అత్యవసర ఫిర్యాదులకు దేశమంతా ఒకటే నంబర్.. అదే 112
ప్రస్తుతం మన దేశంలో అత్యవసర సేవలకు గాను వివిధ నంబర్లు అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇకపై అన్ని అత్యవసర ఫిర్యాదులకు ఒకటే నంబర్ అందుబాటులోకి రానుంది. ఈ నంబర్‌ను అతి త్వరలోనే అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం ఉన్న డయల్ 100 స్థానంలో డయల్ 112ను ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం రెండేళ్ల కిందటే నిర్ణయం తీసుకుంది. ఈ నంబర్ పై అవగాహన కల్పించాలని దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. […]
ప్రస్తుతం మన దేశంలో అత్యవసర సేవలకు గాను వివిధ నంబర్లు అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇకపై అన్ని అత్యవసర ఫిర్యాదులకు ఒకటే నంబర్ అందుబాటులోకి రానుంది. ఈ నంబర్‌ను అతి త్వరలోనే అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం ఉన్న డయల్ 100 స్థానంలో డయల్ 112ను ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం రెండేళ్ల కిందటే నిర్ణయం తీసుకుంది. ఈ నంబర్ పై అవగాహన కల్పించాలని దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది.
వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ నంబర్ పై ప్రచారం కూడా చేశాయి. తెలంగాణ పోలీస్ శాఖ కూడా డయల్ 112 నంబర్ పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది. మరో రెండు నెలల వరకు మాత్రమే డయల్ 100 అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత డయల్ 112 అందుబాటులోకి వస్తుంది. ఒకవేళ ప్రజలు డయల్ 100 కి ఫోన్ చేసినా అది 112కు అనుసంధానం అయ్యేలా సాఫ్ట్ వేర్ సిద్ధం చేశారు. ఈ నెలాఖరు వరకు డయల్ 112కు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని పోలీస్ అధికారులు, కంట్రోల్ రూమ్ లో పనిచేసే వారికి నేర్పాలని ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు.
సోషల్ మీడియా, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా డయల్ 112 గురించి విస్తృత ప్రచారం కల్పించేందుకు సన్నద్ధమవుతున్నారు. ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద కూడా డయల్ 112 గురించి అవగాహన కలిగించేలా హోర్డింగ్ లు ఏర్పాటు చేయనున్నారు. దక్షిణాదిలో తెలంగాణతోపాటు కర్ణాటక, తమిళనాడులో కూడా అతి త్వరలోనే డయల్ 112 సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే తమిళనాడు, కర్ణాటకలో డయల్ 112 గురించి ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు.
ఒకే నంబర్ వల్ల సౌలభ్యం
ప్రస్తుతం మన దేశంలో వివిధ అత్యవసర సేవలకు వివిధ నంబర్లు అందుబాటులో ఉన్నాయి. అంబులెన్స్ సేవలకోసం 108, పోలీస్ సేవలకు 100, అగ్నిమాపక సేవలకు 101 నంబర్లు అందుబాటులో ఉన్నాయి. అయితే అత్యవసర సేవల కోసం అమెరికా, యూరప్ లోని పలు దేశాల్లో అన్ని సేవలకు ఒకే నంబర్ ఉపయోగిస్తున్నారు. మూడు రకాల నంబర్లను నిర్వహించడం కన్నా, ఒక నంబర్ నిర్వహించడం సులభం. కంట్రోల్ రూమ్ నిర్వాహణ కూడా సులభం గానే ఉంటుంది. అందువల్లే కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని రకాల సేవలకు ఒకే నంబర్ ను వినియోగించాలని నిర్ణయం తీసుకుంది.
అందుబాటులోకి అదనపు సేవలు
ఇప్పటివరకు అత్యవసర సేవలు అంటే పోలీసు, అంబులెన్సు, అగ్నిమాపక సేవలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. డయల్ 112 నంబర్ అందుబాటులోకి వచ్చాక పై మూడు రకాల సేవలతో పాటు విపత్తు నివారణ, గృహహింస, వేధింపులకు సంబంధించిన సేవలు కూడా అందుబాటులో ఉంటాయి.
వరదలు వంటి విపత్తులు సంభవించినా, ఎవరైనా వేధింపులకు పాల్పడుతున్నా, వరకట్న వేధింపులు తదితరాలకు సంబంధించి డయల్ 112 ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. ప్రస్తుతం డయల్ 112 దేశంలోని నాలుగైదు రాష్ట్రాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. సాంకేతిక కారణాల వల్ల దేశంలోని మిగిలిన రాష్ట్రాల్లో ఈ నంబర్ ఇంకా అమల్లోకి రాలేదు. ఈ ఏడాది అక్టోబర్ కల్లా దేశవ్యాప్తంగా ఈ నంబర్ ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.