Telugu Global
National

పంజాబ్ లో సిద్ధూ బలప్రదర్శన..

పంజాబ్ లో సీఎం అమరీందర్ పెత్తనం ఎన్నోరోజులు కొనసాగేలా లేదు. పీసీసీ చీఫ్ గా అధిష్టానం ఆశీస్సులు అందుకున్న మాజీ మంత్రి సిద్ధూ పార్టీపై పట్టు సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఆల్రడీ అమరీందర్ టీమ్ ని తనవైపు తిప్పుకున్నారు. సీఎం అమరీందర్ ని కాదని ఏకంగా 62మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సిద్ధూకి మద్దతుగా ఆయనతో సమావేశమయ్యారు. 117 సీట్ల పంజాబ్ అసెంబ్లీలో కాంగ్రెస్ కి 80మంది ఎమ్మెల్యేల బలం ఉంది. అందులో 62మంది సిద్ధూవైపు వచ్చారంటే […]

పంజాబ్ లో సిద్ధూ బలప్రదర్శన..
X

పంజాబ్ లో సీఎం అమరీందర్ పెత్తనం ఎన్నోరోజులు కొనసాగేలా లేదు. పీసీసీ చీఫ్ గా అధిష్టానం ఆశీస్సులు అందుకున్న మాజీ మంత్రి సిద్ధూ పార్టీపై పట్టు సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఆల్రడీ అమరీందర్ టీమ్ ని తనవైపు తిప్పుకున్నారు. సీఎం అమరీందర్ ని కాదని ఏకంగా 62మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సిద్ధూకి మద్దతుగా ఆయనతో సమావేశమయ్యారు. 117 సీట్ల పంజాబ్ అసెంబ్లీలో కాంగ్రెస్ కి 80మంది ఎమ్మెల్యేల బలం ఉంది. అందులో 62మంది సిద్ధూవైపు వచ్చారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అమరీందర్ ప్రాభవం తగ్గిపోతున్న వేళ, సిద్ధూని పీసీసీ చీఫ్ గా నియమించింది అధిష్టానం. అయితే ఆ తర్వాత మర్యాదపూర్వకంగా అయినా పీసీసీ చీఫ్ తో సీఎం సమావేశం కాలేదు. ఇద్దరి మధ్య విభేదాలు మరింత ముదిరే వేళ.. సిద్ధూ తన సత్తా చూపించారు. 62మంది ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు.

అమృత్‌ సర్‌ లోని తన నివాసంలో ఎమ్మెల్యేలకు అల్పాహార విందు ఇచ్చిన సిద్ధూ, వారితో సమావేశం అనంతరం బస్సులో గోల్డెన్ టెంపుల్‌ తోపాటు ఇతర ఆధ్యాత్మిక ప్రాంతాలను సందర్శనకు వెళ్లారు. సిద్ధూకు తాము అండగా ఉంటామని.. వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఎమ్మెల్యేలు. ఈ సమావేశంతో తన బలమెంతో చూపించారు సిద్ధూ.

కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలతో బీజేపీ లాభపడాలని చూస్తోంది. మరోవైపు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ కూడా పంజాబ్ లో ఢిల్లీ తరహా పాలన చూపిస్తామంటూ హామీలు గుప్పిస్తోంది. ఈ క్రమంలో రైతు ఉద్యమం పంజాబ్ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. దీంతో అమరీందర్ ని కాదని సిద్ధూకి పార్టీ బాధ్యతలు అప్పగించింది కాంగ్రెస్. సీఎం అభ్యర్థిగా కూడా ఆయన్నే ప్రకటించి రాబోయే ఎన్నికలను ఎదుర్కోవాలనేది ఆ పార్టీ ప్లాన్. అమరీందర్ అంత త్వరగా బెట్టువీడేలా లేరు. అయితే పంజాబ్ లో వేగంగా మారుతున్న పరిణామాలు, సిద్ధూ శిబిరంవైపుకి ఎమ్మెల్యేలు రావడంతో అమరీందర్ శకం ముగిసిందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

First Published:  21 July 2021 11:14 PM GMT
Next Story