తప్పుదిద్దుకుంటున్న కేరళ.. కొత్త రూల్స్ తో ప్రజలకు షాక్..
పండగలు, పబ్బాలకు కరోనా నిబంధనలు పక్కనపెట్టి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ విమర్శలపాలవుతున్న కేరళ ప్రభుత్వం ఇప్పుడు తప్పుదిద్దుకుంటున్నట్టు తెలుస్తోంది. కొవిడ్ వ్యాప్తి నివారణకు, బయట జనసంచారాన్ని తగ్గించేందుకు కేరళ ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. భారత్ లో ఇలాంటి నిబంధనలు తీసుకొచ్చిన తొలి రాష్ట్రంగా కేరళ చరిత్ర సృష్టించింది. ఇంతకీ ఏంటా నిబంధనలు..? కేరళలో బహిరంగ ప్రదేశాల్లో తిరగాలన్నా, ఏదైనా షాపుకి వెళ్లి వస్తువులు కొనాలన్నా.. కచ్చితంగా కొవిడ్ నెగెటివ్ రిపోర్ట్ చూపించాలి. వారం రోజుల లోపు చేయించుకున్న […]
పండగలు, పబ్బాలకు కరోనా నిబంధనలు పక్కనపెట్టి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ విమర్శలపాలవుతున్న కేరళ ప్రభుత్వం ఇప్పుడు తప్పుదిద్దుకుంటున్నట్టు తెలుస్తోంది. కొవిడ్ వ్యాప్తి నివారణకు, బయట జనసంచారాన్ని తగ్గించేందుకు కేరళ ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. భారత్ లో ఇలాంటి నిబంధనలు తీసుకొచ్చిన తొలి రాష్ట్రంగా కేరళ చరిత్ర సృష్టించింది.
ఇంతకీ ఏంటా నిబంధనలు..?
కేరళలో బహిరంగ ప్రదేశాల్లో తిరగాలన్నా, ఏదైనా షాపుకి వెళ్లి వస్తువులు కొనాలన్నా.. కచ్చితంగా కొవిడ్ నెగెటివ్ రిపోర్ట్ చూపించాలి. వారం రోజుల లోపు చేయించుకున్న ఆర్టీపీసీఆర్ టెస్ట్ నెగెటివ్ రిపోర్ట్ కలిగి ఉండాలి, లేదా వ్యాక్సిన్ తీసుకున్న సర్టిఫికెట్ అయినా చూపించాలి. ఈ రెండిటిలో ఏది లేకపోయినా వారికి బహిరంగ ప్రదేశాల్లోకి, షాపుల్లోకి నో ఎంట్రీ.
విమర్శల వెల్లువ..
కేరళ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త నిబంధనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలా చేస్తే వ్యాక్సిన్ వేయించుకోనివారు బయట తిరిగలేరని, వ్యాక్సిన్ ఆలస్యంగా వేయడం ప్రభుత్వం తప్పు కానీ, ప్రజల తప్పెలా అవుతుందని ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి. అయితే కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ మాత్రం తమ నిర్ణయాన్ని సమర్థించుకుంటున్నారు. ప్రజల ప్రాణాల బాధ్యత ప్రభుత్వానిదేనని, అందుకే ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకున్నామని చెబుతున్నారు. నిపుణులను సంప్రదించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు.
కేరళ అసెంబ్లీలో రచ్చ..
కేరళలో18ఏళ్లుపైబడి 49ఏళ్లు లోపు కేవలం 28శాతం మందికి మాత్రమే వ్యాక్సిన్ ఇచ్చారని, ఇలాంటి నిర్ణయాలతో మిగతావారంతా రోడ్లపైకి రాలేరని అసెంబ్లీలో గొడవ చేశారు కాంగ్రెస్ నేతలు. ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే పినరయి విజయన్ సర్కారు మాత్రం తగ్గేదే లేదంటోంది. ఓనమ్ పండగకు నిబంధనలు సడలించినట్టే సడలించి.. కర్ఫ్యూ వేళల్ని కుదించి.. ఇలా కొత్త లిటిగేషన్ పెట్టింది. షాపులు తెరిచి ఉన్నా.. వ్యాక్సిన్ వేయించుకున్నవారికి మాత్రమే ఎంట్రీ అనడంతో చాలామంది ఇళ్లకే పరిమితం కావాల్సి వస్తోంది.