Telugu Global
National

కట్నం అడిగితే డిగ్రీ సర్టిఫికెట్ చెల్లదు.. ఎక్కడో తెలుసా..?

వరకట్న నిషేధంపై ఎన్ని చట్టాలొచ్చినా, ఎంతమంది నీతులు చెప్పినా.. జరిగేది జరగక మానడంలేదు. వరకట్న వేధింపులు తగ్గలేదు, కట్న పిశాచానికి బలయ్యే మహిళల సంఖ్య కూడా తగ్గలేదు. ఉన్నత కుటుంబాలు, ఉన్నత ఉద్యోగాలు చేసేవారు కూడా కట్నానికి కక్కుర్తిపడి ఆడపిల్లల్ని, వారి తల్లిదండ్రుల్ని వేధిస్తున్న ఉదాహరణలు కోకొల్లలు. అలాంటివాటిని అరికట్టేందుకు కేరళ ప్రభుత్వం ముందడుగు వేసింది. కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహ్మద్ ఖాన్ ఈమేరకు ఓ ప్రతిపాదన తీసుకొచ్చారు. ప్రభుత్వానికి, యూనివర్శిటీలకు ఆయన దీనికి సంబంధించిన సిఫార్సులు […]

కట్నం అడిగితే డిగ్రీ సర్టిఫికెట్ చెల్లదు.. ఎక్కడో తెలుసా..?
X

వరకట్న నిషేధంపై ఎన్ని చట్టాలొచ్చినా, ఎంతమంది నీతులు చెప్పినా.. జరిగేది జరగక మానడంలేదు. వరకట్న వేధింపులు తగ్గలేదు, కట్న పిశాచానికి బలయ్యే మహిళల సంఖ్య కూడా తగ్గలేదు. ఉన్నత కుటుంబాలు, ఉన్నత ఉద్యోగాలు చేసేవారు కూడా కట్నానికి కక్కుర్తిపడి ఆడపిల్లల్ని, వారి తల్లిదండ్రుల్ని వేధిస్తున్న ఉదాహరణలు కోకొల్లలు. అలాంటివాటిని అరికట్టేందుకు కేరళ ప్రభుత్వం ముందడుగు వేసింది. కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహ్మద్ ఖాన్ ఈమేరకు ఓ ప్రతిపాదన తీసుకొచ్చారు. ప్రభుత్వానికి, యూనివర్శిటీలకు ఆయన దీనికి సంబంధించిన సిఫార్సులు చేశారు.

విశ్వవిద్యాలయాల కులపతి హోదాలో గవర్నర్, వైస్ ఛాన్స్‌ల‌ర్లకు ఈ ఆదేశాలిచ్చారు. ఇకపై యూనివర్శిటీల్లో డిగ్రీ సర్టిఫికెట్లు ఇచ్చేటప్పుడు ప్రతి విద్యార్థి వద్ద ఓ బాండ్ పేపర్ పై సంతకం తీసుకోవాలి. “వరకట్నం నేను అడగను అలా అడిగినా, వరకట్న వేధింపులకు పాల్పడినా నా డిగ్రీ సర్టిఫికెట్ రద్దు చేయడానికి నేను సమ్మతిస్తున్నాను” అని ఆ బాండ్ పేపర్ పై డిగ్రీ పాసైన విద్యార్థులు సంతకం పెట్టి యూనివర్శిటీకి ఇవ్వాల్సి ఉంటుంది. అలా చేస్తేనే డిగ్రీ సర్టిఫికెట్ చేతిలో పెడతారు.

భవిష్యత్తులో సదరు విద్యార్థులు వరకట్న వేధింపులకు పాల్పడినా, కట్నం అడిగిన కేసుల్లో వారిపై ఫిర్యాదులొచ్చినా, వారు అరెస్ట్ అయినా.. ఆటోమేటిక్ గా వారి డిగ్రీ సర్టిఫికెట్ క్యాన్సిల్ అవుతుంది. గవర్నర్ ఆలోచనల మేరకు త్వరలో కేరళ ప్రభుత్వం దీనికి సంబంధించిన ప్రతిపాదనలు రూపొందిస్తోంది. డిగ్రీ సర్టిఫికెట్ క్యాన్సిల్ అయితే, ఉపాధి పోయినట్టే. కనీసం దీనికి భయపడి అయినా వరకట్న వేధింపులు తగ్గుతాయనేది గవర్నర్ ఆలోచన. ఈ ఆలోచన అమలులోకి వస్తే ఫలితం ఎలా ఉంటుందో తెలుస్తుంది. మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుంది.

First Published:  17 July 2021 11:19 AM IST
Next Story