Telugu Global
NEWS

ఏపీలో ఇకపై 6 రకాల స్కూల్స్..

ఎలిమెంటరీ స్కూల్, హై స్కూల్.. ఆ తర్వాత కాలేజీ విద్య. ఇప్పటి వరకూ ఇలా ఉన్న విద్యా విధానం పూర్తిగా రూపు రేఖలు మార్చుకోబోతోంది. ఇకపై ఏపీలో 6 రకాల స్కూల్స్ రాబోతున్నాయి. ఇప్పటి వరకూ దీనిపై ప్రాథమిక స్థాయిలో చర్చలు జరిగినా, సీఎం జగన్ తొలిసారిగా ఈ నూతన విద్యా విధానాన్ని ఖరారు చేశారు. ఇకపై 6 రకాల స్కూల్స్ లో విద్యాబోధన జరుగుతుందని, ఇంగ్లిష్ మీడియంలో బోధిస్తూ తెలుగుని తప్పనిసరి సబ్జెక్ట్ గా గుర్తించబోతున్నట్టు […]

ఏపీలో ఇకపై 6 రకాల స్కూల్స్..
X

ఎలిమెంటరీ స్కూల్, హై స్కూల్.. ఆ తర్వాత కాలేజీ విద్య. ఇప్పటి వరకూ ఇలా ఉన్న విద్యా విధానం పూర్తిగా రూపు రేఖలు మార్చుకోబోతోంది. ఇకపై ఏపీలో 6 రకాల స్కూల్స్ రాబోతున్నాయి. ఇప్పటి వరకూ దీనిపై ప్రాథమిక స్థాయిలో చర్చలు జరిగినా, సీఎం జగన్ తొలిసారిగా ఈ నూతన విద్యా విధానాన్ని ఖరారు చేశారు. ఇకపై 6 రకాల స్కూల్స్ లో విద్యాబోధన జరుగుతుందని, ఇంగ్లిష్ మీడియంలో బోధిస్తూ తెలుగుని తప్పనిసరి సబ్జెక్ట్ గా గుర్తించబోతున్నట్టు తెలిపారు.

6 రకాల స్కూల్స్ పై ఉన్నతాధికారులతో చర్చించారు సీఎం జగన్. నూతన విద్యా విధానంపై జిల్లాల్లో ఓరియంటేషన్ కార్యక్రమాలు నిర్వహించాలని, అందరిలో అవగాహన కల్పించాలని సూచించారు.
– శాటిలైట్‌ పౌండేషన్‌ స్కూల్స్‌ (ప్రీ ప్రైమరీ-1, ప్రీ ప్రైమరీ-2) (ఎల్కేజీ, యూకేజీ విద్య)
– ఫౌండేషన్‌ స్కూల్స్‌ (పీపీ–1, పీపీ–2, 1వ తరగతి, 2వ తరగతి)
– ఫౌండేషన్‌ ప్లస్‌ స్కూల్స్‌ (పీపీ–1 నుంచి 5వ వరగతి వరకు)
– ప్రీ హైస్కూల్స్‌ (3 నుంచి 7 లేదా 8వ తరగతి వరకు)
– హైస్కూల్స్‌ (3 నుంచి 10వ తరగతి వరకు)
– హైస్కూల్‌ ప్లస్‌ (3వ తరగతి నుంచి 12వ తరగతి వరకు)

ఇలా స్కూళ్లను వర్గీకరించడం వల్ల ఉపాధ్యాయుల క్రమబద్ధీకరణ జరుగుతుందని, స్కూళ్ల సంఖ్య 44వేలనుంచి 58వేలకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు అధికారులు. విద్యా హక్కు చట్టాన్ని అమలు చేస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందిస్తామని చెబుతున్నారు. నైపుణ్యాలున్న అంగన్వాడీలను కూడా బోధనలో భాగస్వాములుగా మారుస్తామని స్పష్టం చేశారు.

ప్రైవేట్ స్కూల్స్ లో ఎలా..?
ప్రభుత్వ రంగంలో ఎలిమెంటరీ, హైస్కూల్స్ ఉన్నట్టే.. ప్రైవేటు రంగంలో కూడా ఇప్పటి వరకూ ఆ రెండు రకాల వర్గీకరణే ఉండేది. అయితే ప్రైవేట్ ఎలిమెంటరీ విద్యలో ఎల్కేజీ, యూకేజీ అదనం. ఇప్పుడు ప్రభుత్వరంగంలో కూడా అవి చేరుతున్నాయి. అయితే ప్రైవేటు విద్యలో మాత్రం ఆరు రకాల స్కూల్స్ అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు. ప్రభుత్వ స్కూళ్లలో కూడా ఇకపై స్టేట్ సిలబస్ కాకుండా సీబీఎస్ఈ సిలబస్ ని దశల వారీగా ప్రవేశ పెడతారు కాబట్టి.. రాష్ట్రవ్యాప్తంగా ఏకీకృత సిలబస్ లో బోధన జరిగే అవకాశం ఉంది. మొత్తమ్మీద ఏపీ విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు రాబోతున్నట్టు స్పష్టమవుతోంది.

First Published:  5 Aug 2021 2:16 AM IST
Next Story