Telugu Global
National

అమిత్ షా అపాయింట్‌మెంట్ కోరిన గద్దర్.. మధ్యవర్తి ఎవరో తెలుసా?

ఒకనాడు నక్సలైట్లకు మద్దతుగా పాటతో తెలుగు రాష్ట్రాలను ఒక తాటిపైకి తెచ్చిన గాయకుడు గద్దర్. ఎంతో మంది గద్దర్ పాటకు ఆకర్షితులై ఉద్యమ బాట పట్టారనేది బహిరంగ రహస్యమే. అనాడు రాజ్యాన్ని ధిక్కరించి మరీ పాటతో ఉద్యమానికి ఊపి తెచ్చిన గద్దర్‌పై ఎన్నో కేసులు ఉన్నాయి. గద్దర్‌పై రెండున్నర దశాబ్దాల క్రితం జరిగిన హత్యాయత్నం దేశమంతా సంచలనం సృష్టించింది. అప్పటి ఆ హత్యాయత్నం సందర్భంగా దిగిన బులెట్ ఒకటి ఇంకా గద్దర్ వెన్నుపూసలోనే ఉండిపోయింది. అయినా సరే […]

అమిత్ షా అపాయింట్‌మెంట్ కోరిన గద్దర్.. మధ్యవర్తి ఎవరో తెలుసా?
X

ఒకనాడు నక్సలైట్లకు మద్దతుగా పాటతో తెలుగు రాష్ట్రాలను ఒక తాటిపైకి తెచ్చిన గాయకుడు గద్దర్. ఎంతో మంది గద్దర్ పాటకు ఆకర్షితులై ఉద్యమ బాట పట్టారనేది బహిరంగ రహస్యమే. అనాడు రాజ్యాన్ని ధిక్కరించి మరీ పాటతో ఉద్యమానికి ఊపి తెచ్చిన గద్దర్‌పై ఎన్నో కేసులు ఉన్నాయి. గద్దర్‌పై రెండున్నర దశాబ్దాల క్రితం జరిగిన హత్యాయత్నం దేశమంతా సంచలనం సృష్టించింది. అప్పటి ఆ హత్యాయత్నం సందర్భంగా దిగిన బులెట్ ఒకటి ఇంకా గద్దర్ వెన్నుపూసలోనే ఉండిపోయింది. అయినా సరే ఉద్యమానికి వెన్నుదన్నుగానే ఉన్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా గద్దర తనపై ఉన్న కేసులకు వెరువకుండా తన పాటలతో ఉత్సాహాన్ని నింపారు. కానీ కాలక్రమంలో ఆయన ఆలోచనా ధోరణిలో మార్పు వచ్చింది.

ఓటు ద్వారా కాదు తుపాకి ద్వారానే రాజ్యాధికారం వస్తుందని ఒకప్పుడును నమ్మిన గద్దర్.. ఆ తర్వాత రాజకీయ పార్టీలకు దగ్గరయ్యారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీతో కలసి ప్రచార వేదికల్లో పాల్గొన్నారు. అప్పుడే గద్దర్‌పై అనేక విమర్శలు వచ్చాయి. తాజాగా ఆయన బీజేపీ నాయకులను కలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ కిషన్ రెడ్డిని గద్దర్ సోమవారం కలిశారు. తనపై నమోదైన కేసుల విషయమై ఆయన కూలంకషంగా చర్చించారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డితో దేశంలోని పలు రాష్ట్రాల్లో తనపై నమోదైన కేసుల విషయమై గద్దర్ చర్చించారు.

కేంద్ర హోం మంత్రి అమిత్ సా అపాయింట్‌మెంట్ ఇప్పించాలని కిషన్ రెడ్డిని గద్దర్ కోరినట్లు తెలుస్తున్నది. తనపై నమోదైన కేసుల విషయాలను అమిత్ షా దృష్టికి తీసుకొని వెళ్లి వాటిని ఉపసంహరించుకోవాలని కోరుతానని గద్దర్ చెప్పినట్లు సమాచారం. తాను 1990 తర్వాత నక్సలైట్ జీవితాన్ని వదిలి జనజీవన స్రవంతిలో కలిశానని గద్దర్ గుర్తు చేశారు. అప్పటి ప్రభుత్వం కోరడంతోనే తాను ఆ నిర్ణయాన్ని తీసుకున్నానని గద్దర్ చెప్పారు. కానీ 1997లో తనపై హత్యాయత్నం జరిగిందని.. అప్పుడు తన శరీరంలో మిగిలిన బుల్లెట్ కారణంగా ఇప్పటికీ అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని గద్దర్ చెప్పారు. తాను డాక్టర్ల పర్యవేక్షణలో ఉంటే పరారీ అయినట్లు ప్రచారం చేస్తున్నారని గద్దర్ వాపోయారు.

తాను ప్రస్తుతం ఎవరికీ అనుబంధంగా పని చేయడం లేదని.. తనపై ఉన్న కేసులు ఎత్తివేయాలని గతంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కోరానని గద్దర్ చెప్పుకొచ్చారు. కాగా, గద్దర్ చెప్పిన విషయాలను కూలంకషంగా విన్న కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి తన వినతిని అమిత్ షాకు చేరవేస్తానని చెప్పారు. కాగా, గద్దర్ బీజేపీ మంత్రిని కలవడం.. కేంద్రంలోని అమిత్ షా అపాయింట్‌మెంట్ కోరడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు మావోయిస్టులను అణగదొక్కడానికి బీజేపీ ప్రభుత్వం కఠిన వ్యూహాలు అమలు చేస్తున్న సమయంలో గద్దర్ కలయిక విమర్శలకు దారితీస్తున్నది.

First Published:  23 Aug 2021 11:38 AM IST
Next Story