వీర విధేయుడికే కాంగ్రెస్ వీరతాడు
కాంగ్రెస్ పార్టీకి కొత్త రక్తం ఎక్కిస్తారనుకుంటే అది పొరపాటే అవుతుంది. గాంధీ కుటుంబ పెత్తనాన్ని కాపాడుతూ ఇప్పుడు కొత్తగా విధేయతా రక్తం ఎక్కించబోతున్నారు. ఏఐసీసీ ప్రెసిడెంట్ గా కమల్ నాథ్ పేరు తెరపైకి తెస్తున్నారు. ఢిల్లీలో సోనియాగాంధీతో కమల్ నాథ్ అత్యవసర భేటీ తర్వాత ఈమేరకు ఊహాగానాలు వెలువడ్డాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల అనంతరం పార్టీ అధ్యక్ష పదవిపై సోనియా తన నిర్ణయాన్ని ప్రకటిస్తారని, అందుకే కమల్ నాథ్ తో ఆమె సమవేశమయ్యారని తెలుస్తోంది. ఏఐసీసీ అధ్యక్ష […]
కాంగ్రెస్ పార్టీకి కొత్త రక్తం ఎక్కిస్తారనుకుంటే అది పొరపాటే అవుతుంది. గాంధీ కుటుంబ పెత్తనాన్ని కాపాడుతూ ఇప్పుడు కొత్తగా విధేయతా రక్తం ఎక్కించబోతున్నారు. ఏఐసీసీ ప్రెసిడెంట్ గా కమల్ నాథ్ పేరు తెరపైకి తెస్తున్నారు. ఢిల్లీలో సోనియాగాంధీతో కమల్ నాథ్ అత్యవసర భేటీ తర్వాత ఈమేరకు ఊహాగానాలు వెలువడ్డాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల అనంతరం పార్టీ అధ్యక్ష పదవిపై సోనియా తన నిర్ణయాన్ని ప్రకటిస్తారని, అందుకే కమల్ నాథ్ తో ఆమె సమవేశమయ్యారని తెలుస్తోంది. ఏఐసీసీ అధ్యక్ష పదవి లేదా, వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఈ రెండిట్లో ఒకటి కమల్ నాథ్ కి ఇస్తారని అంటున్నారు.
అధ్యక్షుడు లేకుండా ఎన్నాళ్లు..?
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలనుంచి తప్పుకున్న రాహుల్ గాంధీ తిరిగి ఆ బాధ్యతలు చేపట్టడానికి వెనకాడుతున్నారు. పదే పదే అధ్యక్ష ఎన్నికకోసం ముహూర్తం పెట్టడం, రాహుల్ ని బుజ్జగించడం, ఆయన కాదనడం, తాత్కాలిక అధ్యక్ష పదవిలో సోనియా కొనసాగడం.. ఇలా జరుగుతున్నాయి పరిణామాలు. ఆమధ్య పార్టీ ప్రక్షాళనకోసం 23మంది సీనియర్ నేతలు రాసిన లేఖ సంచలనంగా మారడంతో అధ్యక్ష పదవి అంశం పూర్తిగా మరుగునపడిపోయింది. సార్వత్రిక ఎన్నికలకు మూడేళ్ల టైమ్ ఉంది, ఏడాదికోసారి వివిధ రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికల కోలాహలం ఉండనే ఉంది. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు లేని పార్టీగా కాంగ్రెస్ పై ముద్రవేసి వైరివర్గాలు సెటైర్లు పేలుస్తున్నాయి. దీంతో సోనియా గాంధీ కూడా ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్నారని తెలుస్తోంది.
కమల్ నాథ్ విధేయతకు పట్టం..
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా వివిధ శాఖలను సమర్థంగా నిర్వహించిన అనుభవం కమల్ నాథ్ కి ఉంది. అర్హతలకు మించి గాంధీ కుటుంబం పట్ల ఉన్న విధేయత ఆయనకు పెద్ద ప్లస్ పాయింట్. సంజయ్ గాంధీ స్కూల్ మేట్ అయిన కమల్ నాథ్, తన రాజకీయ ప్రస్థానాన్ని కాంగ్రెస్ తోనే ప్రారంభించారు, వివిధ పదవులను అందుకున్నారు. రాహుల్ గాంధీ బాధ్యతల స్వీకరణకు వెనకాడుతున్న వేళ, విధేయతకు పట్టం కట్టేందుకే 74ఏళ్ల కమల్ నాథ్ వైపు సోనియా మొగ్గు చూపారని అంటున్నారు. అసమ్మతి వర్గంలోని 23మంది నేతలతో కూడా కమల్ కి సత్సంబంధాలే ఉండటం ఆయనకు మరో అదనపు అర్హత.
ప్రశాంత్ కిషోర్ భేటీతో వచ్చిన మార్పేనా..?
ఈమధ్య కాలంలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. కాంగ్రెస్ తో కలసి పనిచేయడానికి ఆయన సిద్ధపడ్డారని వార్తలొచ్చాయి. రాహుల్, ప్రశాంత్ భేటీ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికోసం కీలక నిర్ణయం తీసుకోవడం విశేషమే.