్పట్లో అవినీతి ఆరోపణలు రావడంతో ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న టి.రాజయ్యను వెంటనే పక్కనపెట్టారు, ఇటీవల ఈటల రాజేందర్ పై ఆరోపణలు రాగానే ఆయన్నూ తప్పించేశారు. ఈ మధ్య కాలంలో చాలామందిని ఇలాంటి ఆరోపణల కారణంగా దూరం పెట్టిన తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి మల్లారెడ్డిని మాత్రం ఎందుకు ఇంకా భరిస్తున్నారంటూ ప్రశ్నించారు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. మల్లారెడ్డి అవినీతిని సాక్ష్యాధారాలతో సహా రుజువు చేస్తామని సవాల్ విసిరారు. అవినీతి మకిలి అంటినవారిని కేబినెట్ లో కొనసాగించడం కేసీఆర్ కి మంచిది కాదని హితవు పలికారు. పరోక్షంగా మల్లారెడ్డి అవినీతికి ఆయన మద్దతిస్తున్నట్టు భావించాల్సి వస్తుందని చెప్పారు.

మల్లారెడ్డి వర్సెస్ రేవంత్ రెడ్డి..
రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలపై స్పందిస్తూ తొడగొట్టి సవాల్ విసిరిన మంత్రి మల్లారెడ్డి కాస్త వెనక్కు తగ్గారు. రేవంత్ పై తాను చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో.. ఆయన క్షమాపణ చెప్పారు, సైలెంట్ అయ్యారు. అయితే మల్లారెడ్డి తరపున ఇప్పుడు కేటీఆర్ లైన్లోకి వచ్చారు. రేవంత్ మాటలు హద్దుమీరడం వల్లే, మల్లారెడ్డి కూడా పరుష పదజాలం వాడాల్సి వచ్చిందన్నారు. ఏడేళ్లుగా సహనంతో ఉన్నామని, ఇప్పుడు తమను రెచ్చగొడుతున్నారని, చర్యకు ప్రతిచర్య రూపంలో తమ సమాధానం ఉంటుందని చెప్పారు. చంద్రబాబు బినామీగా రేవంత్ రెడ్డి తెలంగాణలో రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.

బాబు మోచేతి నీళ్లు తాగింది మీరే కదా..!
చంద్రబాబుకు తెలంగాణ ఏజెంట్‌ అంటూ కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి స్పందించారు. కేసీఆర్‌, కేటీఆర్‌ ఇద్దరూ చంద్రబాబు మోచేతి నీళ్లు తాగినోళ్లే కదా అని సెటైర్ వేశారు. కేసీఆర్‌ రాజీనామా చేస్తే గజ్వేల్‌ ఉప ఎన్నికలో ఆయనపై పోటీ చేస్తానని సవాల్ విసిరారు. ముందస్తు ఎన్నికలకు వస్తే.. కాంగ్రెస్‌ బలమేంటో చూపిస్తామన్నారు రేవంత్ రెడ్డి.

ఉరుము ఉరిమి మల్లారెడ్డిపై..
ఇటీవల దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా పేరుతో కేసీఆర్ ని ఇరుకున పెట్టేలా బహిరంగ సభలు పెట్టిన రేవంత్ రెడ్డి, ఉన్నట్టుండి మంత్రి మల్లారెడ్డిపై అవినీతి ఆరోపణలు చేశారు. అయితే మంత్రి తొడగొట్టే ఎపిసోడ్ తో ఆ వ్యవహారం బాగా హైలెట్ అయింది. తీరా రేవంత్ సాక్ష్యాధారాలతో సహా దిగే సరికి మల్లారెడ్డికి ఏం చేయాలో తోచడంలేదు. రేవంత్ సహా కాంగ్రెస్ నేతలంతా మంత్రి అవినీతిపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఈటలపై ఆరోపణలు రాగానే వెంటనే రియాక్ట్ అయిన కేసీఆర్, మల్లారెడ్డి విషయంలో ఎందుకంత గుంభనంగా ఉన్నారనే విషయం కూడా చర్చకు వస్తోంది. వ్యక్తిగత కక్షతో ఈటలను బయటకు పంపించారని, మల్లారెడ్డితో ఆర్థిక లావాదేవీలు ఉండటం వల్లే ఆయన్ను కాపాడుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొత్తమ్మీద మల్లారెడ్డి ఎపిసోడ్ తో కేసీఆర్ ని ఇరుకున పెడుతున్నారు రేవంత్ రెడ్డి.

First Published:  28 Aug 2021 2:34 AM IST
Next Story