ఆస్పత్రులా..? రియల్ ఎస్టేట్ సంస్థలా..? సుప్రీం తీవ్ర వ్యాఖ్యలు..
ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన ఆస్పత్రులు, సరైన సౌకర్యాలు లేక, వారి ప్రాణాలు పోయేందుకు కారణం అవుతున్నాయంటూ సుప్రీంకోర్టు మండిపడింది. దేశవ్యాప్తంగా ఆస్పత్రుల్లో జరుగుతున్న అగ్నిప్రమాదాల విషయంలో సుమోటోగా కేసు విచారణ చేపట్టిన సుప్రీం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. 2, 3 గదుల్లో, అపార్ట్ మెంట్లలో, ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకుండా నడిపే ఆస్పత్రులను వెంటనే మూసివేయాలని ఆదేశాలిచ్చింది. కరోనా సంక్షోభ సమయంలో మానవత్వంతో సేవ చేయాల్సింది పోయి, రియల్ ఎస్టేట్ వ్యాపార వ్యాపార సంస్థల్లా, డబ్బు […]
ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన ఆస్పత్రులు, సరైన సౌకర్యాలు లేక, వారి ప్రాణాలు పోయేందుకు కారణం అవుతున్నాయంటూ సుప్రీంకోర్టు మండిపడింది. దేశవ్యాప్తంగా ఆస్పత్రుల్లో జరుగుతున్న అగ్నిప్రమాదాల విషయంలో సుమోటోగా కేసు విచారణ చేపట్టిన సుప్రీం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. 2, 3 గదుల్లో, అపార్ట్ మెంట్లలో, ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకుండా నడిపే ఆస్పత్రులను వెంటనే మూసివేయాలని ఆదేశాలిచ్చింది.
కరోనా సంక్షోభ సమయంలో మానవత్వంతో సేవ చేయాల్సింది పోయి, రియల్ ఎస్టేట్ వ్యాపార వ్యాపార సంస్థల్లా, డబ్బు సంపాదన యంత్రాల్లా ఆస్పత్రులు మారిపోయాయని సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. మహారాష్ట్రలోని నాసిక్ లో గత ఏడాది ఓ కొవిడ్ ఆసుపత్రిలో మంటలు చెలరేగి వైద్య సిబ్బంది, రోగులు మరణించారు. దీంతో దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఇలాంటి ఘటనలపై సుప్రీంకోర్టు సుమోటోగా కేసు విచారణ చేపట్టింది. ఇకపై ఆస్పత్రుల్లో అగ్నిప్రమాదాలు జరిగి ప్రాణాలు పోవడానికి వీల్లేదంటూ రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించింది. అన్ని ఆస్పత్రుల్లో అగ్నిమాపక, భద్రతా చర్యలను తనిఖీ చేయాలంటూ గత డిసెంబర్ 18న ఆదేశాలిచ్చింది. ఈ క్రమంలో అన్ని రాష్ట్రాలు ఆ దిశగా చర్యలు మొదలు పెట్టాయి. అయితే గుజరాత్ ప్రభుత్వం మాత్రం నిబంధనలు సరిదిద్దుకునేందుకు ఆస్పత్రులకు ఈ ఏడాది జులై వరకు గడువు పొడిగించింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇటీవల విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ పై సుప్రీం మండిపడింది. గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ఇష్టారీతిన ఇచ్చిన నోటిఫికేషన్… గత డిసెంబరు 18 నాటి తమ ఉత్తర్వులకు విరుద్ధమని తేల్చిచెప్పింది. దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని; అసలు నోటిఫికేషన్ ఎందుకివ్వాల్సి వచ్చిందో వారం రోజుల్లో తమకు వివరణ ఇవ్వాలని గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
మరోవైపు ఆసుపత్రుల్లో అగ్ని ప్రమాదాలపై ఏర్పాటైన కమిషన్ సీల్డు కవర్ లో నివేదిక ఇవ్వడం పట్ల ధర్మాసనం అభ్యంతరం తెలిపింది. ఇదేమీ అణు రహస్యం కాదని, కేవలం నివేదిక మాత్రమేనని వ్యాఖ్యానించింది. నిబంధనలకు విరుద్ధంగా ఇళ్ల మధ్య, రెండు మూడు గదుల్లో నడిచే నర్సింగ్ హోమ్ లను వెంటనే మూసేయాలని ఆదేశించింది. వైద్య సేవలకు అవసరమైన మౌలిక సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వాలే కల్పించాలని చెప్పింది. సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారా అధిగమించలేరని, పరిస్థితుల్లో మార్పు రాకపోతే ఆసుపత్రుల్లో జరిగే అగ్ని ప్రమాదాలకు రోగులు ఆహుతి అవుతూనే ఉంటారని పేర్కొంది ధర్మాసనం.