Telugu Global
National

ప్రభుత్వ ఆస్తులు ప్రైవేటుపరం.. మానిటైజేషన్ బాంబు పేల్చిన కేంద్రం..

డీమానిటైజేషన్ తో భారత ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసిన బీజేపీ ప్రభుత్వం, ఇప్పుడు మానిటైజేషన్ పేరుతో మరో సంచలన నిర్ణయాన్ని అమలులోకి తెస్తోంది. కేంద్రం అధీనంలోని ప్రభుత్వ, ప్రభుత్వ రంగ ఆస్తుల నిర్వహణను ప్రైవేటు సంస్థలకు అప్పగించే ప్రణాళిక విడుదల చేసింది. నాలుగేళ్లు టార్గెట్ పెట్టుకుని 6లక్షల కోట్ల రూపాయలు సమకూర్చుకుంటామని స్పష్టం చేశారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. వీటిలో రహదారులు, రైల్వేల వాటా అధికం. జాతీయ రహదారుల నిర్వహణ, దానికి సంబంధించిన ఆస్తుల […]

ప్రభుత్వ ఆస్తులు ప్రైవేటుపరం.. మానిటైజేషన్ బాంబు పేల్చిన కేంద్రం..
X

డీమానిటైజేషన్ తో భారత ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసిన బీజేపీ ప్రభుత్వం, ఇప్పుడు మానిటైజేషన్ పేరుతో మరో సంచలన నిర్ణయాన్ని అమలులోకి తెస్తోంది. కేంద్రం అధీనంలోని ప్రభుత్వ, ప్రభుత్వ రంగ ఆస్తుల నిర్వహణను ప్రైవేటు సంస్థలకు అప్పగించే ప్రణాళిక విడుదల చేసింది. నాలుగేళ్లు టార్గెట్ పెట్టుకుని 6లక్షల కోట్ల రూపాయలు సమకూర్చుకుంటామని స్పష్టం చేశారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. వీటిలో రహదారులు, రైల్వేల వాటా అధికం. జాతీయ రహదారుల నిర్వహణ, దానికి సంబంధించిన ఆస్తుల నిర్వహణ ప్రైవేటుకి అప్పగించడం ద్వారా 1.6లక్షల కోట్ల రూపాయలు సమీకరిస్తుంది. ఇక రైల్వే ఆస్తులను అప్పగించి 1.52లక్షల కోట్లు సమీకరించాలనేది కేంద్రం ప్లాన్.

ఆస్తులు అమ్మట్లేదు కానీ..
‘నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్’. క్లుప్తంగా చెప్పాలంటే ఆస్తుల్ని అమ్మకుండా దానిపై హక్కుల్ని ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టే పథకం. కేంద్రానికి నిర్వహణ సాధ్యం కానప్పుడు, నిరర్థక ఆస్తుల పేరుతో కంపెనీలను ప్రైవేటుపరం చేయడం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి ప్రైవేటీకరణకు తీవ్ర వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో కేవలం పేరు మార్చి, నిర్వహణ మాత్రం ప్రైవేటుకి అంటూ మానిటైజేషన్ పేరుతో వేసిన కొత్త ఎత్తుగడ ఇది. ఈ కార్యక్రమం ద్వారా సమకూరే నిధులను మళ్లీ మౌలిక వసతుల కల్పనకే వెచ్చిస్తామన్నారు మంత్రి నిర్మల. మానిటైజేషన్‌ అంటే ఆస్తుల విక్రయం కాదని, వాటిని పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తున్నామని, గడువు తీరిన తర్వాత వాటిని ప్రభుత్వానికి ఇచ్చేయాల్సి ఉంటుందని చెప్పారు. నీతి ఆయోగ్‌ రూపొందించిన ‘నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్’ షెడ్యూల్ ని ఆమె విడుదల చేశారు.

ఏమేం చేస్తారు..?
12 శాఖలకు చెందిన 20కి పైగా ఆస్తులపై ప్రైవేటు సంస్థలకి అధికారాలు కట్టబెట్టబోతున్నారు. 2022 నుంచి 2025 వరకు ఈ కార్యక్రమం అమలవుతుంది.
– రైల్వేలో 400 స్టేషన్లు, 90 ప్యాసింజర్ రైళ్లు, 1,400 కిలోమీటర్ల ట్రాక్‌, 265 గూడ్స్‌ షెడ్లు, 15 రైల్వే స్టేడియంలను ప్రైవేటుకి అప్పగిస్తారు.
– ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలోని 25 విమానాశ్రయాలను ప్రైవేటీకరిస్తారు. ఢిల్లీ, హైదరాబాద్‌, బెంగుళూరు తదితర విమానాశ్రయాల్లో ప్రభుత్వ వాటాలను పూర్తిగా విక్రయిస్తారు.
– 9 మేజర్‌ పోర్టుల్లో ఉన్న 31 ప్రాజెక్టులను పీపీపీ విధానంలో అప్పగిస్తారు.
– బీబీఎన్‌ఎల్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌, డిపార్ట్‌మెంట్‌ టెలీ కమ్యూనికేషన్స్‌ లో ఉన్న ఆస్తులన్నింటినీ ప్రైవేటు వారికి ఇచ్చేస్తారు.
– జాతీయ స్టేడియంలు, ప్రాంతీయ కేంద్రాలు, పట్టణ ప్రాంతాల్లోని కాలనీలు, గెస్ట్ హౌస్ లు, హోటళ్లు వంటి వాటిని ప్రైవేటుకు అప్పగిస్తారు.

రాష్ట్రాలకు తాయిలాలు..
ప్రైవేటీకరణలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా భాగం పంచుకుంటే.. వాటికి కూడా అదనపు ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించింది కేంద్రం. రాష్ట్రాలు తమ ప్రభుత్వరంగ సంస్థల నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకొని, యాజమాన్య హక్కులన బదిలీ చేస్తే.. తద్వారా ఎంత మొత్తం సమకూరితే, అందుకు సమానమైన మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం మ్యాచింగ్‌ గ్రాంట్‌గా ఇస్తుంది.
– ప్రైవేటీకరణ కాకుండా.. రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థలను మార్కెట్‌ లో లిస్ట్‌చేస్తే, ఆ లిస్టింగ్‌ ద్వారా వచ్చే డబ్బులో 50% మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అందిస్తుంది.
– రాష్ట్రాలు తమ ఆస్తులను మానిటైజ్‌ చేస్తే, తద్వారా వచ్చే మొత్తంలో 33 శాతానికి సమానమైన మొత్తాన్ని కేంద్రం ఇస్తుంది.

మొత్తమ్మీద.. అమ్మకం అనే పేరు లేకుండా, నిర్వహణ అనే పేరుతో కేంద్రం తన అధీనంలోని ఆస్తులను ప్రైవేటుపరం చేయడానికి రంగం సిద్ధం చేసుకుంది. రాష్ట్రాలను కూడా అందులో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చింది.

First Published:  24 Aug 2021 2:47 AM IST
Next Story