Telugu Global
International

ఆఫ్ఘాన్ జాతి పునర్నిర్మాణం అమెరికా లక్ష్యం కాదు -బైడెన్..

అమెరికా సేనలు వెనక్కి వెళ్లిపోవడంతో ఆఫ్ఘనిస్తాన్ పూర్తిగా తాలిబన్ల వశమైన సంగతి తెలిసిందే. అమెరికా అధ్యక్షుడి నిర్ణయమే దీనికి ప్రధాన కారణమంటూ విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ, జో బైడెన్ ఈ వ్యవహారంపై స్పందించారు. సెప్టెంబర్‌ 11 దాడుల తర్వాత అల్‌ ఖైదా ఉగ్రవాద సంస్థ సంబంధాలను నిర్మూలించడాన్ని మాత్రమే లక్ష్యంగా పెట్టుకున్నామని, అంతేకాని ఆఫ్ఘాన్ జాతి పునర్నిర్మాణం అమెరికా లక్ష్యం కాదని ఆయన స్పష్టం చేశారు. ఆఫ్ఘాన్‌ సంక్షోభం ఇక ఎంతమాత్రం అమెరికాకు ఆసక్తి కాదన్నారు. గతంలో […]

ఆఫ్ఘాన్ జాతి పునర్నిర్మాణం అమెరికా లక్ష్యం కాదు -బైడెన్..
X

అమెరికా సేనలు వెనక్కి వెళ్లిపోవడంతో ఆఫ్ఘనిస్తాన్ పూర్తిగా తాలిబన్ల వశమైన సంగతి తెలిసిందే. అమెరికా అధ్యక్షుడి నిర్ణయమే దీనికి ప్రధాన కారణమంటూ విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ, జో బైడెన్ ఈ వ్యవహారంపై స్పందించారు. సెప్టెంబర్‌ 11 దాడుల తర్వాత అల్‌ ఖైదా ఉగ్రవాద సంస్థ సంబంధాలను నిర్మూలించడాన్ని మాత్రమే లక్ష్యంగా పెట్టుకున్నామని, అంతేకాని ఆఫ్ఘాన్ జాతి పునర్నిర్మాణం అమెరికా లక్ష్యం కాదని ఆయన స్పష్టం చేశారు. ఆఫ్ఘాన్‌ సంక్షోభం ఇక ఎంతమాత్రం అమెరికాకు ఆసక్తి కాదన్నారు. గతంలో చేసిన తప్పులను తాను చేయకూడదని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. సైనిక బలగాల ఉపసంహరణ నిర్ణయం సరైనదని సమర్థించుకున్నారు. అమెరికాపై ఉగ్రదాడులను నిరోధించడమే తమ లక్ష్యమని బైడెన్‌ తెలిపారు.

తప్పంతా ఆఫ్ఘాన్ ప్రభుత్వానిది, సైన్యానిదే..
ఆఫ్ఘాన్ ప్రభుత్వం, సైనిక బలగాలపై అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ విమర్శలు గుప్పించారు. సైనికులకు అన్ని రకాల వనరులు కల్పించి శిక్షణ ఇచ్చామని, అయినా వారు తాలిబన్లతో పోరాడలేకపోయారన్నారు. ఆఫ్ఘాన్ పౌర ప్రభుత్వం నిలదొక్కుకోవడానికి అన్ని అవకాశాలు ఇచ్చామని, అయితే వారికి సంకల్పం బలం మాత్రం ఇవ్వలేకపోయామని చెప్పారు. తాము బిలియన్ డాలర్ల సాయం చేసినా, రష్యా, చైనా నుంచి ఆఫ్ఘాన్ కు సహకారం లేదని చెప్పారు. అమెరికా దళాలు, సిబ్బందిపై తాలిబన్లు దాడులు చేస్తే తీవ్ర ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించారు. ఆఫ్ఘనిస్థాన్‌ ప్రస్తుత పరిస్థితులు బాధాకరం అని, ఆ దేశ ప్రజలకు అమెరికా ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. వారి హక్కుల కోసం నిరంతరం పోరాడుతూనే ఉంటామన్నారు. త్వరలోనే ఆఫ్ఘాన్ లో ఉన్న అమెరికా పౌరులను తరలిస్తామని బైడెన్‌ తెలిపారు.

అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ ఎక్కడ..?
రాజధాని కాబూల్ కూడా తాలిబన్ల వశమైన వేళ, అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశం విడిచి పారిపోయారు. అయితే ఆయన తజకిస్తాన్ వెళ్లారని, అక్కడినుంచి ఒమన్ కు వెళ్లి, అటునుంచి అమెరికాకు వెళ్తారని తెలుస్తోంది. దీనిపై ఆఫ్ఘనిస్తాన్ లోని రష్యారాయబార కార్యాలయం ఓ ఆసక్తికర ప్రకటన విడుదల చేసింది. దేశం మొత్తం గగ్గోలు పెడుతున్న సందర్భంలో అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ నాలుగు కార్లు, ఓ హెలికాప్టర్ నిండా డబ్బు సంచులు తీసుకెళ్లారని రష్యా కార్యాలయం ప్రతినిధులు తెలిపారు. తాలిబన్ల పాలనను గుర్తించేందుకు రష్యా మాత్రమే ఆసక్తి చూపిస్తున్న వేళ, ఆఫ్ఘనిస్తాన్ నుంచి రష్యా మినహా మిగతా దేశాల దౌత్య కార్యాలయాలన్నీ మూతబడ్డాయి.

కాబూల్ ఎయిర్ పోర్ట్ కిటకిట..
పండగ సెలవలు ఇచ్చిన తర్వాత బస్టాండ్ లు ఎలా కిక్కిరిసిపోతాయో కాబూల్ ఎయిర్ పోర్ట్ అలా మారిపోయింది. అధ్యక్షుడే పారిపోయాడని వార్తలు రావడంతో ఆఫ్ఘాన్ పౌరులు ప్రాణభయంతో కాబూల్ ని విడిచి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. దేశంలోని వివిధ రాష్ట్రాల రాజధానులను తాలిబన్లు ఆక్రమించుకోవడంతో చాలా మంది మొదట కాబూల్‌ కు వలసవచ్చారు. తాలిబన్లు కాబూల్ ని కూడా ఆక్రమించుకోవడంతో దిక్కుతోచక విదేశాలకు పయనమయ్యారు. ఈ క్రమంలో విమానాలు నిండిపోవడంతో.. వాటి చక్రాల వద్ద కూర్చుని ప్రయాణించడానికి ప్రయత్నించిన ఇద్దరు కిందపడి దుర్మరణంపాలైన ఘటన అందరినీ కలచి వేస్తోంది.

అమెరికా బలగాలు తాలిబన్ల ప్రభుత్వాన్ని పడగొట్టకముందు.. అఫ్ఘాన్‌ పేరు ‘ఇస్లామిక్‌ ఎమిరేట్‌ ఆఫ్‌ అఫ్ఘనిస్తాన్‌’గా ఉండేది. ప్రస్తుతం ఆ దేశానికి మళ్లీ అదే పేరు స్థిరపడబోతోంది. తాలిబన్ల పొలిటికల్‌ బ్యూరో అధినేత ముల్లా అబ్దుల్‌ ఘనీ అఫ్ఘాన్‌ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడతారని అంటున్నారు.

First Published:  17 Aug 2021 2:30 AM IST
Next Story