Telugu Global
National

చర్చలు వద్దు.. న్యాయమే కావాలి..

కృష్ణా నదీ జలాల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదంపై ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో మరో ధర్మాసనానికి బదిలీ అయింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఉన్న ధర్మాసనం తొలుత ఈ కేసు విచారణ చేపట్టింది. అయితే న్యాయ విచారణ కంటే, చర్చల ద్వారా ఈ సమస్యకు ఓ ముగింపు పలకాలని సీజేఐ ఎన్వీరమణ రెండు తెలుగు రాష్ట్రాలకు సూచించారు. చర్చలకు సుముఖంగా లేకపోతే.. తాను లేని మరో ధర్మాసనానికి […]

చర్చలు వద్దు.. న్యాయమే కావాలి..
X

కృష్ణా నదీ జలాల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదంపై ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో మరో ధర్మాసనానికి బదిలీ అయింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఉన్న ధర్మాసనం తొలుత ఈ కేసు విచారణ చేపట్టింది. అయితే న్యాయ విచారణ కంటే, చర్చల ద్వారా ఈ సమస్యకు ఓ ముగింపు పలకాలని సీజేఐ ఎన్వీరమణ రెండు తెలుగు రాష్ట్రాలకు సూచించారు. చర్చలకు సుముఖంగా లేకపోతే.. తాను లేని మరో ధర్మాసనానికి కేసు బదిలీ చేస్తామని చెప్పారు. అయితే న్యాయ విచారణ ద్వారానే తమకు తగిన న్యాయం చేయాలని కోరారు ఏపీ తరపు న్యాయవాదులు. దీంతో కేసుని మరో ధర్మాసనానికి బదిలీ చేశారు. చీఫ్ జస్టిస్ ఉన్న ధర్మాసనమే కేసు విచారణ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం తరపు న్యాయవాది కోరినా దాన్ని తోసిపుచ్చి మరో ధర్మాసనానికి కేసు బదిలీ చేశారు.

జులై నెలలో శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించింది. ప్రాజెక్ట్ లో కనీస నీటి మట్టం లేకపోయినా, ఏపీకి సాగునీటికి ఇబ్బంది కలుగుతుందని తెలిసినా, ఏకపక్షంగా తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేపట్టిందని ఆరోపిస్తూ ఏపీ ప్రభుత్వం కృష్ణా బోర్డుకి లేఖ రాసింది. ఆ లేఖ వల్ల ప్రయోజనం లేకపోవడంతో ఏపీ సీఎం జగన్, ప్రధాని నరేంద్రమోదీకి కూడా లేఖ రాశారు. అక్కడ కూడా వ్యవహారం తేలకపోవడం, ఇటు నీరు వృధాగా సముద్రంపాలు అవుతుండటంతో చివరి ప్రయత్నంగా ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

జులై 14న ఏపీ ప్రభుత్వం సుప్రీంలో పిటిషన్ దాఖలు చేయగా, 15వతేదీన కేంద్రం, జల వివాదానికి సంబంధించి ఓ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్ట్ లు కేంద్రం పరిధిలోకి తీసుకొస్తూ జలశక్తి శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉమ్మడి ప్రాజెక్ట్ ల వద్ద కేంద్ర బలగాలను ప్రవేశపెడతామని చెప్పింది. జలవివాదాల పరిష్కారాన్ని బోర్డులకే అప్పగించింది. ఈ క్రమంలో ప్రాజెక్ట్ ల లోకి వరదనీరు చేరడంతో జల విద్యుత్ ఉత్పత్తి నిరాటంకంగా కొనసాగుతోంది. అయితే కోర్టులో ఏపీ వేసిన కేసు విచారణ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ విచారణలో భాగంగా చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని ఇరు రాష్ట్రాలకు సూచించారు సీజేఐ. ఏపీ ప్రభుత్వం న్యాయ విచారణే కావాలని కోరడంతో.. కేసు మరో ధర్మాసనానికి బదిలీ అయింది.

First Published:  4 Aug 2021 4:24 AM GMT
Next Story