కేరళలో మూడో వేవ్ మొదలైందా..?
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నా.. ఒక్క కేరళలో మాత్రం కేసుల సంఖ్య ఎగబాకుతోంది. రోజువారీ కేసుల సంఖ్య కేరళలో ఎప్పుడూ 10వేలకు తగ్గలేదు. గడచిన 24గంటల్లో మాత్రం కేసుల సంఖ్య ఏకంగా 22వేలకు చేరడం మరింత ఆందోళన కలిగించే అంశం. దీంతో కేరళపైనే ఇప్పుడు అందరి దృష్టీ నెలకొని ఉంది. దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో సెకండ్ వేవ్ కేసులు తగ్గుతున్న వేళ.. మహారాష్ట్ర, కేరళలో మాత్రం కొన్నిరోజులపాటు కేసుల సంఖ్య భారీగా నమోదయ్యేది. […]
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నా.. ఒక్క కేరళలో మాత్రం కేసుల సంఖ్య ఎగబాకుతోంది. రోజువారీ కేసుల సంఖ్య కేరళలో ఎప్పుడూ 10వేలకు తగ్గలేదు. గడచిన 24గంటల్లో మాత్రం కేసుల సంఖ్య ఏకంగా 22వేలకు చేరడం మరింత ఆందోళన కలిగించే అంశం. దీంతో కేరళపైనే ఇప్పుడు అందరి దృష్టీ నెలకొని ఉంది.
దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో సెకండ్ వేవ్ కేసులు తగ్గుతున్న వేళ.. మహారాష్ట్ర, కేరళలో మాత్రం కొన్నిరోజులపాటు కేసుల సంఖ్య భారీగా నమోదయ్యేది. దేశం మొత్తం వెలుగు చూసే కేసుల్లో సగం ఈ రాష్ట్రాలనుంచే ఉండేవి. ఇప్పుడు మహారాష్ట్ర కూడా ఆ రేసునుంచి తప్పుకుంది. దేశంలో రోజూవారీ నమోదయ్యే కేసుల్లో సగభాగం కేరళనుంచి వస్తున్నాయి. దీంతో ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. అటు కేంద్రం కూడా కేరళపై ప్రత్యేక దృష్టిసారించింది.
10శాతానికి పైగా పాజిటివిటీ రేటు..
దేశవ్యాప్తంగా కరోనా కరాళ నృత్యం చేసిన సమయంలో కూడా కేరళలో కేసులు త్వరగానే తగ్గాయి. ఓ దశలో కేరళ ఆదర్శంగా దేశవ్యాప్తంగా కరోనా కట్టడికి కేంద్రం మార్గదర్శకాలు విడుదల చేసింది. అయితే ఇప్పుడు విచిత్రంగా కేరళ టాక్ ఆఫ్ ది నేషన్ అవుతోంది. కేరళలో పాజిటివిటీ రేటు 10శాతం పైగా ఉండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో కొవిడ్ పాజిటివిటీ రేటు 5శాతానికన్నా తక్కువగా నమోదవుతున్నప్పటికీ కేరళలో మాత్రం గడిచిన 6వారాలుగా 10 నుంచి 12శాతం రికార్డవుతోంది. రాష్ట్రంలో భారీ స్థాయిలో కొవిడ్ నిర్ధారణ పరీక్షలు జరుపుతుండడంతోనే పాజిటివ్ కేసులు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయని అభిప్రాయపడుతున్నారు అధికారులు.
వ్యాక్సినేషన్ లో టాప్.. కేసుల్లోనూ టాప్..
కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీలో కేరళ ఇతర రాష్ట్రాలకంటే ముందుంది. 18ఏళ్ల వయసున్న జనాభాలో 21శాతం మందికి రెండు డోసుల్లో వ్యాక్సిన్ అందించిన ఘనత కేరళకి దక్కింది. ఈ విషయంలో భారత దేశ సరాసరి 9.9శాతం ఉండగా కేరళలో దానికి రెట్టింపు స్థాయిని మించి వ్యాక్సినేషన్ అమలైంది. వ్యాక్సినేషన్ జోరందుకున్నా ప్రజల్లో యాంటీబాడీలపై జరిగిన సర్వేలో మాత్రం కేరళ వెనకబడి ఉండటం గమనార్హం. ఐసీఎంఆర్ దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో.. దేశంలో సగటున 67.6శాతం మందిలో యాంటీబాడీలు ఉంటే.. కేరళలో కేవలం 42.7శాతం మందిలో మాత్రమే యాంటీబాడీలున్నాయి. అందుకే అక్కడ ఎక్కువ సంఖ్యలో కేసులు బయటపడుతున్నాయని అంచనా వేస్తున్నారు.