Telugu Global
National

అక్కడ రాహుల్.. ఇక్కడ రేవంత్.. అసంతృప్తులకు బిగ్ షాక్

అసలే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంతంతమాత్రంగా ఉంది. అందులోనూ పోయేవారే కానీ, వచ్చేవారు అసలు లేరు. అందుకే మిగులు జనాలని బయటకిపోకుండా ఉంచేందుకు కాంగ్రెస్ చాన్నాళ్లనుంచి బుజ్జగింపుల్నే ప్రధానంగా నమ్ముకుంది. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి కాంగ్రెస్ రాజకీయాలు మారిపోయాయి. ఉంటే ఉండండి, పోతే పొండి అంటూ కరాఖండిగా చెప్పేశారు రాహుల్ గాంధీ. ఆ పోయేది కూడా ఆర్ఎస్ఎస్ లోకే పోండి అంటూ అడ్రస్ కూడా రాసిచ్చేశారు. భయపడేవారు ఆరెస్సెస్ లో చేరండి.. కాంగ్రెస్‌ పార్టీకి భయంలేని నాయకులు […]

అక్కడ రాహుల్.. ఇక్కడ రేవంత్.. అసంతృప్తులకు బిగ్ షాక్
X

అసలే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంతంతమాత్రంగా ఉంది. అందులోనూ పోయేవారే కానీ, వచ్చేవారు అసలు లేరు. అందుకే మిగులు జనాలని బయటకిపోకుండా ఉంచేందుకు కాంగ్రెస్ చాన్నాళ్లనుంచి బుజ్జగింపుల్నే ప్రధానంగా నమ్ముకుంది. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి కాంగ్రెస్ రాజకీయాలు మారిపోయాయి. ఉంటే ఉండండి, పోతే పొండి అంటూ కరాఖండిగా చెప్పేశారు రాహుల్ గాంధీ. ఆ పోయేది కూడా ఆర్ఎస్ఎస్ లోకే పోండి అంటూ అడ్రస్ కూడా రాసిచ్చేశారు.

భయపడేవారు ఆరెస్సెస్ లో చేరండి..
కాంగ్రెస్‌ పార్టీకి భయంలేని నాయకులు మాత్రమే కావాలని, పిరికివారికి పార్టీలో స్థానంలేదని తాజాగా ఓ భారీ స్టేట్ మెంట్ ఇచ్చారు రాహుల్ గాంధీ. భయపడేవారంతా పార్టీని వీడి ఆరెస్సెస్‌ లో చేరాలని సలహా ఇచ్చారు. “నిర్భయంగా మాట్లాడే ప్రజలు పార్టీ బయట ఉన్నారు. వారిని కాంగ్రెస్‌ లో చేర్చుకుంటాం. పార్టీలో కొందరు భయస్థులున్నారు. వారిని బయటకు విసిరేస్తాం, పిరికివారు మాకొద్దు, వారంతా ఆరెస్సెస్‌ వైపు పరుగులు తీయండి. మీరు మాకొద్దు.” అంటూ కఠినంగా మాట్లాడారు. పార్టీ సోషల్ మీడియా విభాగంతో సమావేశమైన రాహుల్ గాంధీ, ఇలా కొత్తగా మాట్లాడే సరికి అందరూ షాకయ్యారు.

అక్కడ రాహుల్.. ఇక్కడ రేవంత్..
ఇటీవలే తెలంగాణ కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి కూడా దాదాపుగా ఇలాంటి వ్యాఖ్యలే చేసి కలకలం రేపారు. కాంగ్రెస్ లో కొంతమంది ఇంటిదొంగలున్నారని, అలాంటి వారంతా పార్టీని వదిలిపెట్టి వెళ్లాలని, నెలాఖరు వరకు డెడ్ లైన్ విధించామని, లేకపోతే తామే తరిమేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ కష్టపడే కార్యకర్తలను కడుపులో దాచుకుంటుందని తేల్చి చెప్పారు. వాస్తవానికి హుజూరాబాద్ లో కౌశిక్ రెడ్డిలాంటి వ్యవహారంలో కాంగ్రెస్ కాస్త వెనకా ముందు ఆలోచించేది. కానీ పీసీసీ చీఫ్ స్థానంలో ఉన్న రేవంత్.. కౌశిక్ కాల్ రికార్డింగ్ బయటకు వచ్చిన వెంటనే ఆయన వివరణ కోరారు, గంటల వ్యవధిలో వేటు వేశారు. తెలంగాణ కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి మార్కు మొదలైందని సిగ్నల్ ఇచ్చారు.

ఏంటీ దూకుడు.. ఎందుకీ మార్పు..
కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. పక్క పార్టీ వారిని విమర్శించినా, లేకపోయినా.. సొంత పార్టీ నేతలపై మాత్రం బహిరంగంగానే కారాలు మిరియాలు నూరుతుంటారు నేతలు. అలాంటి వారిపై అసంతృప్తులనే ముద్రవేస్తుంది కానీ, అధిష్టానం వారిని బయటకు పంపిన ఉదాహరణలు తక్కువ. అయితే ఇప్పుడీ ట్రెండ్ మారిందని చెబుతున్నారు అధినాయకులు. కాంగ్రెస్ లో గ్రూపు కట్టిన 23మంది అసంతృప్త నేతల్ని టార్గెట్ చేసుకుని రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారా, లేక అధిష్టానంతో బేరాలు పెడుతున్న సచిన్ పైలట్ లాంటి వారికి చురకలంటించారా అనేది వారి ఊహకే వదిలేశారు. మొత్తమ్మీద రాహుల్ లో వచ్చిన ఈ మార్పుకి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో జరిగిన భేటీయే కారణం అనే వాదన కూడా వినిపిస్తోంది. కారణం ఏదయినా, కాంగ్రెస్ లో అసంతృప్తులకు ఇన్నాళ్లకు గట్టి షాక్ తగలబోతోంది.

First Published:  17 July 2021 2:00 AM IST
Next Story