Telugu Global
National

ఆన్ లైన్ బోధన.. భారత విద్యార్థుల వేదన..

కరోనా కష్టకాలంలో ప్రపంచవ్యాప్తంగా విద్యాబోధన ఆన్ లైన్ వైపు అడుగులు వేసింది. లాక్ డౌన్ టైమ్ లో బయట కాలుపెట్టేందుకే వీలు లేని ఆంక్షల నేపథ్యంలో స్కూళ్లు, కాలేజీలు, యూనివర్శిటీలు అన్నీ మూతబడ్డాయి. విధిలేని పరిస్థితుల్లో విద్యార్థులకు ఆన్ లైన్ బోధన మొదలైంది. వారం రోజులు, నెలరోజులు.. అన్నట్టుగా సాగిన బోధన చివరకు విద్యా సంవత్సరం మొత్తం ఆన్ లైన్ లోనే పూర్తి చేయాల్సి వచ్చింది. ఆఖరికి కొన్ని యూనివర్శిటీలు ఆన్ లైన్ లోనే పరీక్షలు నిర్వహించి […]

ఆన్ లైన్ బోధన.. భారత విద్యార్థుల వేదన..
X

కరోనా కష్టకాలంలో ప్రపంచవ్యాప్తంగా విద్యాబోధన ఆన్ లైన్ వైపు అడుగులు వేసింది. లాక్ డౌన్ టైమ్ లో బయట కాలుపెట్టేందుకే వీలు లేని ఆంక్షల నేపథ్యంలో స్కూళ్లు, కాలేజీలు, యూనివర్శిటీలు అన్నీ మూతబడ్డాయి. విధిలేని పరిస్థితుల్లో విద్యార్థులకు ఆన్ లైన్ బోధన మొదలైంది. వారం రోజులు, నెలరోజులు.. అన్నట్టుగా సాగిన బోధన చివరకు విద్యా సంవత్సరం మొత్తం ఆన్ లైన్ లోనే పూర్తి చేయాల్సి వచ్చింది. ఆఖరికి కొన్ని యూనివర్శిటీలు ఆన్ లైన్ లోనే పరీక్షలు నిర్వహించి విద్యార్థుల్ని పాస్ చేయించేశాయి.

తూతూమంత్రంగా ఆన్ లైన్ బోధన..
ఇతర దేశాలతో పోల్చి చూస్తే భారత్ లో విద్యావ్యవస్థ పూర్తి స్థాయిలో డిజిటలైజ్ కాలేదు. ఆన్ లైన్ పాఠాలు అనే వ్యవహారం పల్లెటూళ్లకు అసలు పరిచయం లేదు. కరోనా కాలంలో సెల్ ఫోన్ సిగ్నళ్లు లేక చెట్లెక్కి కొంతమంది, కొండలెక్కి కొంతమంది పాఠాలు వినడం మనం చూస్తూనే ఉన్నాం. భారత్ లో సరైన సదుపాయాలు లేవు, ఆన్ లైన్ విద్యపై అవగాహన లేదు. ఈ దశలో అసలు ఆన్ లైన్ విద్యాబోధన భారత విద్యార్థులకు ఎంతవరకు మేలు చేసిందనే విషయంపై ‘టీమ్ లీజ్ ఎడ్ టెక్’ అనే సంస్థ సర్వే చేపట్టింది. 700మంది విద్యార్థులు 75 మంది వివిధ యూనివర్శిటీల అధ్యాపకులపై చేపట్టిన ఈ సర్వే విస్తుపోయే నిజాలను వెలుగులోకి తెచ్చింది. భారత్ లో లెర్నింగ్ లాస్ 40నుంచి 60శాతం మేర ఉన్నట్టు ఈ సర్వే తేల్చింది. అంటే ఆన్ లైన్ బోధన వల్ల విద్యార్థులు తాము నేర్చుకునే విషయాల్లో 60శాతానికి పైగా అవగాహన చేసుకోలేక పోతున్నారు.

