Telugu Global
National

మూడురోజుల పోలీస్ బాస్.. కేంద్రం వర్సెస్ కేజ్రీ 'వార్'..

మూడు రోజుల్లో పదవీ విరమణ చేస్తున్న వ్యక్తిని రాష్ట్ర పోలీస్ బాస్ గా నియమించారు అంటే, కచ్చితంగా దాని వెనక ఏదో ఒక బలమైన కారణం ఉండాలి, లేదా ఆ వ్యక్తిపై అంతులేని అభిమానం అయినా ఉండాలి. ఈ విషయాన్నే ఇప్పుడు ప్రశ్నిస్తోంది ఢిల్లీ ప్రభుత్వం. మూడు రోజుల్లో రిటైర్ అవుతున్న ఐపీఎస్ అధికారి రాకేష్ ఆస్తానాను తీసుకొచ్చి ఢిల్లీ పోలీస్ కమిషనర్ గా నియమిస్తూ కేంద్ర హోం శాఖ తీసుకున్న నిర్ణయాన్ని కేజ్రీవాల్ ప్రభుత్వం వ్యతిరేకించింది. […]

మూడురోజుల పోలీస్ బాస్.. కేంద్రం వర్సెస్ కేజ్రీ వార్..
X

మూడు రోజుల్లో పదవీ విరమణ చేస్తున్న వ్యక్తిని రాష్ట్ర పోలీస్ బాస్ గా నియమించారు అంటే, కచ్చితంగా దాని వెనక ఏదో ఒక బలమైన కారణం ఉండాలి, లేదా ఆ వ్యక్తిపై అంతులేని అభిమానం అయినా ఉండాలి. ఈ విషయాన్నే ఇప్పుడు ప్రశ్నిస్తోంది ఢిల్లీ ప్రభుత్వం. మూడు రోజుల్లో రిటైర్ అవుతున్న ఐపీఎస్ అధికారి రాకేష్ ఆస్తానాను తీసుకొచ్చి ఢిల్లీ పోలీస్ కమిషనర్ గా నియమిస్తూ కేంద్ర హోం శాఖ తీసుకున్న నిర్ణయాన్ని కేజ్రీవాల్ ప్రభుత్వం వ్యతిరేకించింది. ఆయన మాకొద్దు, వెనక్కి తీసుకెళ్లండి అంటూ ఏకంగా అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఈ తీర్మానాలను కేంద్రం లెక్క చేస్తుందా లేదా అనే విషయాన్ని పక్కనపెడితే, మూడు రోజుల్లో రిటైర్ అవుతున్న వ్యక్తిని ఢిల్లీ పోలీస్ కమిషనర్ గా పంపించడం మాత్రం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోని కేంద్రం మొండివైఖరిని మరోసారి బయటపెట్టింది.

సీబీఐ చీఫ్ గా వద్దు, ఢిల్లీ కమిషనర్ గా ఓకే..
1984 బ్యాచ్‌‌ గుజరాత్‌ క్యాడర్‌ కు చెందిన ఐపీఎస్‌ అధికారి రాకేష్ ఆస్తానా. బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ ని దాణా కుంభకోణంలో అరెస్ట్ చేసిన ఎస్పీగా రాకేష్ ఆస్తానా అప్పట్లో బాగా ఫేమస్. ఆ తర్వాత సీబీఐలో స్పెషల్ డైరెక్టర్ గా పనిచేస్తుండగా.. అదే డిపార్ట్ మెంట్ లోని మరో అధికారి అలోక్ వర్మ ఈయనపై తీవ్ర అవినీతి ఆరోపణలు చేశారు. దీంతో ఆస్తానాను సీబీఐ నుంచి తొలగించారు. ఆ తర్వాత సీబీఐ ప్రత్యేక కోర్టు ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చినా.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. అవినీతి మరక ఉండబట్టే ఆయన్ను సీబీఐ చీఫ్ గా నియమించలేదు. అయితే అలాంటి వివాదాస్పద వ్యక్తిని ఇప్పుడు ఢిల్లీ పోలీస్ కమిషనర్ గా నియమించడంతో మరితం కలకలం రేగింది. అరుణాచల్‌ ప్రదేశ్‌-గోవా-మిజోరం-యూనియన్‌ టెర్రిటరీ కేడర్‌ కు చెందని ఐపీఎస్‌ అధికారిని ఢిల్లీ కమిషనర్‌గా నియమించడం కూడా ఇదే తొలిసారి కావడం విశేషం.

సుప్రీం ఆదేశాలు బేఖాతరు..
సీబీఐ చీఫ్‌గా అనర్హుడైన వ్యక్తి, ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌ గా కూడా అనర్హుడేనని సీఎం కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు. డీజీ స్థాయి పోస్టులో నియామకం జరగాలంటే కనీసం ఆరు నెలల పదవీకాలం ఉండాలని.. కానీ, ఆస్తానాకు కేవలం నాలుగు రోజుల పదవీకాలం ఉండగా.. ఆయనకు అత్యంత కీలక పదవి అప్పగించడం ఏంటని మండిపడ్డారు. సుప్రీం కోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా రాకేష్ ఆస్తానాను కేంద్ర ప్రభుత్వం నియమించిందని ఆరోపించారు. అసెంబ్లీలో ఆయన నియామకానికి వ్యతిరేకంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపారు.

First Published:  30 July 2021 3:02 AM IST
Next Story