యడ్డీ వద్దకు మంత్రి పదవుల పంచాయితీ..
అనుకున్నంతా అయింది. యడ్యూరప్ప లేని బీజేపీ సర్కారులో ముసలం పుట్టింది. దీంతో తాజా సీఎం బసవరాజ్ బొమ్మై హడావుడిగా మాజీ సీఎం యడ్యూరప్పతో భేటీ అయ్యారు. ట్రబుల్ షూటర్ ని సలహాలు అడిగారు. అసంతృప్తుల్ని ఎలా బుజ్జగించాలనేదానిపై సూచనలు తీసుకున్నారు. యడ్డీ సలహాలతో వెంటనే అసంతృప్త అమాత్యుడు ఆనంద్ సింగ్ ని కలసిన సీఎం బొమ్మై.. అంతా బాగుందని ప్రకటన ఇచ్చారు. పాలన పక్కనపెట్టి బుజ్జగింపులకే ప్రాధాన్యం.. కాంగ్రెస్ నుంచి వచ్చిన జంప్ జిలానీల సపోర్ట్ తో […]
అనుకున్నంతా అయింది. యడ్యూరప్ప లేని బీజేపీ సర్కారులో ముసలం పుట్టింది. దీంతో తాజా సీఎం బసవరాజ్ బొమ్మై హడావుడిగా మాజీ సీఎం యడ్యూరప్పతో భేటీ అయ్యారు. ట్రబుల్ షూటర్ ని సలహాలు అడిగారు. అసంతృప్తుల్ని ఎలా బుజ్జగించాలనేదానిపై సూచనలు తీసుకున్నారు. యడ్డీ సలహాలతో వెంటనే అసంతృప్త అమాత్యుడు ఆనంద్ సింగ్ ని కలసిన సీఎం బొమ్మై.. అంతా బాగుందని ప్రకటన ఇచ్చారు.
పాలన పక్కనపెట్టి బుజ్జగింపులకే ప్రాధాన్యం..
కాంగ్రెస్ నుంచి వచ్చిన జంప్ జిలానీల సపోర్ట్ తో కర్నాటకలో బీజేపీ ప్రభుత్వం నిలబడింది. మంత్రి పదవులు ఆశ చూపించి వారిని తమవైపు తిప్పుకుంది బీజేపీ. ఇప్పుడు సీఎం మారడంతో మంత్రి పదవులు కూడా మారిపోయాయి. దీంతో వలస నేతలు తమకు అప్రాధాన్య శాఖలు ఇచ్చారని బహిరంగంగానే విమర్శిస్తున్నారు. కొందరు పార్టీని వీడేందుకు సైతం సిద్ధపడ్డారని తెలుస్తోంది. అటు తన కొడుక్కి డిప్యూటీ సీఎం పదవి ఇస్తారని ఆశించి భంగపడిన యడ్యూరప్ప కూడా అసంతృప్త జ్వాలల్ని మరింతగా ఎగదోస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో సీఎం బసవరాజ్ బొమ్మై నేరుగా యడ్యూరప్పనే కలిసి పరిష్కారం చెప్పాలని కోరారు. ఈ భేటీ అనంతరం వరుసగా అసంతృప్త నేతల్ని బుజ్జగించే పనిలో పడ్డారు సీఎం బసవరాజ్ బొమ్మై. పాలనలో తనదైన మార్క్ చూపించాలని ఉవ్విళ్లూరుతున్న ఆయన, తన హయాం అంతా బుజ్జగింపులకే సరిపోతుందేమోనని భయపడుతున్నారు. అటు యడ్యూరప్ప కూడా తన కొడుక్కి డిప్యూటీ సీఎం పదవి ఇప్పించుకుని పరోక్షంగా తాను చక్రం తిప్పేందుకు, పార్టీపై, ప్రభుత్వంపై పెత్తనం కలిగి ఉండేందుకు ప్లాన్లు గీస్తున్నారు. ఈ క్రమంలో సీఎం బసవరాజ్ కి యడ్డీ ఏమేం సలహాలు ఇచ్చారనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
కాంగ్రెస్ కాటు వేస్తుందా..?
మరోవైపు కాంగ్రెస్ పార్టీ ప్రతీకార జ్వాలతో రగిలిపోతోంది. తమ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులిచ్చి ప్రభుత్వాన్ని కూలదోశారని బీజేపీపై కారాలు మిరియాలు నూరుతున్నారు కాంగ్రెస్ నేతలు. కానీ ఇప్పుడు వారు చేయగలిగిందేమీ లేకపోవడంతో అదనుకోసం ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ వలసలతో నొచ్చుకొంటున్న బీజేపీ నేతల్ని రెచ్చగొడుతున్నారు. బొమ్మై మంత్రి వర్గంలో బెంగళూరు ప్రాంతానికి 7 పదవులిచ్చారని 13 జిల్లాలకు అసలు ప్రాతినిధ్యం లేకుండా చేశారని విమర్శించారు కర్నాటక మాజీ సీఎం సిద్ధరామయ్య. బసవరాజ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చని శానపనార్థాలు పెట్టారు. మంత్రి పదవులు రాక చాలామంది అసంతృప్తితో రగిలిపోతున్నారని, వారంతా ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారని అన్నారు. ఎప్పటికైనా కాంగ్రెస్ ఆధ్వర్యంలోనే సుస్థిర ప్రభుత్వం ఏర్పాటవుతుందని చెప్పారు.