85శాతంమంది విద్యార్థుల అసంతృప్తి..
ఆన్ లైన్ బోధనపై 85శాతం మంది భారత విద్యార్థులు అసంతృప్తిగా ఉన్నారు. తాము వింటున్నదానిలో 40నుంచి 60శాతం మాత్రమే నేర్చుకోగలుగుతున్నామని, దాదాపు సగానికి సగం పాఠాలు అర్థం కావడంలేదని చెబుతున్నారు. సరైన వసతులు లేక చాలామంది విద్యార్థులు అసలు ఆన్ లైన్ పాఠాలకి దూరం అవుతున్నారు. ఇలాంటి వారంతా చదువులో వెనకబడిపోతున్నారు.

అధ్యాపకుల విశ్లేషణ ఇదీ..
ఆన్ లైన్ క్లాసులకు స్పందన బాగానే ఉంటున్నా, ఆన్ లైన్ పరీక్షల్లో అందరికీ మార్కులు బాగానే వస్తున్నా.. విద్యార్థుల్లో విషయ పరిజ్ఞానం పెరగడంలేదని చెబుతున్నారు అధ్యాపకులు. ఆన్ లైన్ క్లాసులు జరిగే సమయంలో వారిని ప్రశ్నలడిగినా సరైన సమాధానాలు చెప్పలేకపోతున్నారని, తరగతి గది బోధనలాగా విద్యార్థులు ఆన్ లైన్ క్లాసుల్లో చురుగ్గా ఉండటం లేదని చెబుతున్నారు. స్వతహాగా చదువుపై శ్రద్ధ పెట్టే కొంతమంది మాత్రమే ఆన్ లైన్ పాఠాల వల్ల కూడా లాభపడుతున్నారని చెబుతున్నారు.

భారత్ పరిస్థితి ఏంటి..?
ప్రపంచ వ్యాప్తంగా కరోనా, లాడ్ కౌన్ ప్రభావం 22కోట్లమంది విద్యార్థులపై పడిందని, వారి చదువులు అటకెక్కాయనేది ప్రపంచ బ్యాంకు సర్వే ద్వారా తెలుస్తోంది. అయితే ఇతర దేశాలతో పోల్చి చూస్తే భారత్ లో సుదీర్ఘ లాక్ డౌన్, ఆన్ లైన్ బోధనకు సరైన అవకాశాలు లేకపోవడంతో.. ఎక్కువగా ఇక్కడి విద్యార్థులే నష్టపోతున్నట్టు స్పష్టమవుతోంది. అందులోనూ భారత్ లో విద్యార్థినులు ఆన్ లైన్ బోధన వైపు మొగ్గుచూపడంలేదు. భారత విద్యా వ్యవస్థలో ఆడపిల్లలు ఎదుర్కొంటున్న వివక్ష, ఆన్ లైన్ బోధనలోనూ కనిపిస్తోంది.

ఆన్ లైన్ బోధన అత్యంత పగడ్బందీగా జరుగుతున్న దేశాల్లో ఫ్రాన్స్ ముందుంది. లాక్ డౌన్ టైమ్ లో కూడా అక్కడి కాలేజీలు కేవలం 3 నెలలు మాత్రమే మూతబడ్డాయి. మిగతా రోజుల్లో తరగతి బోధన జరిగింది. అందుకే అక్కడ లెర్నింగ్ లాస్ కేవలం 9.84శాతంగా ఉంది. అమెరికాలో లెర్నింగ్ లాస్ 13.8శాతంగా, జర్మనీలో 25శాతంగా ఉంది. అదే భారత్ విషయానికొస్తే 40నుంచి 60శాతంగా ఉంది. అంటే.. కరోనా వల్ల భారత విద్యావ్యవస్థ దారుణంగా నష్టపోయిందని అర్థమవుతోంది. ఈ గ్యాప్ పూడ్చుకోడానికి, విద్యా వ్యవస్థ మళ్లీ గాడిలో పడటానికి, విద్యార్థుల సంగ్రహణ శక్తి పెరిగి సాధారణ స్థాయికి రావడానికి కనీసం మూడేళ్ల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు నిపుణులు.

First Published:  24 July 2021 3:12 AM IST
Next Story