అవయవ దానంపై కొవిడ్ ప్రభావం..
మానవ శరీరంలో అవయవాలు చెడిపోయి చావుకి దగ్గరగా ఉన్నవారికి ఊపిరిలూదే ప్రక్రియ అవయవదానం. ప్రమాదాలు, లేదా ఇతర కారణాలతో బ్రెయిన్ డెడ్ అయినవారు, అయినవారికోసం అవయవాలు దానం చేసే కుటుంబ సభ్యులు.. అవయవాలు చెడిపోయి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నవారికి జీవనప్రదాతలు అవుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇటీవల కాలంలో ఇలాంటి అవయవదానాలు ఎక్కువయ్యాయి. అయితే కొవిడ్ ప్రభావం దీనిపై బాగా పడింది. కరోనా కాలంలో ఆస్పత్రుల్లో వైద్యులు, శస్త్ర చికిత్సలకు వెనకాడటం, లాక్ డౌన్ వల్ల ప్రయాణాలు […]
మానవ శరీరంలో అవయవాలు చెడిపోయి చావుకి దగ్గరగా ఉన్నవారికి ఊపిరిలూదే ప్రక్రియ అవయవదానం. ప్రమాదాలు, లేదా ఇతర కారణాలతో బ్రెయిన్ డెడ్ అయినవారు, అయినవారికోసం అవయవాలు దానం చేసే కుటుంబ సభ్యులు.. అవయవాలు చెడిపోయి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నవారికి జీవనప్రదాతలు అవుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇటీవల కాలంలో ఇలాంటి అవయవదానాలు ఎక్కువయ్యాయి. అయితే కొవిడ్ ప్రభావం దీనిపై బాగా పడింది. కరోనా కాలంలో ఆస్పత్రుల్లో వైద్యులు, శస్త్ర చికిత్సలకు వెనకాడటం, లాక్ డౌన్ వల్ల ప్రయాణాలు లేకపోవడంతో అవయవదానం అనేది ఓ దశలో కనిష్ట స్థాయికి చేరుకుంది. సెకండ్ వేవ్ ప్రభావం తగ్గుముఖం పడుతున్న వేళ, తెలంగాణలో ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంటేషన్ ఇప్పుడిప్పుడే జోరందుకుంటోంది.
గతేడాది కరోనా ప్రభావం మొదలైన తర్వాత తెలంగాణలో ఆర్గాన్ డొనేషన్ అనేది దాదాపుగా ఆగిపోయింది. తొలిదశ లాక్ డౌన్ కి ముందు అంటే 2020 ఫిబ్రవరి నెలలో అత్యథికంగా 52మందికి తెలంగాణలో అవయవాల మార్పిడి ఆపరేషన్లు జరిగాయి. ఆ తర్వాత మార్చి నెలలో 31, ఏప్రిల్ లో కేవలం 3 కేసులు వచ్చాయి. మేలో ఇలాంటి ఆపరేషన్లు అస్సలు జరగలేదు. జూన్ లో లాక్ డౌన్ ఎత్తేయడంతో పరిస్థితి మెరుగుపడినా జులైలో అస్సలు ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంటేషన్లు జరగలేదు. ఆగస్ట్ లో కేవలం ఇద్దరికి మాత్రమే ఆపరేషన్లు చేశారు. సెప్టెంబర్ నుంచి మళ్లీ ఈ తరహా ఆపరేషన్లు మొదలయ్యాయి.
ఇక ఈ ఏడాది విషయానికొస్తే.. 2021 ఫిబ్రవరిలోనే ఎక్కువగా అవయవమార్పిడి ఆపరేషన్లు జరిగాయి. కరోనా సెకండ్ వేవ్ ప్రభావం పెరిగిన తర్వాత తెలంగాణలో పగడ్బందీగా లాక్ డౌన్ అమలు చేయడం, అన్ని ఆస్పత్రుల్లో కొవిడ్ చికిత్సకే ప్రాధాన్యం ఇవ్వడంతో ఈ తరహా ఆపరేషన్లు ఆగిపోయాయి. ఇప్పుడు కరోనా పరిస్థితులు సద్దుమణగడంతో మరోసారి తెలంగాణలో అవయవ మార్పిడి ఆపరేషన్ల సంఖ్య పెరుగుతోందని గణాంకాలు చెబుతున్నాయి. జులై నెలలో అత్యథికంగా 61 ఆపరేషన్లు జరిగాయి.
కొవిడ్ కారణంగా చాలా చోట్ల అత్యవసర ఆపరేషన్లు మాత్రమే చేపట్టారు వైద్యులు. దంత వైద్య సేవలు పూర్తిగా ఆగిపోయాయి. డయాలసిస్ వంటి సేవలు కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో లేవు. ఇక అవయవదానం గురించి ఆలోచించాల్సిన పనే లేదు. ప్రమాదాల సంఖ్య తగ్గడం, తద్వారా బ్రెయిన్ డెడ్ కేసులు కూడా తగ్గిపోవడంతో జీవన్ దాన్ ట్రస్ట్ కి వస్తున్న స్పందన కూడా అంతంత మాత్రమే. తిరిగి ఇప్పుడు తెలంగాణలో ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంటేషన్ ఆపరేషన్లు జోరందుకుంటున్నాయి. మొత్తమ్మీద కొవిడ్ మహమ్మారి, ప్రజల రోజువారీ జీవితంపై తీవ్ర ప్రభావం చూపడమే కాకుండా, వైద్య సేవల రంగాన్ని కూడా తీవ్రంగా ప్రభావితం చేసింది. అత్యవసర సమయాల్లో అవయవ మార్పిడికోసం ఎదురు చూసిన చాలామంది కొవిడ్ నిబంధనల కారణంగా ప్రాణాలు వదలాల్సి వచ్చింది. అలాంటి వారందరికీ ఇప్పుడు మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి.