Telugu Global
National

బీజేపీకి అన్నాడీఎంకే ఫలహారంగా మారాల్సిందేనా..?

దక్షిణాదిన పట్టు పెంచుకోవాలని చూస్తున్న బీజేపీ, ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ప్రాంతీయ పార్టీతో పొత్తుపెట్టుకుని వ్యవహారం నడిపిస్తోంది. తమిళనాట అన్నాడీఎంకే అవసరాన్ని గ్రహించి, ఆ పార్టీకి దగ్గరైంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే, బీజేపీ కూటమి విఫలం అయినా, కమలం పార్టీ కల నెరవేరింది. 4 ఎమ్మెల్యే సీట్లతో అసెంబ్లీలోకి ఎంట్రీ దొరికింది. అయితే దానికి కారణం అయిన అన్నాడీఎంకేనే ఇప్పుడు పక్కనపెట్టేస్తోంది కమలదళం. అవసరం తీరాక ఆటలో అరటిపండులా మారింది అన్నాడీఎంకే పరిస్థితి. స్థానిక ఎన్నికల్లో […]

బీజేపీకి అన్నాడీఎంకే ఫలహారంగా మారాల్సిందేనా..?
X

దక్షిణాదిన పట్టు పెంచుకోవాలని చూస్తున్న బీజేపీ, ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ప్రాంతీయ పార్టీతో పొత్తుపెట్టుకుని వ్యవహారం నడిపిస్తోంది. తమిళనాట అన్నాడీఎంకే అవసరాన్ని గ్రహించి, ఆ పార్టీకి దగ్గరైంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే, బీజేపీ కూటమి విఫలం అయినా, కమలం పార్టీ కల నెరవేరింది. 4 ఎమ్మెల్యే సీట్లతో అసెంబ్లీలోకి ఎంట్రీ దొరికింది. అయితే దానికి కారణం అయిన అన్నాడీఎంకేనే ఇప్పుడు పక్కనపెట్టేస్తోంది కమలదళం. అవసరం తీరాక ఆటలో అరటిపండులా మారింది అన్నాడీఎంకే పరిస్థితి.

స్థానిక ఎన్నికల్లో ఒంటరి పోరు..
తమిళనాడులో త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. దీనికోసం ఇప్పటినుంచే బీజేపీ సిద్ధమవుతోంది, సోలో పర్ఫామెన్స్ ఇస్తామంటూ రెడీ అవుతున్నారు నేతలు. అన్నాడీఎంకేతో పొత్తు లేకుండా అన్ని సీట్లతో బీజేపీ తన అభ్యర్థుల్ని నిలబెట్టబోతోంది. పార్టీ గుర్తుపై జరిగే ఎన్నికలు కాకపోయినా, బీజేపీ ఆశావహులందరికీ ఈ సారి సొంతగా పోటీ చేసే అవకాశాన్నిస్తోంది. స్థానిక ఎన్నికలు, అందులోనూ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఏడాది సమయంలోగా వస్తున్న ఎన్నికలు కావడంతో అధికార పార్టీకే విజయావకాశాలు ఎక్కువ. దీంతో బీజేపీ కూడా సొంతగా తన బలాన్ని చూపించడానికి ఉబలాటపడుతోంది. అన్నాడీఎంకేని కూరలో కరివేపాకులా తీసిపడేసింది.

దిక్కుతోచని స్థితిలో అమ్మ బృందం..
బీజేపీ అండ చూసుకునే ఆమధ్య చిన్నమ్మ శశికళపై ఎగిరెగిరి పడ్డారు అన్నాడీఎంకే నేతలు. రాష్ట్రంలో అధికారం దూరమైన వేళ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సపోర్ట్ ఉంటుందని అనుకున్నారు కానీ అది మూణ్ణాళ్ల ముచ్చటేనని తేలిపోయింది. మరోవైపు అధికార డీఎంకే కేసులతో భయపెడుతోంది. దీంతో అన్నాడీఎంకే నేతల్లో భయం మొదలైంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అన్నాడీఎంకే నేతలు, భవిష్యత్తులో ప్రమాదం ఉందనుకుంటున్నవారు నేరుగా కాషాయ కండువా కప్పుకోడానికి సిద్ధపడుతున్నారట. సరిగ్గా ఇలాంటి అవకాశం కోసమే ఎదురు చూస్తున్న బీజేపీ.. తమిళనాడులో అన్నాడీఎంకేని ఫలాహారంగా లాగించేయాలని చూస్తోంది. కీలక నేతలందర్నీ తమవైపు తిప్పుకుని అక్కడ బలం పెంచుకోవాలనుకుంటోంది. మొత్తమ్మీద అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఏడాదిలోపే తమిళనాడులో రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి.

First Published:  26 July 2021 1:49 AM IST
Next Story