Telugu Global
National

కర్నాటక బీజేపీలో కాంగ్రెస్ మాజీల కలకలం..

కర్నాటకలో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణం కుప్పకూలి ఆ తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి మరీ బీజేపీ వైపు వచ్చారు. అప్పట్లో ఈ గోడదూకుళ్లు దేశవ్యాప్తంగా చర్చకు వచ్చాయి. అయితే అలా గోడదూకిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులిచ్చి అప్పటి సీఎం యడ్యూరప్ప నయా రాజకీయాలకు తెరలేపారు. ఇప్పుడదే కప్పదాటు ఎమ్మెల్యేలు బీజేపీకి తలనొప్పిగా మారారు. యడ్యూరప్ప సీఎంగా ఉన్నన్ని రోజులు అక్కడ అసంతృప్తి లేదు. తాజాగా ఆ కుర్చీలో బసవరాజ్ బొమ్మైని బీజేపీ అధిష్టానం […]

కర్నాటక బీజేపీలో కాంగ్రెస్ మాజీల కలకలం..
X

కర్నాటకలో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణం కుప్పకూలి ఆ తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి మరీ బీజేపీ వైపు వచ్చారు. అప్పట్లో ఈ గోడదూకుళ్లు దేశవ్యాప్తంగా చర్చకు వచ్చాయి. అయితే అలా గోడదూకిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులిచ్చి అప్పటి సీఎం యడ్యూరప్ప నయా రాజకీయాలకు తెరలేపారు. ఇప్పుడదే కప్పదాటు ఎమ్మెల్యేలు బీజేపీకి తలనొప్పిగా మారారు. యడ్యూరప్ప సీఎంగా ఉన్నన్ని రోజులు అక్కడ అసంతృప్తి లేదు. తాజాగా ఆ కుర్చీలో బసవరాజ్ బొమ్మైని బీజేపీ అధిష్టానం కూర్చోబెట్టడంతో అసమ్మతి సెగ మొదలైంది. యడ్యూరప్పే వారిని రెచ్చగొడుతున్నారా..? లేక నిజంగానే కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన నేతల్లో అసంతృప్తి ఉందా అనేది తేలాల్సి ఉంది.

గతంలో కాంగ్రెస్ సంకీర్ణ సర్కారుని కూలదోయడంలో ప్రధాన పాత్రధారిగా వ్యవహరించిన ఆనంద్ సింగ్ తనకు కేటాయించిన శాఖలపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయ‌న‌కు టూరిజం, ప‌ర్యావ‌ర‌ణ శాఖ‌ల‌ను కేటాయించారు. యడ్డీ హయాంలో ఈయన మౌలిక సరఫరాల అభివృద్ధి శాఖను చూసేవారు. తాజాగా గనుల శాఖ వస్తుందని ఆశించి భంగపడ్డారు. తన శాఖలపై అసంతృప్తి ఉందని సీఎంని కలసి చర్చిస్తానంటున్నారాయన. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరి మంత్రి పదవి సంపాదించిన మరో కీలక నేత ఎంటీబీ నాగరాజ్ కూడా అసంతృప్తితో రగిలిపోతున్నారు. మున్సిప‌ల్ అడ్మినిస్ట్రేష‌న్‌, చ‌క్కెర శాఖ‌లు తనకు వద్దంటున్నారు. దీనిపై సీఎంతో చర్చిస్తానన్నారు.

పదవులు రానివారి సంగతేంటి..?
పదవి వచ్చి అసంతృప్తిలో ఉన్నవారితో పోల్చి చూస్తే, అసలు పదవులు రానివారు మరింత రగిలిపోతున్నారు. గాలి సోమ శేఖర్‌ రెడ్డి, సోమలింగప్ప, గాలి కరుణాకర్‌ రెడ్డి మంత్రి పదవులు దక్కలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బెల్గాంలో కాంగ్రెస్ కి బలమైన నాయకులుగా ఉన్న రమేష్ జార్కహోలే, బాలకృష్ణ జార్కహోలే బీజేపీలో పదవులు ఆశించి భంగపడ్డారు. బెల్గాం బ్రదర్స్ గా పేరున్న వీరిద్దరిలో ఒకరికి డిప్యూటీ సీఎం, ఇంకొకరికి కీలక మంత్రి పదవి ఇస్తారని ఆశించారు. కానీ రెండూ జరగలేదు. దీంతో వారు రాజీనామాకు సిద్ధపడినట్టు తెలుస్తోంది.

అటు కాంగ్రెస్ నుంచి వచ్చినవారికి పదవులిచ్చి సొంత పార్టీ నేతల్ని విస్మరించడంతో బీజేపీ నేతలు గతంలో నొచ్చుకున్నారు. ఇప్పుడు కొత్త సీఎం బసవరాజ్ కేబినెట్ లో కాంగ్రెస్ నుంచి వచ్చినవారికి పదవులు నచ్చలేదు. కప్పదాట్లు అలవాటైన కాంగ్రెస్ మాజీలు మరో కీలక నిర్ణయం తీసుకుంటే మాత్రం కర్నాటకలో రాజకీయ సంక్షోభం తప్పదు. యడ్యూరప్ప లాగా బసవరాజ్ పొలిటికల్ మేనేజ్ మెంట్ తో నెట్టుకొస్తారా..? లేక ఉప ఎన్నికలను అనివార్యం చేస్తారా అనేది తేలాల్సి ఉంది.

First Published:  10 Aug 2021 3:53 AM IST
Next Story