Telugu Global
NEWS

టీడీపీలో బుచ్చయ్య కలకలం.. రాజీనామా చేస్తారంటూ ప్రచారం..

టీడీపీ సీనియర్ నేత, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే.. బుచ్చయ్య చౌదరి పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారనే ప్రచారానికి ఇప్పుడు మరింత బలం చేకూరింది. రాజీనామా వ్యవహారంపై స్పందించాలంటూ బుచ్చయ్యను మీడియా ప్రతినిధులు సంప్రదించిన క్రమంలో ఆయన సమాధానం దాటవేశారు. కనీసం అది తప్పుడు ప్రచారం అని కూడా ఖండించలేదు. ఇప్పుడేమీ మాట్లాడలేనని మాత్రమే సమాధానమిచ్చారు. దీంతో బుచ్చయ్య చౌదరి రాజీనామా వ్యవహారం మరింత సంచలనంగా మారింది. రాష్ట్రమంతా ఫ్యాన్ గాలి వీచినా.. టీడీపీ గెలుచుకున్న అతి […]

టీడీపీలో బుచ్చయ్య కలకలం.. రాజీనామా చేస్తారంటూ ప్రచారం..
X

టీడీపీ సీనియర్ నేత, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే.. బుచ్చయ్య చౌదరి పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారనే ప్రచారానికి ఇప్పుడు మరింత బలం చేకూరింది. రాజీనామా వ్యవహారంపై స్పందించాలంటూ బుచ్చయ్యను మీడియా ప్రతినిధులు సంప్రదించిన క్రమంలో ఆయన సమాధానం దాటవేశారు. కనీసం అది తప్పుడు ప్రచారం అని కూడా ఖండించలేదు. ఇప్పుడేమీ మాట్లాడలేనని మాత్రమే సమాధానమిచ్చారు. దీంతో బుచ్చయ్య చౌదరి రాజీనామా వ్యవహారం మరింత సంచలనంగా మారింది.

రాష్ట్రమంతా ఫ్యాన్ గాలి వీచినా.. టీడీపీ గెలుచుకున్న అతి కొద్ది సీట్లలో రాజమండ్రి రూరల్ ఒకటి. అక్కడినుంచి ఎమ్మెల్యేగా గెలిచిన బుచ్చయ్య చౌదరి, తొలి విడత అసెంబ్లీ సమావేశాల్లో తన వాణి గట్టిగానే వినిపించారు. వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు, ప్రభుత్వంపై ప్రశ్నలు సంధించారు. కానీ కొన్నాళ్లుగా బుచ్చయ్య చౌదరిలో ఆ ఆవేశం తగ్గింది. చంద్రబాబు నిర్వహించిన జూమ్ కాన్ఫరెన్స్ లకు కూడా ఆయన దూరంగా ఉంటూ వచ్చారు. టీడీపీ తరపున ప్రెస్ మీట్లు పెట్టడం, పార్టీ వ్యవహారాలపై సోషల్ మీడియాలో స్పందించే టీమ్ లో కూడా బుచ్చయ్య లేరు. ఆయన పార్టీతో అంటీముట్టనట్టుగా ఉంటున్నారనే విషయం కొన్నాళ్లుగా చర్చనీయాంశమైంది. అయితే ఆయన పార్టీకి రాజీనామా చేస్తారని, పదవిని కూడా వదులుకుంటారని ఎవరూ ఊహించలేదు. కానీ అది కేవలం పుకారు మాత్రమే కాదనే విషయం బుచ్చయ్య చౌదరి మీడియాకు మాట దాటవేయడంతో తేలిపోయింది.

టీడీపీ నుంచి ప్రస్తుతం నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీవైపుకి వెళ్లారు. పార్టీకి రాజీనామా చేయలేదు, పదవుల్ని కూడా వారు వదులుకోలేదు. కరణం బలరాం, మద్దాలి గిరి, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్.. ఈ నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు, నేరుగా వైసీపీ కండువా కప్పుకోకుండా తమ సన్నిహితులు, కుటుంబ సభ్యుల్ని మాత్రం పార్టీలో చేర్పించారు. పరోక్షంగా వైసీపీకి మద్దతు ప్రకటించారు. ఈ క్రమంలో బుచ్చయ్య రాజీనామా చేసి వైసీపీలో చేరితే మాత్రం అది మరింత సంచలనంగా మారడం ఖాయం. బుచ్చయ్య చౌదరి పరోక్షంగా ఈ వార్తలకు బలం చేకూర్చినా, అటు టీడీపీ నేతలెవరూ దీనిపై ఇంకా స్పందించలేదు.

First Published:  19 Aug 2021 8:31 AM IST
Next Story