Telugu Global
National

కరోనా మాయలో పడి సాధారణ వ్యాక్సిన్లు మరిచారు..

వ్యాక్సిన్ అనే పేరు వినగానే.. ఇప్పుడు వెంటనే అందరికీ గుర్తొచ్చేది కరోనా వ్యాక్సినే. కొవాక్సినా, కొవిషీల్డా.. ఎప్పుడు వేయించుకున్నారు, ఎన్నో డోసు..? అనే ప్రశ్నలే వస్తున్నాయి. కానీ కరోనా మాయలో పడి సాధారణ వ్యాక్సిన్ల పంపిణీని ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రెండున్నర కోట్లమంది చిన్నారులు వ్యాధినిరోధక టీకాలకు దూరమయ్యారు. ఇందులో భారత్ పాపమే ఎక్కువ. యునిసెఫ్ అధ్యయనం ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా భారత్ లోనే టీకాలు అందని చిన్నారుల సంఖ్య ఎక్కువగా ఉంది. […]

కరోనా మాయలో పడి సాధారణ వ్యాక్సిన్లు మరిచారు..
X

వ్యాక్సిన్ అనే పేరు వినగానే.. ఇప్పుడు వెంటనే అందరికీ గుర్తొచ్చేది కరోనా వ్యాక్సినే. కొవాక్సినా, కొవిషీల్డా.. ఎప్పుడు వేయించుకున్నారు, ఎన్నో డోసు..? అనే ప్రశ్నలే వస్తున్నాయి. కానీ కరోనా మాయలో పడి సాధారణ వ్యాక్సిన్ల పంపిణీని ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రెండున్నర కోట్లమంది చిన్నారులు వ్యాధినిరోధక టీకాలకు దూరమయ్యారు. ఇందులో భారత్ పాపమే ఎక్కువ. యునిసెఫ్ అధ్యయనం ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా భారత్ లోనే టీకాలు అందని చిన్నారుల సంఖ్య ఎక్కువగా ఉంది. 2020 ఏడాదికిగాను డిఫ్తీరియా-టెటనస్-పెర్ట్యుసిస్ (డీపీటీ) టీకాలు తీసుకోని చిన్నారుల సంఖ్య భారత్ లో 30,38,000 గా ఉంది.

చిన్నారులకు పుట్టినప్పటినుంచి ఐదేళ్లలోపు వివిధ రకాల వ్యాక్సిన్లు ఇస్తారు. పోలియో టీకా వేయించుకున్నా కూడా, పోలియో డ్రాప్స్ కూడా పిల్లలకు వేయిస్తుంటారు. పోలియో టీకా కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ గా చేపడుతుంటారు. ఈ క్రమంలో మూడు డోసులుగా డీపీటీ అనే టీకాను పిల్లలకు వేయిస్తుంటారు. భారత్ లో కరోనా ప్రభావం, లాక్ డౌన్, ఆస్పత్రుల్లో ఇతర వ్యాధుల చికిత్సలను పక్కనపెట్టడం, చిన్నారుల విషయంలో తల్లిదండ్రులు భయపడి ఆస్పత్రులకు తీసుకెళ్లకపోవడం వంటి కారణాలతో డీపీటీ టీకా వినియోగం తగ్గింది. 2019లో భారత్ లో టీకా వేయించుకోని చిన్నారుల సంఖ్య 14లక్షలు కాగా, 2020లో ఆ సంఖ్య 30లక్షలకు పెరగడం గమనార్హం. ప్రభుత్వం కూడా దీనిపై దృష్టి తగ్గించింది. కరోనా నివారణ చర్యలపై ఫోకస్ పెట్టడంతో చిన్నారుల వ్యాక్సినేషన్ కార్యక్రమాలను అధికారులు పక్కనపెట్టారు. యునిసెఫ్ రిపోర్ట్ తో ఇప్పుడు హడావిడి పడుతున్నారు.

భారత్ లో టీకా తీసుకోనివారిలో మారుమూల ప్రాంతాలు, మురికి వాడల్లో నివసించేవారి పిల్లలే పెద్దసంఖ్యలో ఉన్నట్లు యునిసెఫ్ ఆందోళన వ్యక్తం చేసింది. ఆయా ప్రాంతాల్లో నివసించే వారికి ప్రాథమిక ఆరోగ్య సేవలు కూడా అందటం లేదని తెలిపింది. అయితే యునిసెఫ్ నివేదికను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. ఈమేరకు కేంద్ర ఆరోగ్య శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. భారత్ లో కరోనా వ్యాక్సినేషన్ తోపాటు, చిన్నారుల లైఫ్ సేవింగ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా సజావుగా సాగుతోందని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వాలు వీటిపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సూచించింది.

First Published:  17 July 2021 9:49 PM GMT
Next Story