Telugu Global
National

బీజేపీ గురివింద నీతి.. జనాభా నియంత్రణ బిల్లుతో అభాసుపాలు..

ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలున్నవారు స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు, ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులంటూ.. యూపీ ప్రభుత్వం కొత్తగా జనాభా నియంత్రణ బిల్లుని ప్రవేశపెట్టబోతోంది. ముస్లింలను టార్గెట్ చేస్తూ ఈ చట్టాన్ని తెరపైకి తెస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నా.. ఇప్పుడు సొంత పార్టీలోనే దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. జనాభా బిల్లు అమలులోకి వస్తే.. బీజేపీ నేతలే ఇరుకునపడతారని ప్రతిపక్షాలు కూడా సెటైర్లు పేలుస్తున్నాయి. పార్లమెంట్ లో, యూపీ అసెంబ్లీలో ఎంతమంది నేతలకు, ఎంతమంది పిల్లలు ఉన్నారనే […]

బీజేపీ గురివింద నీతి.. జనాభా నియంత్రణ బిల్లుతో అభాసుపాలు..
X

ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలున్నవారు స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు, ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులంటూ.. యూపీ ప్రభుత్వం కొత్తగా జనాభా నియంత్రణ బిల్లుని ప్రవేశపెట్టబోతోంది. ముస్లింలను టార్గెట్ చేస్తూ ఈ చట్టాన్ని తెరపైకి తెస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నా.. ఇప్పుడు సొంత పార్టీలోనే దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. జనాభా బిల్లు అమలులోకి వస్తే.. బీజేపీ నేతలే ఇరుకునపడతారని ప్రతిపక్షాలు కూడా సెటైర్లు పేలుస్తున్నాయి. పార్లమెంట్ లో, యూపీ అసెంబ్లీలో ఎంతమంది నేతలకు, ఎంతమంది పిల్లలు ఉన్నారనే లెక్కలు తీసిమరీ బీజేపీ పరువు తీస్తున్నాయి ప్రతిపక్షాలు.

యోగి లాంటి బ్రహ్మచారులకు బీజేపీ పెట్టింది పేరు. వారసులు, వారసత్వం లేని రాజకీయం మాది అంటూ బీజేపీ గొప్పలు చెప్పుకోడానికి కూడా కారణం ఇదే. అయితే అదే సమయంలో బీజేపీ నేతల్లో చాలామంది బహుసంతానం కలిగి ఉన్నారు. ప్రస్తుతం యూపీ సర్కారు తెస్తున్న జనాభా బిల్లు కేవలం స్థానిక ఎన్నికలలో పోటీ చేసేవారికి అడ్డంకిగా మారుతుంది. అదే సమయంలో ఇదే బిల్లుని అసెంబ్లీ ఎన్నికలకు కూడా అన్వయిస్తే.. ప్రస్తుతం యూపీ అసెంబ్లీలో ఉన్న 152మంది బీజేపీ ఎమ్మెల్యేలు తిరిగి పోటీ చేయడానికి అనర్హులవుతారు.

ఉ‍త్తర ప్రదేశ్‌ అసెంబ్లీలో మొత్తం 387 సీట్లు ఉండగా అందులో 304మంది బీజేపీ సభ్యులు. వీరిలో 152 మంది ఎమ్మెల్యేలకు ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు. 15మంది సమాచారం అందుబాటులో లేదు. ఈ వివరాలన్నీ ఉత్తర ప్రదేశ్‌ అసెంబ్లీ అధికారిక వెబ్‌ సైట్‌ లోనే ఉన్నాయి. ప్రస్తుతం ఈ వివరాలతో బీజేపీపై ఎదురుదాడికి దిగుతున్నాయి వైరి వర్గాలు.

పార్లమెంట్ లో కూడా అమలు చేస్తారా..?
జనాభా బిల్లుతో గల్లీ లీడర్లకు చెక్ పెడుతున్నారు సరే మరి ఢిల్లీ లీడర్ల సంగతేంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేవారికి ఇద్దరు పిల్లల నిబంధన విధిస్తున్న ప్రభుత్వాలు, పార్లమెంట్ కి పోటీ చేసేవారికి కూడా ఇవే నిబంధనలు ఎందుకు అమలు చేయవంటూ ప్రశ్నిస్తున్నారు. క్షేత్రస్థాయిలో స్థానిక సంస్థల్లో పోటీ చేయాలనుకునే నాయకులు అనర్హులైతే, ఆ అసంతృప్తి అంతా తమకు చేటు తెస్తుందని పెద్ద స్థాయి నాయకులు మథనపడుతున్నారు.

అన్నిటికంటే విచిత్రం ఏంటంటే.. జనాభా బిల్లుని లోక్ సభలో ప్రైవేటు బిల్లూగా ప్రవేశపెట్టేందుకు బీజేపీ ఎంపిక చేసిన ఎంపీ, భోజ్ పురి నటుడు రవిశంకర్ కి ఏకంగా నలుగురు సంతానం. ఈ విషయాన్నే ఇప్పుడు ప్రతిపక్షాలు హైలెట్ చేస్తూ బీజేపీపై సెటైర్లు పేలుస్తున్నాయి.

ఇక ఇదే చట్టాన్ని పార్లమెంటుకు అన్వయిస్తే ప్రస్తుతం ఉన్న లోక్‌ సభ సభ్యుల్లో 168 మంది అనర్హులు అవుతారు. ఇక్కడ కూడా బీజేపీదే మెజార్టీ. ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలున్న ఎంపీలు బీజేపీ తరఫున 105 మంది లోక్ సభలో ఉన్నారు. కేవలం స్థానిక ఎన్నికలకే అన్వయించాలనుకుంటున్న ఈ చట్టం పరిధిలోకి అసెంబ్లీ, పార్లమెంట్ ని కూడా తీసుకొస్తే మాత్రం బీజేపీ నేతలకే అది బిగ్ షాక్. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో స్థానిక ఎన్నికల నియమావళిలో ఇద్దరు పిల్లల నిబంధన ఉంది. కొత్తగా దీన్ని తీసుకు రావాలనుకుంటున్న యూపీ సర్కారు ఇప్పుడు నవ్వులపాలవుతోంది.

First Published:  15 July 2021 3:41 AM IST
Next Story