ఆఫ్ఘన్ అధినేత ఎవరు..?
తాలిబన్ల ధాటికి ఆఫ్ఘన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశం వదిలి పారిపోయాడు. ప్రస్తుతం ఆఫ్ఘన్ లో తాలిబన్ల రాజ్యం ఖరారైనా రాజు ఎవరనేది మాత్రం తేలలేదు? ఎవరిపేరుమీద పరిపాలన జరగాలనేదానిపై స్పష్టత లేదు. ఈ దశలో తనని తాను తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు ఉపాధ్యక్ష స్థానంలో ఉన్న అమ్రుల్లా సలేహ్. ఆప్ఘనిస్థాన్ రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడు దేశం విడిచి వెళ్లిన సమయాల్లో ఉపాధ్యక్షుడు.. అధ్యక్ష బాధ్యతలను నిర్వర్తించాల్సి ఉంటుంది కాబట్టి తాను అధ్యక్ష బాధ్యతలను చేపట్టానని సోషల్ […]
తాలిబన్ల ధాటికి ఆఫ్ఘన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశం వదిలి పారిపోయాడు. ప్రస్తుతం ఆఫ్ఘన్ లో తాలిబన్ల రాజ్యం ఖరారైనా రాజు ఎవరనేది మాత్రం తేలలేదు? ఎవరిపేరుమీద పరిపాలన జరగాలనేదానిపై స్పష్టత లేదు. ఈ దశలో తనని తాను తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు ఉపాధ్యక్ష స్థానంలో ఉన్న అమ్రుల్లా సలేహ్. ఆప్ఘనిస్థాన్ రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడు దేశం విడిచి వెళ్లిన సమయాల్లో ఉపాధ్యక్షుడు.. అధ్యక్ష బాధ్యతలను నిర్వర్తించాల్సి ఉంటుంది కాబట్టి తాను అధ్యక్ష బాధ్యతలను చేపట్టానని సోషల్ మీడియా వేదికగా ప్రకటించుకున్నాడు అమ్రుల్లా సలేహ్. త్వరలో వివిధ రాజకీయ పార్టీల నేతల మద్దతు కూడగట్టేందుకు వారందరిని కలుస్తానంటూ ట్వీట్ చేశారు అమ్రుల్లా సలేహ్. తాలిబన్లకు లొంగిపోయే ప్రసక్తే లేదని చెప్పారాయన.
మరోవైపు ఆఫ్ఘాన్ లో నూతన ప్రభుత్వ ఏర్పాటు దిశగా తాలిబన్లు చర్చలు కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్, మరో కీలక నేత అబ్దుల్లా అబ్దుల్లాతో, తాలిబన్ సీనియర్ నాయకుడు అమీర్ ఖాన్ ముత్తకీ పలుమార్లు భేటీ అయ్యారు. తాలిబన్లు కానివారికి కూడా కొత్త ప్రభుత్వంలో చోటుకల్పిస్తారని తెలుస్తోంది. గత 20 ఏళ్లలో అఫ్ఘానీలకు, అందులో ప్రధానంగా మహిళలకు సంక్రమించిన హక్కులను పరిరక్షించడంపై వారు ప్రధానంగా చర్చిస్తున్నారని తెలుస్తోంది. 1-2 రోజుల్లో చర్చలు కొలిక్కి వచ్చి, నూతన ప్రభుత్వం ఏర్పడే అవకాశముందని అంటున్నారు.
మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ ని పూర్తి స్థాయిలో ఆక్రమించుకున్న తర్వాత తొలిసారి తాలిబన్లు మీడియాతో మాట్లాడారు. తాలిబన్ అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ మీడియాకు పలు విషయాలు వెల్లడించారు. 20 ఏళ్ల తర్వాత విదేశీ సైన్యాన్ని తరిమికొట్టామని, అంతర్గతంగా, బయట నుంచి శత్రుత్వం కోరుకోవడంలేదని ఆయన చెప్పారు. మహిళల హక్కులకు ఎలాంటి భంగం కలగనివ్వబోమని కూడా అన్నారు. తాము అందరినీ క్షమించామని, ఎవరి మీదా ప్రతీకారం ఉండదని తేల్చి చెప్పారు. ప్రజల ఇళ్లలో సోదాలు, దాడులు ఉండవని వెల్లడించారు. అయితే విదేశాలనుంచి తమకు నిధులు నిలిచిపోకుండా ఉండేందుకే తాలిబన్లు ఇలా శాంతి మంత్రం పఠిస్తున్నారనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఈ అనుమానాలన్నిటికీ మరో వారం రోజుల్లోగా స్పష్టత వస్తుంది.