ముఖ్యమంత్రులతో గవర్నర్ల కీచులాట..
అసెంబ్లీలో మెజార్టీ లేకపోయినా మహారాష్ట్రలో మూడు రోజుల ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ఆడిన డ్రామాలో గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ పాత్ర ఎంత ఉందో అందరికీ తెలుసు. ఆ తర్వాత కర్నాటకలో కూడా అధికార మార్పిడి సమయంలో అలాంటీ సీన్ రిపీట్ అయింది. ఇటీవల పశ్చిమ బెంగాల్ లో గవర్నర్ జగదీప్ ధన్ కర్ తో సీఎం మమతా బెనర్జీ వాగ్వాదం మరింత సంచలనంగా మారింది. ఇప్పుడు ఢిల్లీలో లెఫ్ట్ నెంట్ గవర్నర్ అనిల్ బైజల్ వ్యవహారం […]
అసెంబ్లీలో మెజార్టీ లేకపోయినా మహారాష్ట్రలో మూడు రోజుల ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ఆడిన డ్రామాలో గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ పాత్ర ఎంత ఉందో అందరికీ తెలుసు. ఆ తర్వాత కర్నాటకలో కూడా అధికార మార్పిడి సమయంలో అలాంటీ సీన్ రిపీట్ అయింది. ఇటీవల పశ్చిమ బెంగాల్ లో గవర్నర్ జగదీప్ ధన్ కర్ తో సీఎం మమతా బెనర్జీ వాగ్వాదం మరింత సంచలనంగా మారింది. ఇప్పుడు ఢిల్లీలో లెఫ్ట్ నెంట్ గవర్నర్ అనిల్ బైజల్ వ్యవహారం మరోసారి దేశవ్యాప్తంగా కలకలం రేపింది. బీజేపీయేతర పార్టీల పాలనలో ఉన్న రాష్ట్రాల్లో, బీజేపీ నియమిత గవర్నర్లు ఎలా ప్రవర్తిస్తున్నారనడానికి ఢిల్లీ లెఫ్ట్ నెంట్ గవర్నర్ అనిల్ బైజల్ తీసుకున్న నిర్ణయాలే తాజా ఉదాహరణ.
రైతులపై పెట్టిన కేసుల విషయంలో పోలీసుల తరపున వాదించేందుకు ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం సూచించిన న్యాయవాదుల బృందాన్ని పక్కనపెట్టి, గవర్నర్ తన సొంత నిర్ణయాన్ని అమలు చేయడంతో గొడవ మొదలైంది. గతంలో కూడా ఢిల్లీలో అధికారాలన్నీ లెఫ్ట్ నెంట్ గవర్నర్ చేతిలోనే ఉన్నాయని కేజ్రీవాల్ ప్రభుత్వం పలుమార్లు నిరసనకు దిగింది. తాజా ఉదంతంతో.. రాజకీయ క్రీడ మొదలైందని తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.
“ఢిల్లీ ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీకి చారిత్రక విజయాన్ని ఇచ్చారు. కేంద్రాన్ని బీజేపీ ఎలా పాలిస్తోందో, అలాగే ఢిల్లీని ఆమ్ ఆద్మీ పారర్టీ పాలించనివ్వండి, ఢిల్లీకి చెందిన ప్రతి అంశంలోనూ కేంద్రం జోక్యం చేసుకోవడం నగర ప్రజలకే అవమానం, ప్రజాస్వామ్యాన్ని బీజేపీ గౌరవించాలి” అంటూ కేజ్రీవాల్ ట్విట్టర్ లో తన అసహనాన్ని, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
వ్యవసాయ చట్టాల రద్దుకోసం ఉద్యమిస్తున్న రైతులు ఈ ఏడాది జనవరి 26న ఢిల్లీలో ర్యాలీలు నిర్వహించారు. ఆ క్రమంలో వారిలో కొందరు నిబంధనలు ఉల్లంఘించారంటూ, విధ్వంసానికి పాల్పడ్డారంటూ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కేసులకు సంబంధించి పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్లుగా వ్యవహరించేందుకు పలువురు న్యాయవాదులతో కూడిన బృందాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. కేంద్ర సర్కారుకు ఈ బృందం నివేదిక అందించాల్సి ఉంది. అయితే, కేజ్రీవాల్ కేబినెట్ నిర్ణయాన్ని లెఫ్ట్ నెంట్ గవర్నర్ అనిల్ బైజల్ తిరస్కరించారు. పోలీసులు ఎంపిక చేసిన మరో బృందానికి ఆయన ఆమోదం తెలిపారు. తన నిర్ణయాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కు నివేదించినట్లు ఢిల్లీ ప్రభుత్వానికి లేఖ రాశారు అనిల్ బైజల్. దీనిపై ఆప్ తీవ్రంగా స్పందించింది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉండగా, గవర్నర్ సొంత నిర్ణయాలేంటని డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ప్రశ్నించారు. ఢిల్లీ ప్రభుత్వ నిర్ణయాలను అడ్డుకున్నారంటే, ఢిల్లీ ప్రజలను గవర్నర్ అవమానించినట్టేనని అన్నారు సీఎం కేజ్రీవాల్. గవర్నర్ అత్యుత్సాహానికి అడ్డుకట్ట వేయాలని ఆయన కేంద్రానికి సూచించారు.