మహా వివాదంలో బెయిల్ విరామం.. మోదీ మౌనం దేనికి సంకేతం..
కేంద్ర మంత్రి నారాయణ్ రాణేను రాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేయించడంతో మొదలైన మహారాష్ట్ర వివాదంలో మంత్రికి బెయిల్ రావడంతో చిన్న విరామం వచ్చినట్టయింది. సీఎం ఉద్ధవ్ ఠాక్రేపై చెంపదెప్పల వ్యాఖ్యల నేపథ్యంలో అరెస్టు అయిన కేంద్ర మంత్రి నారాయణ రాణేకు రాయ్ గఢ్ లోని మహద్ మెజిస్ట్రేట్ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అయితే బీజేపీ, శివసేన మధ్య మాత్రం మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో జరుగుతోంది. నారాయణ రాణే అరెస్ట్ పై ఇప్పటికే మహారాష్ట్ర […]
కేంద్ర మంత్రి నారాయణ్ రాణేను రాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేయించడంతో మొదలైన మహారాష్ట్ర వివాదంలో మంత్రికి బెయిల్ రావడంతో చిన్న విరామం వచ్చినట్టయింది. సీఎం ఉద్ధవ్ ఠాక్రేపై చెంపదెప్పల వ్యాఖ్యల నేపథ్యంలో అరెస్టు అయిన కేంద్ర మంత్రి నారాయణ రాణేకు రాయ్ గఢ్ లోని మహద్ మెజిస్ట్రేట్ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అయితే బీజేపీ, శివసేన మధ్య మాత్రం మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో జరుగుతోంది.
నారాయణ రాణే అరెస్ట్ పై ఇప్పటికే మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అరెస్ట్ లతో తమ ను భయపెట్టలేరని మండిపడ్డారు. ఉద్ధవ్ ప్రభుత్వానికి టైమ్ దగ్గరపడిందని శాపనార్థాలు పెట్టారు. కేంద్ర మంత్రిని అరెస్టు చేయడం రాజ్యాంగ విలువలకు విరుద్ధమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా ట్వీట్ చేశారు. దీనిపై స్పీకర్ కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. రాణె అరెస్టు సరికాదని కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే అన్నారు. గతంలో శివసేన నేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఇప్పుడు రాణేని ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నించారు. రాణే వ్యవహారాన్ని స్పీకర్ దగ్గర తేల్చుకోవాలనుకుంటున్నారు బీజేపీ నేతలు.
తగ్గేది లేదంటున్న శివసేన..
రాణే వ్యాఖ్యల నేపథ్యంలో ముంబైలోని బీజేపీ కార్యాలయాలపై దాడులకి దిగారు శివసేన కార్యకర్తలు. వరుసగా రెండు రోజులపాటు ఆయనకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు. రాణె మానసిక సమతౌల్యాన్ని కోల్పోయారనీ, ఆయనకు షాక్ ట్రీట్‌మెంట్ ఇవ్వాలని అన్నారు మహారాష్ట్ర మంత్రి గులాబ్ రావు పాటిల్. రాణేను కేబినెట్ నుంచి తప్పించాలంటూ శివసేన ఎంపీ వినాయక్ రౌత్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. వివాదాన్ని సజీవంగా ఉంచారు.
మోదీ మౌనం దేనికి సంకేతం..?
తన కేబినెట్ లోని ఓ మంత్రి అరెస్ట్ అయితే కనీసం ప్రధాని నరేంద్ర మోదీ స్పందించకపోవడం విచిత్రంగా ఉంది. మంత్రి వ్యాఖ్యల్ని సమర్థిస్తూనో లేదా, మహారాష్ట్ర ప్రభుత్వం చర్యల్ని నిందిస్తూనో మోదీ స్పందించాల్సి ఉంది. కానీ మోదీ, అమిత్ షా ఇంకా మౌనాన్నే ఆశ్రయించారు. శివసేనతో భవిష్యత్తులో పొత్తు కోరుకుంటున్న వారిద్దరూ.. ప్రస్తుతానికి వివాదాన్ని పెద్దది చేయాలనుకోవట్లేదు. అందుకే అరెస్ట్ పై వారు నోరు మెదపలేదని అంటున్నారు.