జయలలిత ఎస్టేట్ చోరీ కేసు తిరగదోడుతున్న స్టాలిన్..
అవినీతి విచారణ కేసుల పేరుతో అన్నాడీఎంకే నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న స్టాలిన్, తాజాగా పెద్ద తలకాయలకు మరో పెద్ద షాకిచ్చారు. జయలలిత కొడనాడు ఎస్టేట్ లో జరిగిన దొంగతనం వ్యవహారంపై నమోదైన కేసుని తిరగదోడుతున్నారు. కె.వి.సాయన్ అనే నిందితుడినుంచి మరోసారి పోలీసులు వాంగ్మూలం తీసుకోవడంతో ఈ కేసు వ్యవహారం తాజాగా వార్తల్లోకెక్కింది. గతంలో అన్నాడీఎంకేలోని కీలక నేతలకు ఈ దొంగతనంతో సంబంధం ఉందంటూ సాయన్ సంచలన ఆరోపణలు చేశాడు. ఆ తర్వాత జరిగిన ఓ యాక్సిడెంట్ […]
అవినీతి విచారణ కేసుల పేరుతో అన్నాడీఎంకే నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న స్టాలిన్, తాజాగా పెద్ద తలకాయలకు మరో పెద్ద షాకిచ్చారు. జయలలిత కొడనాడు ఎస్టేట్ లో జరిగిన దొంగతనం వ్యవహారంపై నమోదైన కేసుని తిరగదోడుతున్నారు. కె.వి.సాయన్ అనే నిందితుడినుంచి మరోసారి పోలీసులు వాంగ్మూలం తీసుకోవడంతో ఈ కేసు వ్యవహారం తాజాగా వార్తల్లోకెక్కింది. గతంలో అన్నాడీఎంకేలోని కీలక నేతలకు ఈ దొంగతనంతో సంబంధం ఉందంటూ సాయన్ సంచలన ఆరోపణలు చేశాడు. ఆ తర్వాత జరిగిన ఓ యాక్సిడెంట్ లో అతను తీవ్రంగా గాయపడగా, భార్య, పిల్లలు చనిపోయారు. ఇప్పుడు మరోసారి సాయన్ ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
కక్షసాధింపు..
జయలలిత ఎస్టేట్ లో జరిగిన దొంగతనంలో అన్నాడీఎంకే నేతల్ని ఇరికించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, దాన్ని అడ్డుకుంటామని అంటున్నారు మాజీ ముఖ్యమంత్రులు పళనిస్వామి, పన్నీర్ సెల్వం. ఈ కేసు విచారణలో పోలీసులు దూకుడు పెంచడాన్ని తప్పుబడుతూ వారు అసెంబ్లీ ముందు ధర్నా చేపట్టారు.
అప్పట్లో ఏం జరిగింది..?
జయలలిత మరణం తర్వాత కొడనాడులోని ఆమె ఎస్టేట్ లో జయలలిత, శశికళకు చెందిన గదుల్లో చోరీ జరిగింది. అప్పట్లో ఈ వ్యవహారం సంచలనంగా మారింది. అంతకంటే సంచలనం ఏంటంటే.. ఆ దొంగతనంలో పాల్గొన్న వారంతా ఒక్కొక్కరే అనుమానాస్పద స్థితిలో మరణించడం. అయితే.. అప్పట్లో అన్నాడీఎంకే అధికారంలో ఉండటంతో ఆ కేసు వ్యవహారం ఓ కొలిక్కి రాలేదు. అధికార పార్టీ నేతలే కేసు విచారణను విజయవంతంగా అటకెక్కించారనే ప్రచారం తమిళనాడులో ఉంది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జయలలిత ఎస్టేట్ లో జరిగిన దొంగతనం కేసులో పూర్తి స్థాయి విచారణ జరిపిస్తామని స్టాలిన్ హామీ ఇచ్చారు. హామీ ఇచ్చినట్టుగానే స్టాలిన్ సీఎం అయిన తర్వాత వరుసగా అన్నాడీఎంకే నేతల అవినీతి కేసులన్నీ తిరగదోడుతున్నారు.
కొడనాడు ఎస్టేట్ సెక్యూరిటీ గార్డుల్లో ఒకరిని దొంగలు అదేరోజు హత్య చేశారు. దొంగతనంలో కీలకంగా వ్యవహరించిన జయలలిత మాజీ డ్రైవర్ కనకరాజ్ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. చనిపోవడానికి కొన్నిరోజుల ముందే అతను, అన్నాడీఎంకేలోని పెద్ద తలకాయలకు ఈ వ్యవహారంలో భాగస్వామ్యం ఉందని చెప్పారు. మరో మాజీ డ్రైవర్ సాయన్ చావునుంచి తప్పించుకున్నాడు. ఇప్పుడు సాయన్ సాయంతో ఈ కేసుని తిరగదోడుతున్నారు పోలీసులు. జయలలిత, శశికల కు చెందిన గదులనిండా డాక్యుమెంట్లు, డబ్బుల సంచులు ఉన్నట్టు వారు పోలీసులకు చెప్పారు. అప్పటినుంచి ఆ ఎస్టేట్ పోలీసుల అధీనంలోనే ఉంది. దానిలో పూర్తి స్థాయిలో సోదాలు జరిపేందుకు ఇప్పుడు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసు విచారణను అన్నాడీఎంకే తప్పుబడుతూ అసెంబ్లీలో గొడవ చేస్తోంది. అసెంబ్లీ బయట కూడా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు నేతలు. ప్రస్తుతం తమిళ రాజకీయాల్లో ఇదో హాట్ టాపిక్ మారింది.